తెలంగాణలో ఫ్యూయల్ సెల్ కంపెనీలు.. తొషీబా కంపెనీకి డిప్యూటీ సీఎం ఆహ్వానం

తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని తొషీబా కంపెనీని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆహ్వానించారు...

Update: 2024-10-02 17:22 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: జపాన్ పర్యటనలో ఉన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అక్కడి తొషీబా కంపెనీని సందర్శించి ప్రతినిధులతో సమావేశమయ్యారు. తెలంగాణ ప్రభుత్వం సౌర విద్యుత్ ఉత్పత్తి, వినియోగంపై దృష్టి సారించిందని, అందుకు అవసరమైన ఫ్యూయల్ సెల్, సోలార్ ఉపకరణాల తయారీ ప్లాంట్‌ను నెలకొల్పాలని విజ్ఞప్తి చేశారు. పరిశ్రమల స్థాపనకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధానాల సంపూర్ణ సహకారం అందిస్తుందని, భవిష్యత్తు విద్యుత్ అవసరాలను పరిగణనలోకి తీసుకుని కొత్త ప్లాంట్‌ను నెలకొల్పాలని కోరారు. తోషిబా ఎనర్జీ సిస్టమ్స్ అండ్ సొల్యూషన్స్ ఉన్నతాధికారి హిరోషి కనేట, వైస్ ప్రెసిడెంట్ షిగే రిజో కవహర తదితరులతో సుదీర్ఘ సమావేశం నిర్వహించిన డిప్యూటీ సీఎం... పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా తోషిబా ఉత్పత్తుల సేవల గురించి తెలుసుకున్నారు. ఎలక్ట్రానిక్ వస్తువుల ఉత్పత్తి కంపెనీగా గుర్తింపు పొందిన తోషిబా... ఇప్పుడు పర్యావరణహిత సోలార్ ఉత్పత్తులలో అగ్రగామిగా ఉందని ఆ కంపెనీ ప్రతినిధులు డిప్యూటీ సీఎంకు వివరించారు.

సోలార్ విద్యుత్తులో వినియోగించే ఫోటో వోల్టాయిక్ మాడ్యూల్స్ తయారీ, ఫ్యూయల్ సెల్, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ టెక్నాలజీ, శక్తివంతమైన జనరేటర్లు, జీరో కార్బన్ ఎమిషన్ టెక్నాలజీలను వృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం పెద్ద ఎత్తున సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేయబోతున్నదని, దీనికి అవసరమైన ఫోటో వోల్టాయిక్ మాడ్యూల్స్ కూడా పెద్ద సంఖ్యలో కావలసి ఉంటుందని, రానున్న రోజుల్లో ‘ఫ్యూచర్ సిటీ’లో ఫ్యూయల్ సెల్ టెక్నాలజీ వినియోగం ఎక్కువగా ఉంటుందన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్రంలో యూనిట్లను ఉమ్మడి భాగస్వామ్యంతో ఏర్పాటు చేయడానికి ముందుకు రావాలని కోరారు. విద్యుత్ ఉత్పత్తిలో కీలకమైన ఆధునిక జనరేటర్లు, విద్యుత్ పొదుపు, నిల్వ ఉత్పత్తులు, విద్యుత్ వాహనాల బ్యాటరీలు, సంబంధిత సేవలు తెలంగాణలో అవసరమని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పెట్టుబడులతో తరలి రావాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణను ఎలక్ట్రానిక్ హబ్‌గా మార్చడానికి రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నదని, ఫ్యూచర్ సిటీలో గ్రీన్ ఎలక్ట్రికల్ వెహికల్స్‌కు అగ్రస్థానం ఉంటుందని వివరించారు.

తెలంగాణలో అడుగు పెడతాం: తోషిబా

తెలంగాణలో తోషిబా కంపెనీ సేవలను విస్తరిస్తామని ప్రతినిధులు డిప్యూటీ సీఎంకు వివరించారు. భారతదేశంలో కేవలం మూడు రాష్ట్రాల్లో మాత్రమే తమ యూనిట్లు పనిచేస్తున్నాయని, ఇందులో ఒకటి ఇప్పటికే తెలంగాణలో ఉన్నదని, దీన్ని మరింతగా విస్తరిస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రం పరిశ్రమల స్థాపనకు, వ్యాపార విస్తరణకు ఎంతో అనుకూలంగా ఉన్నందున స్వయంగా లేదా రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో పరిశ్రమలను విస్తరించేందుకు సానుకూలంగా ఆలోచిస్తున్నట్లు వివరించారు. ప్రస్తుత ఈవీ వెహికల్స్ ఉత్పత్తి సామర్థ్యాన్ని మరింతగా పెంచుతామని, ప్లాంట్ విస్తరణకు ప్రయత్నిస్తామని తోషిబా అధికారులు తెలిపారు. తోషిబా ఫ్యూయల్ సెల్ తయారీ యూనిట్‌ను సందర్శించి న్యూక్లియర్, థర్మల్ పవర్ ఉత్పత్తిలో వినియోగించే టర్బైన్లు, జనరేటర్ల తయారీ యూనిట్‌ను పరిశీలించారు. ఫోటో వోల్టాయిక్ మాడ్యూల్స్, ఇతర బ్యాటరీల తయారీ విధానాన్ని కూడా పరిశీలించారు. డిప్యూటీ సీఎం వెంట రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఇంధన శాఖ కార్యదర్శి రోనాల్డ్ రోస్, సింగరేణి సిఎండీ బలరామ్, భారత రాయబార కార్యాలయ అధికారులు బన్సల్ దేవజాని పాల్గొన్నారు.

ఇకపైన ఆర్టీసీలో అన్నీ ఎలక్ట్రిక్ బస్సులే:

రాష్ట్రంలోని ఆర్టీసీ యాజమాన్యం ఇకపైన కొనుగోలు చేసేవన్నీ ఎలక్ట్రిక్ బస్సులేనని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఇప్పుడున్న బస్సులను కూడా ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చడానికి ఉన్న సాధ్యాసాధ్యాలను కూడా పరిశీలిస్తామన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తోషిబా సేవలు ఆర్టీకి అవసరమవుతాయన్నారు. సింగరేణి సైతం విస్తరణ చర్యల్లో భాగంగా బొగ్గుతో పాటు లిథియం వంటి ఇతర ఖనిజ తవ్వకాలపై దృష్టి పెట్టనున్నదని పేర్కొన్నారు. లిథియం బ్యాటరీల ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉన్న తోషిబా, సింగరేణితో సంయుక్త భాగస్వామ్యఫై త్వరలో స్పష్టత వస్తుందన్నారు. జపాన్‌లో ప్రజా రవాణా (పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్) వ్యవస్థలో బుల్లెట్ ట్రెయిన్ కీలకంగా ఉన్నదని డిప్యూటీ సీఎం వ్యాఖ్యానించారు. ప్రజా రవాణా వ్యవస్థలో జపాన్ ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తుందన్నారు. టోక్యో నుంచి ఒసాకా వరకు బుల్లెట్ ట్రైన్‌లో ప్రయాణించారు. 700 కి.మీ. పొడవైన దూరాన్ని కేవలం 2.20 గంటల్లోనే చేరుకున్నట్లు తెలిపారు.


Similar News