మహిళా సాధికారతే ప్రభుత్వం లక్ష్యం...
రాష్ట్రంలో మహిళా సాధికారతే ప్రభుత్వ లక్ష్యం అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు.
దిశ, ఏటూరునాగారం : రాష్ట్రంలో మహిళా సాధికారతే ప్రభుత్వ లక్ష్యం అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. మహిళా స్వయం సహాయక సంఘాల ద్వారా సోలార్ పవర్ ప్లాంట్ ల ఏర్పాటు ప్రగతి పై బుధవారం ప్రజా భవన్ నుంచి రాష్ట్ర పంచాయతిరాజ్, గ్రామీనాభివృద్ది శాఖ మంత్రి సీతక్క, దేవాదాయ, అటవీశాఖ మంత్రి కొండా సురేఖ, ఇంధన శాఖ ప్రిన్సిపల్ సెక్రటరి, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల కార్యదర్శి లోకేష్ కుమార్, సెర్ఫ్ సీఈవో దివ్య దేవరాజన్, ట్రాన్స్కో సీఎండి కృష్ణ భాస్కర్, విద్యుత్ శాఖల సీఎండీలతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు ఆర్థిక సాధికారత సాధిస్తేనే వారి ఎదుగుదలకు అవకాశాలు ఏర్పడతాయని డిప్యూటీ సీఎం తెలిపారు.
అంది వస్తున్న కొత్త విద్యుత్ పాలసీ, ఇంధన, గ్రామీణ అభివృద్ధి శాఖల మధ్య గత సంవత్సరం నవంబర్ 19న కుదిరిన ఒప్పందాన్ని జిల్లా కలెక్టర్లు ఉపయోగించుకుని ముందుకు వెళ్లాలని సూచించారు. ఐదు సంవత్సరాల కాలంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దాలని ఇందిరమ్మ ప్రభుత్వం నిర్ణయించిందని ఈ క్రమంలో మహిళలకు పెద్ద ఎత్తున వడ్డీ లేని రుణాలు అందుబాటులోకి తెస్తున్నామన్నారు. పెద్ద మొత్తంలో డబ్బు మహిళా సంఘాల చేతులకి వస్తున్న క్రమంలో వారు వివిధ వ్యాపారాలు చేసుకునేలా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేసి వసతులు కల్పించాలని ఆదేశించారు. మహిళా సంఘాలు సోలార్ పవర్ ప్లాంట్ ల ఏర్పాటుకు వారికి అందుబాటులో ఉన్న భూమిని గుర్తించాలని, అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూమిని గుర్తించాలని కలెక్టర్లను ఆదేశించారు. మహిళా సంఘాలు ప్లాంట్ల ఏర్పాట్లలో ఆర్థిక సహాయం కోసం బ్యాంకు అధికారులతో సమన్వయం చేయాలని సూచించారు.
మహిళా సంఘాల భూముల్లో ప్లాంట్ లో ఏర్పాటుకు విద్యుత్ శాఖ రేడ్కో ద్వారా టెండర్లు ఆహ్వానించిందని, త్వరలో టెండర్లు ఓపెన్ చేసి వాటిని ఖరారు చేస్తారని డిప్యూటీ సీఎం తెలిపారు. ఈ నేపథ్యంలో సంఘాలను గుర్తించి నిర్ధారించడం, భూ సేకరణ, బ్యాంకుల నుంచి ఆర్థిక సాయం వంటి పనులను గ్రామీణాభివృద్ధి శాఖ, జిల్లా కలెక్టర్లు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ఒక మెగావాటు ఉత్పత్తికి నాలుగు ఎకరాలు అవసరం ఉంటుందని ప్రతి జిల్లాలో 150 ఎకరాలకు తగ్గకుండా రాష్ట్రవ్యాప్తంగా సుమారు నాలుగు వేల ఎకరాలు సేకరించాల్సి ఉంటుందని కలెక్టర్లకు తెలిపారు. దేవాదాయ, ఇరిగేషన్ శాఖల పరిధిలోని భూములను గుర్తించాలని, కేంద్ర అటవీ హక్కుల చట్టం ప్రకారం గిరిజనులు భూమి అభివృద్ధి చేసుకునే అవకాశం ఏర్పడిందని తెలిపారు. అటవీ ప్రాంతాల్లో భూముల పై హక్కులు ఏర్పడినప్పటికీ స్తంభాలు వేసి విద్యుత్ లైన్ ల ద్వారా విద్యుత్ సౌకర్యం ఏర్పాటు చేసే క్రమంలో అటవీ శాఖ అధికారులతో ఇబ్బందులు తలెత్తుతున్నాయని, ఈ నేపథ్యంలో ఆయా భూముల్లో సోలార్ పవర్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తే ఎవరికి ఇబ్బంది ఉండదని డిప్యూటీ సీఎం సూచించారు.
సోలార్ విద్యుత్తు అందుబాటులోకి వస్తే అటవీ ప్రాంతాల్లోని రైతులు డ్రిప్ ఇరిగేషన్ ద్వారా పెద్ద ఎత్తున పంటలు సాగు చేసుకునే అవకాశం లభిస్తుందని తెలిపారు. రాష్ట్రంలో 6.67 లక్షల ఎకరాలను ఇప్పటి వరకు ప్రభుత్వం గిరిజనులకు పంపిణీ చేయగా ఆ భూముల్లో లాభసాటి పంటల సాగు జరగడం లేదని డిప్యూటీ సీఎం తెలిపారు. ఇక నుంచి ఆ భూముల్లో ఉపాధి హామీ, గిరిజన శాఖ, స్వయం సహాయక సంఘాల ద్వారా వచ్చే పథకాలు అన్నిటిని సమన్వయం చేసుకొని ఆర్థికంగా ప్రయోజనం కలిగించే పంటల సాగును ప్రోత్సహించడానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని గిరిజన శాఖ అధికారులను డిప్యూటీ సీఎం ఆదేశించారు. కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ నుండి పాల్గొన్న జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటి వరకు 10 ఎకరాలు గుర్తించినట్లు తెలిపారు. నిర్దేశించిన గడువు లోగా 140 ఎకరాలను గుర్తించి నివేదికలు అందజేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు ఇంచార్జీ సంపత్ రావు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.