మావోయిస్టు పార్టీ స్పెషల్ జోనల్ కమిటీ మహిళా సభ్యురాలు లొంగుబాటు..
నిషేదిత సి.పి.ఐ మావోయిస్టు పార్టీ స్పెషల్ జోనల్ కమిటీ సభ్యురాలు, దండకారుణ్య స్పెషల్ జోనల్ కమిటీ ,సౌత్ సబ్ జోనల్ బ్యూరోగా పనిచేస్తున్న కొడి మంజుల
దిశ, హనుమకొండ : నిషేదిత సి.పి.ఐ మావోయిస్టు పార్టీ స్పెషల్ జోనల్ కమిటీ సభ్యురాలు, దండకారుణ్య స్పెషల్ జోనల్ కమిటీ ,సౌత్ సబ్ జోనల్ బ్యూరోగా పనిచేస్తున్న కొడి మంజుల (46) ఆలియాస్ నిర్మల వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఎదుట గురువారం లొంగిపోయారు. ఈ లొంగుబాటుకు సంబంధించి వరంగల్ పోలీస్ కమిషనర్ వివరాలు వెల్లడిస్తూ వరంగల్ జిల్లా,ఖానాపూర్ మండలం,బుధరావుపేట గ్రామానికి చెందిన కొడి మంజుల ఆలియాస్ నిర్మల తన తండ్రి అప్పటి పీపుల్స్‌వార్ దళానికి సానుభూతిపరుడిగా పనిచేయడంతో పాటు, అన్నయ్య కొడి కుమార స్వామి ఆలియస్ ఆనంద్, దగ్గర బంధువు కొడి వెంకన్న ఆలియాస్ గొపన్న నర్సంపేట దళ కమాండర్‌గా పనిచేసి ఇరువురు ఎదురుకాల్పుల్లో మరణించారు. వీరి మరణంతో పాటు, పీపుల్స్‌వార్ గ్రూప్ సిద్దాంతాలకు ప్రభావితమైన కొడి మంజుల పదవ తరగతి లోనే తన చదువును మధ్యలోనే నిలిపివేసి 1994 సంవత్సరం, జనవరి నెలలో సిపిఐ(ఎం.ఎల్) పీపుల్స్‌వార్ గ్రూప్, నర్సంపేట దళంలో చేరి ఆజ్ఞాతంలోకి వెళ్ళింది. అప్పటి నుండి కొడి మంజుల 1996 సంవత్సరంలో చేర్యాల దళం పనిచేగా,1999 సంవత్సరంలో నర్సంపేట దళ కమాండర్ పెరం బుచ్చయ్య అలియాస్ సురేందర్‌ను వివాహం చేసుకుంది.
ఇదే సంవత్సరంలో ఏరియా కమిటీ మెంబర్‌గా బాధ్యతలు చేపట్టడంతో పాటు, కొడి మంజుల భర్త సురెందర్ 2000 సంవత్సరంలో పోలీసుల ఎదుట లొంగిపోయాడు. కొడి మంజుల 2001 సంవత్సరంలో మాచర్ల ఏసోబు ఆలియాస్ జగన్ సారథ్యంలో ప్రెస్ టీం ప్రోటెక్షన్ ప్లాటూన్‌లో ఒక సంవత్సర కాలం పనిచేసి 2002 సంవత్సరంలో మహదేవపూర్ డిప్యూటీ దళ కమాండర్‌గా పనిచేసిన ఇదే సంవత్సరంలో డివిజినల్ కమిటీ మెంబర్ కుకటి వెంకటి ఆలియాస్ రమేష్‌తో వివాహమయింది. వైద్య చికిత్స కొసం మరో దళ సభ్యురాలితో కల్సి భూపాలపల్లి ప్రాంతానికి వచ్చిన కొడి మంజులను భూపాలపల్లి పోలీసులు 2002, డిసెంబర్ 24వ తేదిన అరెస్టు చేసి జైలుకు తరలించారు. 2004 జైలు నుండి విడుదలైన కొడి మంజుల మరో మారు తిరిగి పీపుల్స్‌వార్ గ్రూప్‌తో సంబంధాలు కొనసాగిస్తూ ఆజ్ఞాతంలోకి వెళ్ళి మహదేవపూర్ దళ సభ్యురాలిగా బాధ్యతలు చేపట్టింది. 2005లో మహదేవపూర్,చేర్యాల, మహరాష్ట్ర సిరోంచ డిప్యూటీ కమాండర్‌గా పనిచేసింది.
2007లో మణుగూరు దళకమాండర్‌గా పనిచేస్తున్న కొడి మంజుల మావోయిస్టు పార్టీ నాయకత్వం అదేశాల మేరకు దండకారుణ్య స్పెషల్ జోనల్ కమిటీ పరిధిలో ఏరియా కార్యదర్శి, వైద్య బృందానికి బాధ్యురాలిగా 2011 వరకు పనిచేసింది. 2012 దర్బా డివిజనల్ కమిటీ సభ్యురాలిగా పనిచేసి, మరోమారు పార్టీ అధిష్టానం అదేశాల మేరకు 2017లో బస్తార్ డివిజనల్ కమిటీ సభ్యురాలిగా బదిలీ చేయడంతో పాటు, మెబైల్ పోలిటికల్ స్కూల్ బాధ్యురాలిగా పనిచేసి. 2022లో స్పెషల్ జోనల్ కమిటీ సభ్యురాలిగా కొడిమంజుల బాధ్యతలు చేపట్టింది.
కొడి మంజుల పాల్పడిన నేరాలు.. కొడిమంజల తెలంగాణ, ఛత్తీస్‌గడ్ ప్రాంతాల్లో పాల్పడిన నేరాల్లో నిందితురాలు. ఇందులో ప్రధానంగా 2013 సంవత్సరంలో దర్బా డివిజన్ పరిధిలోని జీరంఘాటి ప్రాంతంలో మావోయిస్టులతో కలిసి చేసిన దాడిలో 27 మంది పోలీసులను హత్య చేసిన సంఘటన తో పాటు, చిట్యాల నర్సంపేట, ఏటూరునాగారం, నెక్కొండ పోలీస్ స్టేషన్ల పరిధిలో పోలీసులపై జరిపిన కాల్పుల్లో కొడి మంజుల నిందితురాలు. 2021 సంవత్సరంలో కొవిడ్‌కు గురైవ్వడంతో పాటు, పలు ఆరోగ్య సమస్యలు కారణంగా ఉద్యమంలో పాల్గొనడానికి శరీరం సహకరించకపోవడంతో, అలాగే తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న పునరావాస పథకాల ద్వారా ప్రశాంత వంతమైన వాతావరణంలో తన కుటుంబ సభ్యులతో జీవించే కారణంగా కొడిమంజుల లొంగి పోతున్నట్లుగా పోలీస్ కమిషనర్ ప్రకటించారు. ప్రభుత్వం ప్రకటించిన రూ.20లక్షల రూపాయల రివార్డు చెక్కును పోలీస్ కమిషనర్ చేతుల మీదుగా లొంగిపోయిన కొడిమంజులకు అందజేసారు.