మూడు మార్కెట్లు.. మున్నూరు సమస్యలు !

వరంగల్‌ నగరంలో ముచ్చటగా మూడు మార్కెట్లు.. పేరు పెద్ద.. ఊరు దిబ్బలా మూడు మార్కెట్లలో మున్నూరు సమస్యలు రాజ్యమేలుతున్నాయి.

Update: 2025-03-18 03:23 GMT
మూడు మార్కెట్లు.. మున్నూరు సమస్యలు !
  • whatsapp icon

దిశ, వరంగల్‌ టౌన్ : వరంగల్‌ నగరంలో ముచ్చటగా మూడు మార్కెట్లు.. పేరు పెద్ద.. ఊరు దిబ్బలా మూడు మార్కెట్లలో మున్నూరు సమస్యలు రాజ్యమేలుతున్నాయి. సూపర్‌వైజర్లు తమకు తామే బాస్‌లుగా వ్యవహరిస్తుంటే, వ్యాపారులు మార్కెట్​ను తమ ఆస్తిగా భావిస్తూ సర్కారు ఆదాయానికి గండికొడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా కూరగాయలు, పండ్ల మార్కెట్ల పరిస్థితి దారుణంగా తయారైందనే వాదనలు ఉన్నాయి.

లక్ష్మీపురం మోడల్‌ మార్కెట్‌కు మూడేళ్లు..

వరంగల్‌ నగరం గోవిందరాజుల గుట్ట సమీపంలోని లక్ష్మీపురంలోని గోదాముల ప్రాంతంలో గతంలో కూరగాయల మార్కెట్‌ కొనసాగేది. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో మార్కెట్‌లోని నిర్మాణాలు శిథిలావస్థకు చేరుకున్నాయని, పాత గ్రేయిన్‌మార్కెట్‌ యార్డులో కొంత భాగంలో మోడల్‌ మార్కెట్‌ పేరిట రూ.7 కోట్లతో కొత్త మార్కెట్‌ను నిర్మించారు. మార్కెట్‌ లోపల 98 అడ్తిషాపులు, కవర్‌ షెడ్డు కింద 158 రిటైల్‌ వ్యాపారుల కోసం నిర్మాణాలు చేపట్టారు. మార్కెట్‌ బయటి పక్కన మరో 30 కమర్షియల్‌ షాపులు ఏర్పాటు చేశారు. ఈ మార్కెట్‌ను 2021-22లో ప్రారంభించారు. మోడల్‌ మార్కెట్‌ అసలు లక్ష్యాన్ని అప్పటి ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌ గంగపాలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. పార్కింగ్‌ ఏరియాగా గుర్తించిన స్థలంలో ఇష్టారీతిగా రిటైల్‌ వ్యాపారాలకు తెరలేపి అసలు లక్ష్యాన్ని తుంగలో తొక్కారు. ఎమ్మెల్యేకు అతి సన్నిహితుడైన ఓ నాయకుడికి ఏకంగా పది ప్లాట్లు కేటాయించడం పై వ్యాపారులు నిరసన వ్యక్తం చేస్తూనే ఉన్నారు.

మరోపక్క ఓపెన్‌ ప్లాట్ల వ్యాపారంతో కవర్‌షెడ్డు ప్రస్తుతం నిషానీగా మిగిలింది. ఇక ఓపెన్‌ ప్లాట్లలో ఎక్కువమంది బినామీలే రిటైల్‌ వ్యాపారం సాగిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. వీటి పై అప్పటి కార్యదర్శి నిర్మల చర్యలకు ఉపక్రమించినా రాజకీయ నేతల ఒత్తిడితో వెనక్కి తగ్గినట్లు విమర్శలు ఉన్నాయి. తాజాగా, ఈ వ్యవహారం పై మంత్రి కొండా సురేఖ, కలెక్టర్‌ సత్యశారదా ఆగ్రహం వ్యక్తం చేశారు. బినామీల ఏరివేతకు ఐడీ కార్డులు జారీ చేయాలని నిర్ణయించి 6 నెలలు గడుస్తున్నా ఇప్పటికీ అందించకపోవడం గమనార్హం. మార్కెట్‌లోపల స్థలమే కాకుండా బయట ప్రాంతంలో తడకలు కట్టి అందులో కూడా వ్యాపారం చేస్తున్నా అధికారులు కళ్లున్న కబోదుల్లా వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి.

పండ్ల మార్కెట్‌ పూర్తయ్యేదెన్నడో..?

కూరగాయల మార్కెట్‌ను ఆనుకునే పండ్ల మార్కెట్‌ కొనసాగేది. ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌ నిర్మించాలనే ఉద్దేశంతో కొత్త నిర్మాణానికి పూనుకున్నారు. పాత నిర్మాణాలను కూల్చివేసి 2022 - 23లో కొత్త నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. ఇప్పటికే రెండు ఏళ్లు గడుస్తున్నా 50 శాతం మేర మాత్రమే పనులు పూర్తయ్యాయి. దీంతో ఆనాటి నుంచి పండ్ల మార్కెట్‌ వీధుల్లోనే కొనసాగుతోంది. ఇక దీని ద్వారా ప్రస్తుతానికి మార్కెట్‌కు వచ్చే ఆదాయం శూన్యమే. తాజాగా ఏనుమాముల మార్కెట్‌ సమీపంలో ముసలమ్మ కుంట ఏరియాలో నిర్వహించాలని నిర్ణయించారు. స్థలానికి సరైన దారి లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. మరికొద్ది రోజుల్లో మామడి సీజన్‌ ప్రారంభం కానున్న నేపథ్యంలో చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది.

ఏనుమాముల షరామామూలే..!

ఇక ఏనుమాముల మార్కెట్‌లో పరిస్థితులు కూడా అధ్వానంగా తయారయ్యాయి. అడుగడుగునా అక్రమాలు చోటు చేసుకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల మార్కెట్‌కు సరుకుల రాబడి తగ్గిందనే వాదనలు వినిపిస్తున్నాయి. దీని పై జేడీఏ స్వయంగా రంగంలోకి దిగి పరిస్థితుల పై పర్యవేక్షించడం గమనార్హం. మార్కెట్‌లో హమాలీలు, కూలీల ఆగడాలు మితిమీరిపోయాయనే ఆరోపణలు ఉన్నాయి. మరో వైపు అధికారుల్లో సమన్వయం కొరవడిందనే వాదనలు వినిపిస్తున్నాయి. సూపర్‌వైజర్లు వ్యాపారులతో కలిసి అవినీతికి పాల్పడుతున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి.

కూరగాయల మార్కెట్‌లో కనిపించని క్యాంటీన్‌ !

లక్ష్మీపురం మోడల్‌ కూరగాయల మార్కెట్‌ నిర్మాణ ప్రతిపాదనల్లో క్యాంటీన్‌ ప్రస్తావనను పేర్కొన్నారు. అయితే, నిధుల లేమీతోనో, స్థలాభావం కారణమో గానీ, అప్పటి ప్రజాప్రతినిధులు, కాంట్రాక్టర్లు ఆ నిర్మాణాన్నే మరిచిపోయారు. ప్రస్తుతం నిర్మాణదశలో ఉన్న పండ్ల మార్కెట్‌ యార్డులోనైనా క్యాంటీన్‌ నిర్మాణం పై దృష్టిసారించాలి.

ఇన్‌చార్జ్‌ కార్యదర్శి జి.రెడ్డి సవాళ్లను అధిగమించేనా ?

ప్రస్తుతం మార్కెట్‌ ఇన్‌చార్జ్‌ కార్యదర్శి జి.రెడ్డి ఆధ్వర్యంలో కొనసాగుతోంది. గతంలో ఉన్న మార్కెట్‌ కార్యదర్శి పోలెపాక నిర్మలపై సస్పెన్షన్‌ వేటు పడిన విషయం తెలిసిందే. ఆమె స్థానంలో జి.రెడ్డి ఇన్‌చార్జ్‌ బాధ్యతల్లో నియమితులయ్యారు. అయితే, త్వరలో ఆయన్నే పూర్తిస్థాయి బాధ్యతల్లో నియమించవచ్చని విశ్వసనీయంగా తెలుస్తోంది. మార్కెట్‌లో 109 మంది సిబ్బంది అవసరం ఉండగా ప్రస్తుతం 35 మంది మాత్రమే ఉన్నారు. మరి జి.రెడ్డి చర్యలు బినామీ వ్యాపారుల భరతం పడతారా ? హమాలీలు, కూలీల సరుకు దోపిడీని అరికడతారా ? అధికారుల్లో సమన్వయాన్ని చక్కదిద్దుతారో లేదో వేచిచూడాల్సిందే.


Similar News