మీరు చేస్తే సంసారం.. మేము చేస్తే ఇంకొకటా..? BRS నేతలకు ఎమ్మెల్యే ఐలయ్య స్ట్రాంగ్ కౌంటర్

పార్టీ ఫిరాయింపులపై ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ నేతలు చేస్తోన్న విమర్శలకు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

Update: 2024-07-09 10:47 GMT

దిశ, వెబ్‌డెస్క్: పార్టీ ఫిరాయింపులపై ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ నేతలు చేస్తోన్న విమర్శలకు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మంగళవారం అసెంబ్లీ సీఎల్పీ హాల్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పార్టీ ఫిరాయింపుల పాల్పడిందే మొదట బీఆర్ఎస్ పార్టీ అని, మీరు చేస్తే సంసారం మేము చేస్తే ఇంకొకటా..? అని దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో దందాలు, కాంట్రాక్టర్ల కోసం ఎమ్మెల్యేలు బీఆర్ఎస్‌లో చేరారని కానీ ఇప్పుడు ప్రజా పాలన కోసం ఆ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లోకి వస్తున్నారని అన్నారు. ప్రజలతో పేగు బంధాన్ని తెంచుకుందే కేసీఆర్ అని ఇప్పుడు ఏ మొఖం పెట్టుకుని ఆయన పాదయాత్ర చేస్తాడని ప్రశ్నించారు. తెలంగాణలో బీఆర్ఎస్‌కు మనుగడ లేదని, గల్లీలో మొహం లేకనే కేటీఆర్, హరీష్ రావు, ఎంపీ సురేష్ రెడ్డిలు ఢిల్లీ బాట పట్టారని ఎద్దేవా చేశారు.

బీజేపీతో ఫ్రెండ్‌షిప్ కోసం ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నారని.. బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేయడానికి సిద్ధపడ్డారని సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఒక ఎంపీ సీటు అయినా గెలిచారా..? ఏ మొఖం పెట్టుకొని ఈ రోజు ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టారని నిలదీశారు. ప్రజా పాలన, సంక్షేమ పథకాలు చూసి అందులో భాగస్వాములు కావడానికే ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారని స్పష్టం చేశారు. పార్టీ ఫిరాయింపులకు పాల్పడట్లేదని క్లారిటీ ఇచ్చారు. ఎన్నికలు వస్తేనే కేసీఆర్ యాత్రలు చేస్తాడని, బీఆర్ఎస్ అధికారంలో ఉన్న పదేండ్లలో ఆయన ఏ జిల్లాలో పర్యటించలేదని విమర్శించారు. పదేళ్లు తెలంగాణ సొత్తును మొత్తం దోచుకపోయారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటన చేపట్టాడని, దాన్ని చూసి ఓర్వలేకనే మా పైన బురద జల్లుతున్నారని ఫైర్ అయ్యారు. 


Similar News