యాజమాన్యం నిర్లక్ష్యంతోనే రూ. 5 లక్షలు నష్టపోయాం : బిల్ట్ కార్మికులు

బిల్ట్ యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే ప్రతి కార్మికునికి రావాల్సిన పెండింగ్ వేతనాల్లోని రూ. 7 లక్షల్లో 5 లక్షలు నష్టపోయామని కార్మికులు ఆరోపించారు.

Update: 2024-10-16 09:12 GMT

దిశ, మంగపేట : బిల్ట్ యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే ప్రతి కార్మికునికి రావాల్సిన పెండింగ్ వేతనాల్లోని రూ. 7 లక్షల్లో 5 లక్షలు నష్టపోయామని కార్మికులు ఆరోపించారు. బుధవారం కమలాపురంలో విలేకరులతో మాట్లాడుతూ కార్మికులకు రావాల్సిన బకాయి వేతనాలు, గ్రాట్యూటీలో జరిగిన నష్టాల గురించి లేబర్ కోర్టులో కేసు నడుస్తుండగానే చర్చల పేరుతో వరంగల్ లేబర్ జాయింట్ కమిషనర్ దగ్గరకు పిలిపించారన్నారు. ఒక్కో కార్మికునికి రూ. 7 లక్షలు వస్తున్నాయని చెప్పి కార్మికుల ఖాతాల్లో డబ్బు జమ చేస్తామని చెప్పి సంతకాలు చేయించారని ఆరోపించారు. కార్మిక జేఏసీ నాయకులు రామచందర్, వింజమూరి రవిమూర్తిలు వరంగల్ లేబర్ జాయింట్ కమిషనర్ వద్దకు వచ్చి 38 మందికి రూ.7 లక్షలు ఇస్తే మిగిలిన 650 మంది కార్మికులకు కూడా ఇవ్వాల్సి వస్తుందని కుట్రలు పన్ని యాజమాన్యంతో కుమ్మక్కై ప్రతి కార్మికునికి 2 లక్షలు మాత్రమే ఖాతాల్లో జమ చేసి మోసం చేశారని ఆరోపించారు.

ఈ కుట్రకు కార్మిక శాఖ అధికారులు కూడా సహకరించడంతో ప్రతి కార్మికుడు 5 లక్షలు నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికులకు సెటిల్మెంట్ పూర్తి అయ్యిందంటున్న జేఏసీ నాయకులు ఏ సంవత్సరం వరకు సెటిల్ మెంట్ చేశారో గేట్ మీటింగ్ ఏర్పాటు చేసి చెప్పాలని నిలదీశారు. జేఏసీ నాయకులు కార్మికులను మోసం చేయకుంటే రిటైర్డ్ కార్మిక నాయకులైన పప్పు వెంకట రెడ్డి, దంతులూరి రాజుతో ఎందుకు సంతకాలు చేపించారో సమాధానం చెప్పాలని లేని పక్షంలో కార్మికులకు న్యాయం జరిగే వరకు దశల వారీ ఉద్యమాలు తప్పవని హెచ్చరించారు. ఈ సమావేశంలో కార్మికులు గులగట్టు విజయరావు, గూడ యాదగిరి, ముత్తినేని వెంకటేశ్వర్లు, బత్తుల వెంకట నారాయణలు పాల్గొన్నారు.


Similar News