నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి: ఈటల రాజేందర్
హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు, వడగండ్లకు దెబ్బతిన్న పంటలను పరిశీలించేందుకు సోమవారం హుజరాబాద్ ఎమ్మెల్యే ఈటల మండలంలో పర్యటించారు.
దిశ, కమలాపూర్: హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు, వడగండ్లకు దెబ్బతిన్న పంటలను పరిశీలించేందుకు సోమవారం హుజరాబాద్ ఎమ్మెల్యే ఈటల మండలంలో పర్యటించారు. పలు గ్రామాల్లోని దెబ్బతిన్న పంటలను, పొలాలను పరిశీలించి రైతులతో మాట్లాడారు. అనంతరం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మార్చిలో కురిసిన వడగండ్ల వానలకు పంట నష్టపోయిన రైతులను ఆదుకోమని డిమాండ్ చేస్తే సీఎం కేసీఆర్ హెలికాప్టర్ లో తిరిగి నష్టపోయిన రైతులకు, కౌలు రైతులకు సైతం ఎకరానికి పదివేలు సాయం చేస్తామని ఇప్పటివరకు కూడా ఒక్క రూపాయి కూడా సాయం అందించలేని ఆరోపించారు.
ప్రకృతి రైతులపై కన్నేర్ర చేసి విధ్వంసం సృష్టిస్తుందని, అకాల వర్షాలకు రాష్ట్రంలో మొక్కజొన్న, వరి, మామిడి తోటలు, మిర్చి పంటలు పాడైపోయాయని దీంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లడమే కాకుండా రైతుల కుటుంబాలలో విషాదం మిగిల్చాయని ఆవేదన వ్యక్తం చేశారు. నష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని వరి పంటలకు ఎకరానికి రూ. 30,000 మొక్కజొన్నకు ఎకరానికి రూ. 40000 మామిడి పంటలకు ఎకరానికి లక్ష రూపాయల చొప్పున వెంటనే అధికారులతో పంటలను పరిశీలించి అంచనా వేసి రైతులకు నష్టపరిహారం చెల్లించాలని ఈటల ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.