రాముడు పాదం మోపిన నేల..జీడి కంటి పుణ్యక్షేత్రం

బంగారు మాయ లేడిని తీసుకురావడం కోసం జీడికంటి నేలపై

Update: 2024-11-11 02:34 GMT

దిశ, లింగాల గణపురం : బంగారు మాయ లేడిని తీసుకురావడం కోసం జీడికంటి నేలపై పాదం మోపిన శ్రీరామచంద్రుడు ఇక్కడే స్వయంభూగా వెలిసి జీడికంటి పుణ్యక్షేత్రంలో వీరాచల రామచంద్రస్వామిగా దర్శనమిస్తూ భక్తుల కోరికలు తీర్చే ఇలవేల్పుగా పూజలందుకుంటున్నాడు. త్రేతా యుగం నుంచి నేటి వరకు ఈ ప్రాంతం రామనామస్మరణతో మార్మోగుతోంది. ఎక్కడా లేని విధంగా ఈ పుణ్యక్షేత్రంలో ప్రతి ఏటా కార్తీక మాసంలో, శ్రీరామనవమి రోజు సీతారామచంద్ర స్వామి కళ్యాణం నిర్వహించడం ఇక్కడ ప్రత్యేకత. కార్తీక మాసంలో స్వామి వారి బ్రహ్మోత్సవా నిర్వహించనున్నారు. గర్భాలయంలో ఉన్న రామగుండంలో నీరు 365 రోజులు తగ్గకుండా పెరగకుండా ఒకే లాగా ఉంటాయి. క్షేత్రంలో పాల గుండం, జీడి గుండం కు ఎంతో విశిష్టత ఉంది. వాటినే అన్న చెల్లెలి గుండాలుగా పిలుస్తారు.

ఈ గుండాలలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తే పాపాలు తొలిగిపోతాయని నమ్మకం. పూర్వం స్వామివారి కల్యాణానికి నైజాం పాలకుల నుంచి పట్టువస్త్రాలు రాగా, నేడు యాదగిరి లక్ష్మి నరసింహ స్వామి దేవస్థానం నుంచి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పిస్తారు. స్వామివారి బ్రహ్మోత్సవాలకు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్​గఢ్​ తదితర ప్రాంతాల నుంచి భక్తులు తరలి వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు.

ఈ నెల 14 నుంచి వైభవంగా బ్రహ్మోత్సవాలు..

మండలంలోని జీడికల్ గ్రామంలోని సుప్రసిద్ధ ప్రసిద్ధిగాంచిన శ్రీ వీరాచల రామచంద్ర స్వామి బ్రహ్మోత్సవాలు ఈ నెల 14న ప్రారంభమై 27 వరకు జరగనున్నాయని దేవస్థానం కార్యనిర్వాహణ అధికారి వంశీ తెలిపారు. 14 తేదీన లక్ష్మీ పూజ, 15న కార్తీక పౌర్ణమి పుష్కర స్నానాలు, 16, 17 న నిత్య పూజ, 18న అంకురార్పణ, అగ్ని ప్రతిష్ట, 19న ధ్వజారోహణం బలిహరణం, సాయంత్రం దేవతల ఆహ్వానం, ఎదుర్కోళ్ల మహోత్సవం, 20న మధ్యాహ్నం 12 గంటలకు స్వామి వారి కల్యాణ మహోత్సవం, 21న రథోత్సవం, 22న పూర్ణాహుతి, దేవత ఉద్వాసన, 23 నుంచి 25 వరకు నిత్యనిధి, 26 మధ్యాహ్నం 11 గంటలకు చక్రస్నానం, 27న స్వామివారికి అష్టోత్తర శత ఘటాభిషేకం, మహా ఆశీర్వచనం తో బ్రహ్మోత్సవాలు ముగియనున్న ట్లు తెలిపారు. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.


Similar News