నిర్వీర్యమైన నిఘా.. పని చేయని సీసీ కెమెరాలు..
మండలంలో నిఘా కోసం ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు నామ మాత్రంగా ఉన్నాయి.

దిశ, ఇనుగుర్తి : మండలంలో నిఘా కోసం ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు నామ మాత్రంగా ఉన్నాయి. దొంగతనాలు, రహదారి ప్రమాదాలు, అక్రమ రవాణా తదితర నేర సంఘటనలను సంబంధించి నిందితులను త్వరగా గుర్తించేందుకు సీసీ కెమెరాలు ఎంతో ఉపయుక్తంగా ఉంటాయి. కొన్ని సంవత్సరాల క్రితం అప్పటి ఎస్సై రమేష్ బాబు గ్రామంలో దాతలు వద్దిరాజు కిషన్ సహకారంతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం వాటి నిర్వహణ సరిగా లేకపోవడంతో పనిచేయడం లేదు. దీంతో దొంగతనాలు జరిగినా నిందితులను పట్టుకోవడం సమస్యగా మారుతుంది. మండలంలో సీసీ కెమెరాలు పనిచేయకపోవడంతో మత్తుపానీయాలు, దొంగతనాలకు పాల్పడుతున్నారని పలువురు గ్రామస్థులు, గ్రామ పెద్దలు గ్రామసభలో కోరారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పాత కెమెరాలను పనిచేసేల చేసి, మరికొన్ని కొత్త సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని గ్రామం మొత్తం సీసీ కెమెరా పర్యవేక్షణలో ఉండాలని గ్రామస్థులు భావిస్తున్నారు.
సీసీ కెమెరాలు లేక రక్షణ కరువు.. మల్లి శెట్టి శ్యామ్.. దుకాణదారుడు
సీసీ కెమెరాలు పనిచేయక రక్షణ లేకుండా పోయింది. బస్టాండ్ కూడలిలో పలురకాల షాపులు ఉన్నాయి. రాత్రి షాపులు మూసివేసి వ్యాపారస్తులు ఎవరి ఇంటికి వారు వెళ్ళిపోతారు. తిరిగి ఉదయం షాపులకు వస్తారు. ఎటు నుండి ప్రమాదం పొంచి ఉంటుందో తెలియదు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తే వ్యాపారులకు రక్షణగా ఉంటుంది.
దొంగతనాలను, మత్తుపానీయాలను అరికట్టవచ్చు.. బూర రజినీకాంత్..
సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తే దొంగతనాలు, మత్తుపానీయాలతో పాటు అక్రమ రవాణా సైతం అరికట్టవచ్చు. గత కొన్ని నెలల క్రితం తమ్మెడపల్లి కూమార్ ఇంట్లో దొంగతనం జరిగితే ఆధారం లేకుండా పోయింది. గ్రామసభలో పార్టీలకు అతీతంగా గ్రామ పెద్దలు అందరూ కలిసి వినతి పత్రాన్ని అందజేసిన ప్రయోజనం లేదు.