మూసీ ప్రాజెక్టుపై బీఆర్ఎస్ వైఖరేంటి?

మూసీ రివర్‌ప్రంట్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టుపై గతంలో పురపాలక మంత్రిగా పనిచేసిన కేటీఆర్ అసంబద్ధమైన కామెంట్లు చేస్తున్నారని, ఆ పార్టీకి గానీ, ఆయనకు గానీ స్పష్టమైన వైఖరే లేకుండాపోయిందని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Update: 2024-10-02 17:29 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : మూసీ రివర్‌ప్రంట్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టుపై గతంలో పురపాలక మంత్రిగా పనిచేసిన కేటీఆర్ అసంబద్ధమైన కామెంట్లు చేస్తున్నారని, ఆ పార్టీకి గానీ, ఆయనకు గానీ స్పష్టమైన వైఖరే లేకుండాపోయిందని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టును ఎందుకు వ్యతిరేకిస్తున్నారో... గత ప్రభుత్వంలో ప్రత్యేకంగా కార్పొరేషన్‌ ఎందుకు ఉనికిలోకి వచ్చిందో వివరించాలని డిమాండ్ చేశారు. కేవలం రాజకీయాల కోసం విమర్శించడం ఆయన అవివేకానికి నిదర్శనమన్నారు. ఈ ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం టేకప్‌ చేస్తే ఏఐసీసీ నేత రాహుల్‌గాంధీకి ఏం సంబంధమని మంత్రి పొన్నం ప్రశ్నించారు. చిల్లర రాజకీయాలు మాని హుందాగా వ్యవహరిస్తే ప్రజలు ఆదరిస్తారని, లేకుంటే పార్లమెంటు ఎన్నికల్లో గుండు సున్నా వచ్చినట్లు రానున్న రోజుల్లో ఆ పార్టీని ప్రజలు పాతర వేయక తప్పదని హెచ్చరించారు. మూసీ ప్రాజెక్టుపై తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ రాహుల్‌గాంధీ, సీఎం రేవంత్‌కు వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలను మంత్రి పొన్నం తీవ్ర స్థాయిలో తప్పుపట్టారు.

రాష్ట్ర పరిపాలనతో సంబంధం లేని రాహుల్‌గాంధీ పేరును మూసీ ప్రాజెక్టుకు లింకు పెట్టి ప్రస్తావించడం కేటీఆర్ అవివేకానికి నిదర్శనమన్నారు. ఇంతకూ మూసీ ప్రాజెక్టుపై బీఆర్ఎస్ వైఖరేంటని ప్రశ్నించారు. గతంలో ఈ ప్రాజెక్టు విషయంలో ఆక్రమణల తొలగింపు, బాధితులకు పునరావాసం కల్పించడం, నష్టపరిహారం చెల్లించడం తదితర అంశాలపై అధికారులతో స్వయంగా రివ్యూ చేసి తీసుకున్న నిర్ణయాలపైనా కేటీఆర్ వైఖరేంటో చెప్పాలని ప్రశ్నించారు. గతంలో మాటలకే పరిమితమైన ప్రభుత్వ పనితీరు ఇప్పుడు కాంగ్రెస్ ఆధ్వర్యంలో చేతల్లోకి వచ్చిందని, ఎట్టి పరిస్థితుల్లో బాధితులకు అన్యాయం జరగకుండా చూస్తామని, ఆ దిశగానే అధికారులకు ఆదేశాలు ఇవ్వడంతో పాటు ప్రజలకు అర్థం చేయిస్తున్నామన్నారు. ప్రత్యమ్నాయం చూపకుండా ఒక ఇంటిని కూడా తొలగించబోమని స్పష్టం చేశారు. పేదల పార్టీగా కాంగ్రెస్‌కు దేశవ్యాప్తంగా గుర్తింపు ఉన్నదని, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంపై దృష్టి సారిస్తుంటే ప్రతిపక్షంగా బాధ్యతతో వ్యవహరించి ప్రభుత్వానికి నిర్మాణాత్మక సూచనలు చేయకుండా విమర్శలకు పరిమితం కావడం దురదృష్టకరమన్నారు.

317 జీవో బాధితులకు త్వరలోనే పరిష్కారం

గత ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 317 తో ఉపాధ్యాయులకు అన్యాయం జరిగిందని, దీన్ని అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే తమ దృష్టికి బాధితులు తీసుకొచ్చారని, పరిష్కరించడంపై ప్రభుత్వం దృష్టి సారించిందని మంత్రి పొన్నం ప్రభాకర్ క్లారిటీ ఇచ్చారు. స్థానికత ఆధారంగా బదిలీలు జరగాలనే డిమాండ్‌తో గాంధీభవన్ దగ్గర నిరసన చేస్తున్న బాధితుల అంశాన్ని మంత్రి ప్రస్తావిస్తూ, పరిష్కారం దిశగానే ప్రభుత్వం కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసిందని, మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు ఇటీవల అమెరికా, కొరియా పర్యటనలో ఉండడం, రాగానే అసెంబ్లీ సమావేశాల్లో నిమగ్నం కావడం, ఇప్పుడు వివిధ అధికారిక కార్యకలాపాల్లో పాల్గొనాల్సి రావడంతో విధాన నిర్ణయం తీసుకోవడానికి సమయం చిక్కలేదని వివరించారు. గత ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో కారణంగానే సమస్యలు తలెత్తాయని, వీటిని ఇప్పుడు ప్రభుత్వ వ్యతిరేక అవసరాల కోసం బీఆర్ఎస్ వాడుకోవడం పై ఆగ్రహం వ్యక్తం చేశారు. జీవో తీసుకొచ్చిన నేతలే విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు.

కేబినెట్ సబ్ కమిటీలో సభ్యుడిగా ఉన్న తనకు ఈ అంశంపై అవగాహన ఉన్నదని, కమిటీ ఏ స్థాయిలో పరిష్కారం కనుగొనాలనే తపనతో ఉన్నదో తనకు తెలుసన్నారు. ఎట్టి పరిస్థితుల్లో బాధితులకు అన్యాయం జరగదని భరోసా ఇచ్చిన మంత్రి పొన్నం... ఈ అంశంతో ముడిపడిన పలు సమస్యలపై అధ్యయనం చేశామన్నారు. గాంధీ జయంతి రోజు అబద్ధం ఆడాల్సిన అవసరం లేదని, ఈ సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని స్పష్టం చేశారు. చెప్పుడు మాటలు విని ఆందోళనలకు గురికావద్దని సూచించారు.


Similar News