శేరిలింగంపల్లి బీఆర్‌ఎస్‌ను నడిపించేదెవరు..?

శేరిలింగంపల్లికి బలమైన నేత కోసం బీఆర్ఎస్ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఈ నియోజకవర్గం అరెకపూడి గాంధీ కనుసన్నల్లోనే కొనసాగింది.

Update: 2024-09-29 03:36 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: శేరిలింగంపల్లికి బలమైన నేత కోసం బీఆర్ఎస్ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఈ నియోజకవర్గం అరెకపూడి గాంధీ కనుసన్నల్లోనే కొనసాగింది. ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరడంతో గులాబీకి గడ్డుపరిస్థితులు నెలకొన్నాయి. డివిజన్ కార్పొరేటర్లు ఇద్దరు మినహా మిగిలిన వారంతా పార్టీ మారడంతో కేడర్‌లో నైరాశ్యం నెలకొంది. వారిని బయటపడేయడంతో పాటు కేడర్‌ను కాపాడుకోవడం, పార్టీని పటిష్టం చేసేందుకు అధిష్టానం కసరత్తు ప్రారంభించింది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టిసారించింది.

కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యే..

ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ శేరిలింగంపల్లి నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన బీఆర్ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరారు. దీంతో ఆ నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలు స్తంభించాయి. అంతేకాదు అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో 11 డివిజన్లు ఉండగా ఇద్దరు మినహా మిగిలిన వారంతా కాంగ్రెస్‌లో చేరారు. దీంతో పార్టీ బలహీనపడింది. కేడర్ ఉన్నప్పటికీ నేతల కొరత ఏర్పడింది

రివర్స్ కొట్టిన ఎమ్మెల్యే ‘సుప్రీం’ పాలసీ..

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించినప్పటి నుంచి జరిగిన మూడు ఎన్నికల్లో గాంధీకే బీఆర్ఎస్ పార్టీ బీఫాం ఇచ్చింది. వరుస విజయాలతో హ్యాట్రిక్ సాధించారు. ఈ సెగ్మెంట్‌లో పార్టీకి బలమైన కేడర్ ఉంది. ఇప్పుడు గాంధీతో పాటు కార్పొరేటర్లు పార్టీ మారడంతో నాయకత్వ లోపం ఏర్పడింది. దీనికి తోడు బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో నియోజకవర్గానికి ఎమ్మెల్యేనే సుప్రీం చేసింది. ఎమ్మెల్యేకు నియోజకవర్గ ఇన్‌చార్జి బాధ్యతలను అప్పగించింది. దీంతో నియోజకవర్గాల్లో సెకండ్ నేత ఎదగలేదు. శేరిలింగంపల్లిలోనూ అదే పరిస్థితి. ద్వితీయశ్రేణి నాయకుడు లేకపోవడంతో గడ్డుపరిస్థితిని ఎదుర్కొంటుంది. పార్టీని నడిపేవారికోసం వెతుకులాటను ప్రారంభించింది.

కేడర్‌ను కాపాడుకునే పనిలో పార్టీ నిమగ్నం..

శేరిలింగంపల్లి సెగ్మెంట్లలో ఎమ్మెల్యేతో పాటు కీలక నేతలంతా పార్టీ మారారు. కేడర్ బలంగా ఉంది. అయితే వీరు పార్టీ మారకుండా చర్యలు చేపడుతుంది. రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమే అని, పార్టీ కోసం కష్టపడే వారికి భవిష్యత్ ఉంటుందని, కేడర్‌లో భరోసా నింపేందుకు బీఆర్‌ఎస్ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. పార్టీ మారిన వారికి ఇతర పార్టీల్లో తగిన గుర్తింపు లేదని, వారిపై అనర్హత వేటుపడుతుందని, ఉప ఎన్నికలు రాబోతున్నాయని కేటీఆర్ చెబుతున్నారు. కార్యకర్తలే నేతలుగా ఎదిగే సమయం వచ్చిందని, పార్టీ కోసం పనిచేయాలని, సముచిత స్థానం కల్పిస్తామని భరోసా ఇస్తున్నారు. పార్టీ మారి ఇబ్బందులు పడొద్దని ఏకష్టం వచ్చినా ఫోన్ చేయవచ్చని.. ఫోన్ చేసిన క్షణాల్లో మీ దగ్గర ఉంటామని పేర్కొంటున్నారు.

ప్రత్యామ్నాయంపై పార్టీ దృష్టి..

అసెంబ్లీ సెగ్మెంట్‌లో పార్టీ అధిష్టానం ప్రత్యామ్నాయంపై దృష్టిసారించింది. కేడర్‌కు ఇబ్బందులు వస్తే వారికి భరోసా కల్పించేందుకు నేత లేకపోతే ఇబ్బందులు తలెత్తుతాయని భావించి తాత్కాలిక ఇన్‌చార్జి బాధ్యతలను కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుకు అప్పగించింది. అయితే త్వరలోనే పార్టీ అధినేత కేసీఆర్‌ను సంప్రదించి ఇన్‌చార్జీని నియమించనున్నట్లు కేటీఆర్ తెలిపారు. అందుకోసం నియోజకవర్గంలో బలమైన నేతల వివరాలను సేకరిస్తుంది. ఇప్పటికే ఇన్‌చార్జి బాధ్యతల కోసం పార్టీ నేతలు సాయిబాబా, రంగారావు ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. అయితే వీరికి అప్పగించాలా? మరొకరికి బాధ్యతలు అప్పగించాలా? ఎవరైతే గాంధీకి ధీటుగా పనిచేస్తారు? ఉప ఎన్నిక వస్తే వారికే పార్టీ భీఫాం ఇస్తే విజయం సాధిస్తారా? అనే కోణంలో ఆరా తీస్తుంది. శేరిలింగంపల్లిపై ప్రత్యేక దృష్టిసారించిన పార్టీకి.. నేత ఎంపిక మాత్రం సవాల్‌గా మారింది. పార్టీలో ప్రస్తుతం యాక్టీవ్‌గా పనిచేసే వారికే ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగిస్తుందా? లేకుంటే కొత్త వ్యక్తిని తీసుకొస్తారా? అనేది సర్వత్రా ఆసక్తి నెలకొంది.


Similar News