Kishan Reddy: తెలంగాణపై మోడీ మాస్టర్ ప్లాన్... మోడీ మీటింగ్ వివరాలు వెల్లడించిన కిషన్ రెడ్డి

రేవంత్ సర్కార్ కూలిపోతే బీజేపీ ఆపబోదని కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-11-27 11:49 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: కేంద్ర పథకాలు సమగ్రంగా అమలు చేసేలా పని చేయాలని టీ బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలకు ప్రధాని నరేంద్ర మోడీ దిశానిర్దేశం చేశారని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి (Kishan Reddy) చెప్పారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం వచ్చేలా సమిష్టిగా కష్టపడి పని చేయాలని సూచించారన్నారు. బుధవారం ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీ (Prime Minister Narendra Modi) తో తెలంగాణ ఎంపీలు, ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. అనంతరం ఈ సమావేశం వివరాలను కిషన్ రెడ్డి మీడియాకు వివరించారు. రాష్ట్రంలో కేంద్ర పథకాల అమలు తీరుపై ప్రధాని ఆరా తీసినట్లు చెప్పారు. ఆరు గ్యారెంటీలతో పాటు అనేక సబ్ గ్యారెంటీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ వాటిని అమలు చేయడంలో విఫలం అయిందని విమర్శించారు. సమస్యల మీద సీఎంని ప్రశ్నిస్తే ఆయన వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని, గత సీఎం కేసీఆర్ (KCR) లాగే రేవంత్ రెడ్డి (Revanth Reddy) కూడా వ్యవహరిస్తున్నారన్నారని ఫైర్ అయ్యారు. ఈ ఏడాదిలో ఈ ప్రభుత్వం సాధించింది ఏంటి? బెదిరింపులు, తిట్లపురాణాలు, వ్యక్తిగత దాడులు, అక్రమ కేసులు గాలిమాటలు తప్ప ఈ సంవత్సరంలో సాధించింది ఏంటని ప్రశ్నించారు. తాను ఏదైనా సమస్యపై మాట్లాడితే కిషన్ రెడ్డి డీఎన్ఏ ఏంటని మాట్లాడుతున్నారు. నాది బీజేపీ డీఎన్ఏ అని మీలా పది పార్టీలు తిరిగిన డీఎన్ఏ నాది కాదని కిషన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. మూసీపై ఆందోళన చేస్తే గుజరాత్ గులాం అని మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

డిసెంబర్ 1 నుంచి కాంగ్రెస్ ఏడాది వైఫల్యాలపై ప్రచారం:

డిసెంబర్ 1వ తేదీ నుంచి 5వ తేదీ వరకు కాంగ్రెస్ ప్రభుత్వ ఏడాది పాలనలోని వైఫల్యాలను రాష్ట్రవ్యాప్తంగా వివరిస్తామన్నారు. గత నాలుగైదు నెలలుగా రెసిడెన్షియల్ స్కూళ్లలో అనేక సంఘటనలు జరుగుతుంటే సీఎం పట్టించుకోవడం లేదు. సీఎం ప్రతిపక్ష నేతలపై వ్యక్తిగత దాడులు చేసేందుకు పెట్టే సమయం ప్రభుత్వం గాడిన పెట్టడంపై వెచ్చిస్తే బాగుంటుందన్నారు. వాంకిడి స్కూల్ లో శైలజ అనే గిరిజన అమ్మాయి ఫుడ్ పాయిజన్ తో చనిపోయింది. ఇలాంటి వాటిపై సీఎం దృష్టి సారించాలన్నారు. ఇప్పటికైనా సీఎం నిర్మాణాత్మకమైన పాలనపై ఫోకస్ చేయాలని బీజేపీ పక్షాన సూచిస్తున్నానన్నారు.

ప్రభుత్వాలు కూల్చే అవసరం లేదు:

తెలంగాణలో ప్రభుత్వాన్ని పడగొట్టే ఆలోచన బీజేపీ (BJP)కి లేదన్నారు. వాళ్లే చీలిపోయి పడిపోతామంటే కట్టెలు పెట్టి ఆపాల్సిన అవసరం మాకు లేదన్నారు. తెలంగాణతో పాటు కర్ణాటక ఇతర రాష్ట్రాల్లో ప్రభుత్వాలను పడగొట్టే ఆలోచన మాకు లేదన్నారు. రాజకీయ ఆరోపణలు, ప్రత్యారోపణలతో తెలంగాణ నష్టపోతున్నదన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ వల్ల రాష్ట్రంలోని రాజకీయ వ్యవస్థ భ్రష్టుపడుతున్నదన్నారు. ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులతో పాటు వ్యక్తిగత దాడులు, అమలు సాధ్యం కానీ హామీల విషయంలో ఈ రెండు పార్టీలు ఒకే తరహాలో వ్యవహరిస్తున్నాయన్నారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల విషయంలో సకాలంలో సరైన నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు స్పీకర్ కు సలహా ఇచ్చిందన్నారు. కానీ ఈ విషయంలో స్పీకర్ ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చేయలేదన్నారు. ఈ ఏడాది కాలంలో జాబ్ క్యాలెండర్ లో అమలు చేస్తామన్నది ఏది చేయలేదన్నారు. రైతు భరోసా, దళిత బంధు ఇప్పటి వరకు ఒక్కరికి కూడా ఇవ్వలేదు. ఒక్క పెన్షన్, కొత్త రేషన్ కార్డు ఇవ్వకపోయినా ఇంకా బుల్డోజర్లతో తొక్కిస్తా అనే మాటలనే సీఎం మాట్లాడుతున్నారని విమర్శించారు. సీఎం హుందాగా వ్యవహరించాలి. కానీ ప్రశ్నించేవారి పట్ల అన్ పార్లమెంటరీ భాషను కేసీఆర్ ప్రవేశపెడితే దాన్ని రేవంత్ రెడ్డి విజయవంతంగా ముందుకు తీసుకువెళ్తున్నారు. పార్లమెంట్ సమావేశాల ప్రారంభానికి ముందు ప్రతిసారి అదానీ అంశంలై ఈ రకమైన కుట్రలు చేస్తున్నారన్నారు. అమెరికా నుంచి పాఠాలు నేర్చుకోవాల్సిన ఖర్మ భారత దేశానికి పట్టలేదన్నారు. 

డిసెంబర్ నెలాఖరు నాటికి కొత్త స్టేట్ చీఫ్:

ఈ నెలాఖరు వరకు అన్ని గ్రామ కమిటీలు పూర్తి చేస్తామని డిసెంబర్ మొదటి వారంలో మండల కమిటీలు, ఆ జిల్లా కమిటీలు, రాష్ట్ర కమిటీలు, అనంతరం జాతీయ అధ్యక్షుడిని నియమిస్తారని చెప్పారు. షెడ్యూల్ డిసైడ్ అయిందని చెప్పారు. డిసెంబర్ చివరి నాటికి రాష్ట్ర, జాతీయ అధ్యక్షులు వస్తారని చెప్పారు.

Tags:    

Similar News