ఇసుకను తోడేస్తున్నారు..క్వారీల్లో తోడుకున్నోళ్లకు తోడుకున్నంత‌!

ఇసుక క్వారీల అక్రమాల‌కు టీఎస్ ఎండీసీ, మైనింగ్, రెవెన్యూ, పోలీస్ శాఖ‌ల్లోని అధికారుల మ‌ద్దతు ల‌భిస్తుండ‌టంతో ఇష్టారాజ్యంగా వ్యవ‌హ‌రిస్తున్నారు.

Update: 2024-01-15 02:33 GMT

దిశ‌, వ‌రంగ‌ల్ బ్యూరో : ఇసుక క్వారీల అక్రమాల‌కు టీఎస్ ఎండీసీ, మైనింగ్, రెవెన్యూ, పోలీస్ శాఖ‌ల్లోని అధికారుల మ‌ద్దతు ల‌భిస్తుండ‌టంతో ఇష్టారాజ్యంగా వ్యవ‌హ‌రిస్తున్నారు. అక్రమాల‌ను నియంత్రించ‌క‌పోవ‌డంతో ములుగు జిల్లా ఏటూరు నాగారం డివిజ‌న్ ప‌రిధిలోని ఇసుక క్వారీల య‌జ‌మానుల అక్రమాల‌కు అడ్డూ అదుపు లేకుండా పోయింది. నిబంధ‌న‌ల‌కు నీళ్లొదిలిన క్వారీల య‌జ‌మానులు టీఎస్ఎండీసీ జారీ చేసే డీడీల‌తో సంబంధం లేకుండా అద‌నంగా ఇసుక‌ను లోడింగ్ చేస్తూ దందా సాగిస్తున్నారు. దీంతో ఇసుక దందా.. తోడుకున్నోళ్లకు తోడుకున్నంత అన్న చందంగా మారింది. పోలీస్‌ శాఖ గ‌డిచిన కొద్ది రోజులుగా చేస్తున్న త‌నిఖీల్లో అద‌న‌పు లోడింగ్‌తో వెళ్తున్న లారీల‌ను ప‌ట్టుకుని సీజ్ చేస్తుండ‌టం గుడ్డిలో మెల్ల అని చెప్పవ‌చ్చు. అయితే, ఇలా సీజ్ చేసిన లారీల య‌జ‌మానుల‌కు కేవ‌లం ఫైన్లతో స‌రిపెడుతుండ‌టంతో పెద్దగా ఇబ్బంది క‌ల‌గ‌కుండానే మ‌ళ్లీ దందా మొద‌లు పెడుతున్నారు. డ్రైవ‌ర్లపై కూడా పెద్దగా కేసులు కాక‌పోవ‌డం అధికారుల ఉదాసీన‌త వైఖ‌రికి అద్దం పడుతోంది.

క్వారీల్లో కాకి లెక్కలు..

టీఎస్ ఎండీసీ ఇసుక క్వారీల్లో పక్కాగా నిబంధ‌న‌ల ప్రకారం త‌వ్వకాలు జ‌రిగేలా చూడాల్సి ఉన్నా ఉద్దేశ‌పూర్వకంగానే నిర్లక్ష్యం చేస్తున్నట్లు స్పష్టమ‌వుతోంది. ఇసుక క్వారీల వ‌ద్ద వే బ్రిడ్జీల నిర్మాణం జరిగేలా చూడాల్సి ఉన్నా ప‌ట్టించుకోవ‌డం లేదు. వే బిల్లుకు బ‌దులుగా బకెట్ల లెక్కల‌ను క్వాంటింటీకి ప్రామాణికంగా లెక్కగ‌డుతున్నట్లు స‌మాచారం. ఒక బ‌కెట్‌కు 2 నుంచి రెండున్నర ట‌న్నులుగా లెక్కక‌డుతూ 14 టైర్ల లారీ లోడుకు 15, 16 బ‌కెట్లతో నింపుతున్నట్లు స‌మాచారం. అదేవిధంగా మ‌రో మూడు నుంచి నాలుగు బ‌కెట్లు అదనంగా నింపుతూ అద‌న‌పు ఆదాయాన్ని ఆప‌రేట‌ర్లతో వ‌సూళ్లు జ‌రుపుతున్నారు. ఒక్కో క్యూబిక్ మీట‌రు ఇసుకకు రూ.600 వ‌ర‌కు టీఎస్ ఎండీసీ చార్జి చేస్తోంది.

ఈ లెక్కన రెండు నుంచి మూడు బ‌కెట్లతో సుమారు 6 ట‌న్నుల అద‌న‌పు ఇసుక మొత్తం ఒక్కో లారీ మీద రూ.3 వేల నుంచి రూ.3,500 వ‌ర‌కు అక్రమార్కుల జేబుల్లోకి వెళ్తోంది. శుక్రవారం వాజేడు మండ‌లం అరుణాచ‌ల‌పురం గ్రామ స‌మీపంలో నూగురు వెంక‌టాపురం నుంచి జ‌గ‌న్నాథ‌పురం వ‌స్తున్న 11 ఇసుక లారీల‌ను పోలీసులు ప‌ట్టుకున్న విష‌యం తెలిసిందే. త‌నిఖీల్లో ప్రతి లారీలో కూడా టీఎస్ ఎండీసీ జారీ చేసిన ఇసుక మొత్తం కంటే దాదాపు అద‌నంగా 5 ట‌న్నులకు మించి ఇసుక‌ను తీసుకెళ్తున్నట్లుగా అధికారులు గుర్తించారు. 11 ఇసుక లారీలు కూడా నూగూరు వెంక‌టాపురం మండ‌లం మొర్రవానిగూడెం, ఒంటిచింత‌ల‌గూడెం ఇసుక క్వారీల‌కు సంబంధించిన‌వి కావ‌డం గ‌మ‌నార్హం. ఈ 11లారీల‌ను సీజ్ చేసిన అధికారులు వాజేడు పోలీస్ స్టేష‌న్‌కు త‌ర‌లించారు.

న‌కిలీ వే బిల్లులతో దందా..

ములుగు జిల్లాలో టీఎస్ఎండీసీ నిర్వహించే ప్రభుత్వ క్వారీలు మొత్తం ఆరు ఉన్నాయి. ఇసుక అవ‌స‌ర‌మున్న వారు టీఎస్ ఎండీసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్ బుకింగ్‌కు అవ‌కాశం క‌ల్పిస్తుంది. స్టాక్ యార్డుల్లోని ఇసుక నిల్వలు అందుబాటులో ఉండ‌డాన్ని బ‌ట్టి బుకింగ్‌కు అవ‌కాశం క‌ల్పిస్తారు. ఇలా బుకింగ్ చేసుకున్న వారికి, క్వారీ, య‌జ‌మానుల‌కు డిపాజిట్ ర‌శీదుల‌ను అంద‌జేశారు. ఒకే డీడీపై ప‌దుల సంఖ్యలోని లారీల ఇసుకను హైద‌రాబాద్‌కు, ఇత‌ర గ‌మ్యాల‌కు చేరుస్తున్నారు. వ‌చ్చే బుకింగ్‌ల‌కు క‌న్నా పోయే లారీల సంఖ్య ఎక్కువ‌గా ఉంటుండ‌డం గ‌మనార్హం. నకిలీ వే బిల్లులు సృష్టించ‌డం, ఒకే వే బిల్లుపై ప‌దుల సంఖ్యలో లారీల్లో ఇసుక త‌ర‌లింపు వంటి ఘ‌ట‌న‌లు గ‌తంలో వ‌రంగ‌ల్‌ టాస్క్‌ఫోర్స్ అధికారులు ఏకకాలంలో జ‌రిపిన త‌నిఖీల్లో వెల్లడైంది.

తనిఖీల్లో ప‌దుల సంఖ్యలోనే న‌కిలీ వే బిల్లుల‌ను వ‌రంగ‌ల్ టాస్క్‌ఫోర్స్ గుర్తించిన‌ట్లుగా అప్పటి వ‌రంగ‌ల్ సీపీ రంగనాథ్ స్వయంగా వెల్లడించారు. అయితే, దీనిపై స‌మ‌గ్రమైన ద‌ర్యాప్తు కొన‌సాగుతోంద‌ని చెప్పినా.. ఆ తరువాత ద‌ర్యాప్తు వివ‌రాల‌ను మాత్రం అధికారులు వెల్లడించ‌క‌పోవ‌డం అనుమానాలకు తావిస్తోంది. న‌కిలీ వే బిల్లుల‌తో ప్రభుత్వానికి రావాల్సిన రూ.కోట్లు అక్రమార్కుల జేబుల్లోకి వెళ్లిపోతున్నాయి. తాజాగా, మ‌రోసారి ములుగు డివిజ‌న్‌లోని క్వారీల నుంచి ప‌రిమితికి మించి లారీల్లో ఇసుక త‌ర‌లింపు వ్యవ‌హారం వెలుగులోకి రావ‌డంతో జీరో దందా కూడా సాగే అవ‌కాశం ఉంద‌న్న అనుమానాలు మొద‌ల‌య్యాయి.

Tags:    

Similar News