సరస్వతి పుష్కరాల ప్రతిపాదనలు త్వరితగతిన సమర్పించాలి
కాళేశ్వరంలో జరగబోయే సరస్వతి పుష్కరాలకు చేపట్టనున్న తాత్కాలిక పనుల అంచనా ప్రతిపాదనలు త్వరితగతిన సమర్పించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ సూచించారు.

దిశ, మల్హర్ (భూపాలపల్లి) : కాళేశ్వరంలో జరగబోయే సరస్వతి పుష్కరాలకు చేపట్టనున్న తాత్కాలిక పనుల అంచనా ప్రతిపాదనలు త్వరితగతిన సమర్పించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ సూచించారు. శనివారం ఐడీఓసీ కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ గతంలో శాశ్వత పనులకు అంచనాలు అందజేశారని, కొన్ని తాత్కాలిక పనులు చేపట్టాల్సి ఉండడం వల్ల వాటి ప్రతిపాదనలు అందజేయాలని ఇంజనీర్ అధికారులను ఆదేశించారు. దేవదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సూచించిన ఆదేశాలను పాటిస్తూ స్వచ్ఛతపై ప్రత్యేక దృష్టి సాధించేందుకు కృషి చేయాలని, జోన్లు వారీగా విభజించి, ప్రత్యేక పారిశుద్ధ్య సిబ్బందిని నియమించాలని డీపీఓకు సూచించారు.
ప్రవేశ మార్గాలు, రోడ్ల మరమ్మతుల పనులను వేగంగా పూర్తి చేయాలన్నారు. విద్యుత్ సరఫరా నిరంతరం అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేయాలని, అవసరమైన మేరకు ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటుతో పాటు విద్యుత్ స్తంభాలు ఏర్పాట్లు, మార్చు పనులను చేపట్టాలని విద్యుత్ అధికారులకు సూచించారు. పుష్కర ఘాట్ల వద్ద భద్రతా చర్యలు మరింతగా పెంచాలని, భక్తులు గోదావరిలోకి వెళ్లకుండా ప్రమాద హెచ్చరికల బోర్డ్స్ ఏర్పాటు చేయాలన్నారు. పనులు నిర్దేశిత సమయంలోగా పూర్తి చేయాలని ఆదేశించారు. అదనపు సిబ్బంది ఏర్పాటుతో పాటు పనుల్లో వేగం పెంచాలని స్పష్టం చేశారు.
గోదావరిలో చలువ పందిళ్లు వేయాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. పార్కింగ్ స్థలాల వద్ద మరుగుదొడ్లు, మంచినీరు, విద్యుత్ సౌకర్యాలు కల్పించాలని సూచించారు. భక్తులు పుష్కర సమాచారం తెలుసుకోవడానికి అనువుగా క్యూ ఆర్ కోడ్ ముద్రించాలని కోరారు. ఈ సమీక్ష సమావేశంలో జిల్లా అటవీశాఖ అధికారి నవీన్ రెడ్డి, ఇరిగేషన్, పంచాయతీరాజ్, విద్యుత్, ఇరిగేషన్, దేవాదాయ, పంచాయతీరాజ్, ప్రణాళిక, ఆర్టీసీ, పర్యాటక, పోలీస్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.