Musi River : మూసీ బాధితులకు మద్దతుగా బీజేపీ ధర్నా.. సీఎం మండిపడ్డ కిషన్ రెడ్డి

Update: 2024-10-25 06:48 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ (Telangana)లో మూసీ ఫైట్ ముదురుతోంది. అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధంతో మొదలైన ఈ ఫైట్ ఇప్పుడు ధర్నాల వరకు చేరింది. తాజాగా బీజేపీ (BJP) ఏకంగా మూసీ బాధితుల పక్షాన ధర్నాకు దిగింది. శుక్రవారం నాడు ఇందిరా పార్క్‌లోని ధర్నా చౌక్ ప్రాంతంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) అధ్యక్షతన బీజేపీ నాయకులు, కార్యకర్తలు బాధితులతో కలిసి ధర్నాకు దిగారు.

ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. అసలు మూసీ పరివాహక ప్రాంతం గురించి ముఖ్యమంత్రికి ఏం తెలుసని కిషన్ రెడ్డి సవాలు విసిరారు. ఎన్నో ఏళ్ల నుంచి ఈ పేదలంతా మూసీ ప్రాంతంలో నివశిస్తున్నారని, వీరికి ప్రభుత్వాలే ఓటరు కార్డులిచ్చాయని, ప్రభుత్వ నిధులు ఖర్చుపెట్టి రోడ్లు, కరెంట్ లాంటి మౌలిక సదుపాయాలు కల్పించడం కూడా జరిగిందని, అలాంటిది ఇప్పుడు ఉన్నట్లుండి వాళ్ల ఇళ్లు కూల్చేస్తామనడం అన్యాయమని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం సవాలు స్వీకరించడానికి మేము సిద్ధంగా ఉన్నామని, మూసీ ప్రజల ఇళ్లను కాపాడడం కోసం నదీ పరివాహక ప్రాంతంలో ఉండటానికైనా తాము సిద్ధమేనని, పేదల ఇళ్లు కూల్చేస్తే చంచల్‌గూడ జైలుకు వెళ్లడానికైనా సిద్ధంగా ఉన్నామని కిషన్ రెడ్డి నిప్పులు చెరిగారు.

‘‘మూసీ సుందరీకరణ ముఖ్యమా? కాలనీలకు రోడ్లు ముఖ్యమా? గ్రేటర్ మున్సిపాలిటీకి, వాటర్ బోర్డుకు, వీధి లైట్ల కోసం నిధులు లేవు. లక్షా 50 వేల కోట్లు అప్పు తెచ్చి మూసీ సుందరీకరణ అవసరమా..? మూసీ పరివాహకంలో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలు, బస్టాండ్, మెట్రో స్టేషన్ పరిస్థితి ఏంటి..? మూసీ పక్కన ఏళ్లుగా ఉన్న దేవాలయాలను కూల్చే దమ్ముందా..? పేదలపై ప్రతాపం ఎందుకు చూపిస్తున్నారు?’’ అని కిషన్ రెడ్డి నిప్పులు చెరిగాడు.


Similar News