కొండా సురేఖ VS కేటీఆర్.. మీడియా, సోషల్ మీడియా సంస్థలకు కోర్టు నోటీసులు
కేటీఆర్ పై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల్ని సిటీ సివిల్ కోర్టు తప్పుబట్టింది. వాటన్నింటినీ వెంటనే మీడియా, సోషల్ మీడియా నుంచి తొలగించాలని నోటీసులు జారీ చేసింది.
దిశ, వెబ్ డెస్క్: తనపై మంత్రి కొండా సురేఖ (Konda Surekha) చేసిన వ్యాఖ్యల కారణంగా పరువుకు భంగం కలిగిందని పేర్కొంటూ.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) వేసిన రూ.100 కోట్ల పరువునష్టం దావా కేసుపై సిటీ సివిల్ కోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఉండి.. ఇటువంటి వ్యాఖ్యలు చేయడం ఆశ్చర్యంగా ఉందని పేర్కొన్న కోర్టు.. ఆ వ్యాఖ్యలు చాలా అభ్యంతరకరంగా ఉన్నాయని మండిపడింది. భవిష్యత్ లో ఇలాంటి వ్యాఖ్యలు చేయరాదని కొండా సురేఖకు సూచించింది.
అలాగే.. కేటీఆర్ పై కొండా సురేఖ చేసిన అభ్యంతరకర వ్యాఖ్యల్ని ప్రసారం చేసిన, రాసిన మీడియా వెంటనే ఆ కథనాలను తొలగించాలని కోర్టు ఆదేశించింది. అలాగే అన్ని సోషల్ మీడియా ప్లాట్ ఫాంలు ఆ వీడియోలను తొలగించాలని పేర్కొంది. యూ ట్యూబ్ (Youtube), ఫేస్ బుక్ (Face Book), గూగుల్ (Google) సంస్థలకు సైతం ఈ మేరకు సిటీ సివిల్ కోర్టు (City Civil Court) నోటీసులు జారీ చేసింది. ఆమె చేసిన వ్యాఖ్యలు సమాజంపై చెడు ప్రభావాన్ని చూపుతాయని అభిప్రాయపడిన కోర్టు.. ఎలాంటి పబ్లిక్ డొమైన్ లోనూ సంబంధిత వ్యాఖ్యలు ఉండరాదని స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఈ నెల 27వ తేదీకి వాయిదా వేసింది.