సాంస్కృతిక కళా సారధి చైర్ పర్సన్‌గా డాక్టర్ వెన్నెల

రాష్ట్ర సాంస్కృతిక కళా సారధి చైర్ పర్సన్ గా డాక్టర్ వెన్నెల సోమవారం బాధ్యతలు స్వీకరించారు

Update: 2024-11-25 16:14 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర సాంస్కృతిక కళా సారధి చైర్ పర్సన్ గా డాక్టర్ వెన్నెల సోమవారం బాధ్యతలు స్వీకరించారు. సోమవారం మాదాపూర్‌లోని సాంస్కృతిక సారథి కార్యాలయంలో జరిగిన కార్యక్రమానికి పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు, టీపీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ మ‌హేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్సీలు ప‌ట్నం మ‌హేంద‌ర్ రెడ్డి, ప్రొఫెస‌ర్ కోదండ‌రాం, మాజీ ఎంపీ వి.హనుమంతరావు, సినీ న‌టుడు ఆర్, నారాయ‌ణ మూర్తి, విమ‌ల గ‌ద్దర్, భాషా, సాంస్కృతిక శాఖ సంచాల‌కులు డా. మామిడి హరి కృష్ణణ్​ త‌దిత‌రులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి జూప‌ల్లి మాట్లాడుతూ... ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి, సంక్షేమ పథకాలను విస్తృతంగా ప్రచారం క‌ల్పించ‌డంతో పాటు స‌మాజాన్ని జాగృతం చేయ‌డంలో వెన్నెల సార‌ధ్యంలోని సాంస్కృతిక సార‌ధి విభాగం కృషి చేయాల‌ని అన్నారు. ప్రజలను చైతన్యవంతం చేయడంతో పాటు తెలంగాణ సాంస్కృతిక ఔనత్యాన్ని ఇనుమడించే విధంగా కార్యక్రమాలను చేపట్టాలని సూచించారు. తెలంగాణ సాంస్కృతిక సార‌ధి మ‌రింత బలోపేతం కావాల‌ని అకాంక్షించారు.

టీపీసీసీ అధ్యక్షుడు మ‌హేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధ‌న‌లో ప్రజా గాయ‌కుడు గ‌ద్దర్ కీల‌క పాత్ర పోషించార‌న్నారు. తెలంగాణ కోసం అహ‌ర్నిష‌లు కృషి చేశార‌ని ఆయ‌న సేవ‌ల‌ను కొనియాడారు. సీఎం రేవంత్ రెడ్డి సార‌ధ్యంలోని ప్రభుత్వం, యుద్ధనౌక గద్దర్‌ ఆశయ సాధ‌న కోసం కృషి చేస్తుంద‌ని అన్నారు. గ‌ద్గర్ అడుగుజాడ‌ల్లో న‌డుస్తున్న ఆయ‌న కూతురు డా. వెన్నెల‌ను సాంస్కృతిక క‌ళా సార‌ధి చైర్ పర్సన్ గా నియ‌మించి స‌ముచిత స్థానం క‌ల్పించామన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హ‌యంలో ఆట‌, పాట‌కు ఆద‌ర‌ణ‌ దక్కలేదని, క‌ళాకారుల‌కు స‌రైన గుర్తింపు లభించలేదన్ఆరు. ప్రజాప్రభుత్వంలో కళాకారులందరికీ సముచిత గౌరవం లభిస్తుందని వివరించారు.


Similar News