RTC : అర్ధరాత్రి చెకింగ్ ఏంటీ సార్? ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌కు నెటిజన్ల రిక్వెస్ట్
ఓ ఆర్టీసీ బస్సులో టికెట్ చెకింగ్ చేసే అధికారులపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు సోషల్ మీడియాలో ఓ వీడియో చక్కర్లు కొడుతోంది.
దిశ, డైనమిక్ బ్యూరో: ఓ ఆర్టీసీ బస్సులో టికెట్ చెకింగ్ చేసే అధికారులపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు సోషల్ మీడియాలో ఓ వీడియో చక్కర్లు కొడుతోంది. నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం చిన్న తుమ్మలగూడెం గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుందని వీడియో వైరల్ అయింది. అర్ధరాత్రి 11 గంటలకు బస్సును ఆపి మహిళల ఆధార్ కార్డులను ఆర్టీసీ అధికారులు చెక్ చేస్తున్నారని పలువురు ప్రయాణికులు అడ్డుకున్నారు. ఈ సమయంలో బస్సు ఎందుకు ఆపారని అడగడంతో ప్రయాణికుల మీద చెకింగ్ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో మాకు మీ ఫ్రీ బస్ వద్దు.. ఏమీ వద్దు అంటూ మరోవైపు మహిళలు ఫైర్ అయ్యారు. ఈ విషయం ఆర్టీసీ ఎండీ సజ్జనార్ దృష్టికి తీసుకెళ్తామని పలువురు ప్రయాణికులు చెప్పడంతో అధికారులు వెనుదిరిగారు.
కాగా, వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు తీవ్ర స్థాయిలో స్పందిస్తున్నారు. ఆధార్ కార్డు చూసిన తర్వాతే కండక్టర్ టికెట్ ఇచ్చినపుడు టికెట్ చూడాలి కానీ మళ్ళీ ఆధార్ కార్డు చూసుడేంది.. అని మరో నెటిజన్ కామెంట్ పెట్టారు. అయినా పండుగ పూట, అది కూడా అర్ధరాత్రి చెకింగ్ ఏందో అంటూ పలువురు నెటిజన్లు ఆర్టీసీ తీరుపై ఫైర్ అవుతున్నారు. ఆర్ధరాత్రి సమయంలో చెకింగ్‌లు ఏంటీ సార్ అంటూ నెటిజన్లు ఎండీ సజ్జనార్‌కు ట్యాగ్ చేస్తున్నారు.