వారితో ప్రాణహాని ఉంది..మాకు రక్షణ కల్పించండి..
అప్పులు తీర్చేందుకు అన్నదమ్ములు స్వంత ఇంటిని అమ్మడానికి నిర్ణయించుకున్నారు.
దిశ, హన్మకొండ: అప్పులు తీర్చేందుకు అన్నదమ్ములు స్వంత ఇంటిని అమ్మడానికి నిర్ణయించుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న కొందరూ డివిజన్ బీఆర్ఎస్ నాయకుడి అండదండలతో ఇంటిని తక్కువ ధరకు తమకే అమ్మాలని బెదిరింపులకు పాల్పడుతూ ఒత్తిడి చేస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. హన్మకొండ ప్రెస్ క్లబ్ లో మంగళవారం బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. ‘మా అమ్మనాన్న చిలువేరు రాజమోలి, విజయమ్మలు వరంగల్ 40 వ డివిజన్ కరిమాబాద్ డీకే నగర్ 2007లో పూరి గుడిసెలు వేసుకొని రోజువారీ కూలి చేసుకొంటూ జీవనం సాగించారు.
2008లో నాన్న చనిపోవడంతో అన్నదమ్ములం శంకర్, వెంకటేశ్, చందర్ లు రోజువారీ కూలి పని చేసుకొంటూ అమ్మను కంటికి రెప్పలా చూసుకున్నాం. అనుకోకుండా అమ్మ విజయమ్మ అనారోగ్యానికి గురికావడంతో డాక్టర్ ను సంప్రదించగా వైద్య పరీక్షలు నిర్వహించి క్యాన్సర్ అని చెప్పారు. మెరుగైన చికిత్సకు ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లాం. తెలిసిన వారి వద్ద అప్పులు చేసి ఆపరేషన్ చేయించినా అమ్మ ఆరోగ్యం కుదుట పడలేదు. ఎనిమిది నెలల క్రితం అమ్మ మృతి చెందింది’ అంటూ కుటుంబ సభ్యులు బోరున విలపించారు.
తమ తల్లి వైద్యం నిమిత్తం చేసిన అప్పులు తీర్చే క్రమంలో ఇల్లు అమ్ముదామని నిర్ణయించుకున్నామని చెప్పారు. కాగా సదరు వ్యక్తులకు ఇల్లు తక్కువ ధరకు అమ్మడం లేదని తాము కూలి పనికి వెళ్లిన సమయంలో ఇంటి తాళానికి మరో తాళం వేసి ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినా రాజకీయ పలుకుబడి ఉపయోగించి మాకు అన్యాయం చేసేందుకు కొందరు భయబ్రాంతులకు గురి చేస్తున్నారని వాపోయారు. సదరు వ్యక్తుల నుంచి ప్రాణ హాని ఉందని, రెక్కల కష్టం చేసుకుని జీవించే మాకు సంబంధిత అధికారులు రక్షణ కల్పించాలని వేడుకున్నారు.