అ"ద్వితీయ బంధానికి" 22 ఏళ్ళు..
అవిభక్త కవలలు వీణ - వాణిల గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది.
దిశ, దంతాలపలి : అవిభక్త కవలలు వీణ - వాణిల గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. పుట్టుకతోనే తలలు అతుక్కుని జన్మించిన వీరు నూతన సాంకేతిక వైద్యరంగానికే సవాలుగా నిలిచి విడదీయరాని బంధంగా నిలిచారు. బుధవారం ఈ అవిభక్త కవలలు 21 వసంతాలు పూర్తి చేసుకుని 22వ వసంతంలోకి అడుగుపెట్టారు. హైదరాబాద్‌లోని శిశు విహార్‌లోనే వీరికి ఏటా బర్త్ డే నిర్వహించేవారు. తొలిసారి వీరు తమ స్వగ్రామంలో తల్లితండ్రులు, కుటుంబ సభ్యులు, బంధువుల మధ్య జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. వీరి స్వగ్రామం మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం బీరిశెట్టిగూడెం. మారగాని మురళి - నాగలక్ష్మి దంపతులకు 2003 అక్టోబర్ 16న సూర్యాపేటలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో వీరు జన్మించారు. పుట్టుకతోనే వీరు రెండు తలలు అతుక్కుని జన్మించారు.
వీరికి గుంటూరుకు చెందిన ప్రముఖ వైద్యుడు నాయుడమ్మ వైద్య చికిత్స అందించారు. వీరికి ఆపరేషన్ చేసి వేరు చేసేందుకు దేశ విదేశీ వైద్యులు వచ్చినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. విడదీయని ద్వితీయ బంధానికి సరిగ్గా నిన్నటికి 21 ఏళ్లు పూర్తయ్యాయి. వీరు నీలోఫర్ ఆసుపత్రిలోనే 13 ఏళ్ల దాకా ఉన్నారు. తరువాత హైదరాబాదులోని స్టేట్ హోమ్ వీరికి నివాసంగా మారింది. గత 21 సంవత్సరాలుగా చైల్డ్ హోమ్‌లోనే జన్మదిన వేడుకలను జరుపుకున్న ఈ కవలలు తొలిసారిగా తమ సొంతూరైన బీరిశెట్టి గూడెం గ్రామానికి వచ్చారు. వీరు ఇరువురు డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్నారు.
అంబరాన్ని అంటిన సంబరాలు..
22 ఏళ్ల తర్వాత వీణా - వాణి తమ వద్దకు రావడంతో తల్లిదండ్రులు ఆనందంతో పొంగిపోయారు. కేక్ కట్ చేసి పిల్లలకు తినిపించి శుభాకాంక్షలు తెలియజేశారు. కుటుంబ సభ్యులు, బంధువులు సైతం వేడుకల్లో పాల్గొని జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. తమ సొంత గ్రామానికి వచ్చి కుటుంబ సభ్యులు, బంధువుల మధ్య జన్మదిన వేడుకలు జరుపుకోవడం ఆనందంగా ఉందని కవలలు వీణా వాణిలు ఆనందం వ్యక్తం చేశారు. గ్రామ ప్రజలు ఆనందబాష్పాలు వెల్లిబుచ్చుతు హార్దిక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు డా. పరికిపండ్ల అశోక్, సీడీపీవో ఎల్లమ్మ, చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ వీరన్న, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.