అడవికి పోడు కీడు.. మళ్లీ మొదలైన అటవీ భూముల ఆక్రమణ
ఉమ్మడి వరంగల్ జిల్లా అటవీ ప్రాంతాలకు పోడు కీడు సోకుతోంది.

దిశ, వరంగల్ బ్యూరో : ఉమ్మడి వరంగల్ జిల్లా అటవీ ప్రాంతాలకు పోడు కీడు సోకుతోంది. ఉమ్మడి జిల్లాలో మొత్తం 10 ఫారెస్టు డివిజన్లు ఉండగా ఒక్క హన్మకొండ జిల్లా పరిధిలోని డివిజన్లలో మినహా అన్నింటిలోనూ గడిచిన ఐదేళ్లకాలంలో గణనీయంగా అటవీ విస్తీర్ణాలు తగ్గిపోవడం గమనార్హం. విస్తీర్ణాలు తగ్గిపోవడమే కాదు.. కలప నరికివేతతో పలుచబడ్డాయి. విస్తీర్ణంలో ఉన్న మైదాన ప్రాంతాలుగా మారుతున్నాయి. ఒకప్పుడు దట్టమైన అభయారణ్యాలు, కీకారణ్యాలతో కళకలాడిన వరంగల్ జిల్లాలో ఏటా అటవీ విస్తీర్ణం తగ్గిపోతుండడం ఆందోళన కలిగిస్తోంది. రహదారులకు ఆనుకుని కనిపించే అడవి లోపలికెళ్తే డొల్ల అన్నచందంగా మారింది.
రోడ్డు నుంచి చూస్తే భారీ వృక్షాలు దర్శనమిస్తున్నా కొద్దిగా 300 మీటర్లు లోపలికి వెళ్తే మైదానాలు దర్శనమిస్తుండటం గమనార్హం. భూపాలపల్లి, కొత్తగూడ, గంగారం, బయ్యారం, పస్రా, తాడ్వాయి, ఏటూరునాగారం ప్రాంతంలోని అడవుల్లోని పరిస్థితులే ఇందుకు నిదర్శనం. వాస్తవానికి 50 ఏళ్ల వయస్సు కలిగిన వృక్షాలు ఒక్కటంటే ఒక్కటీ లేకపోవడం అటవీ పరిరక్షణకు, అటవీలో జరుగుతున్న చెట్ల నరికివేతకు అద్దం పడుతోంది. ఇందులో ఫారెస్టులోని ఇంటి దొంగలు, స్మగ్లర్ల ఆగడాలు, పోడు పేరుతో సాగుతున్న అరణ్యహననం, చోటు చేసుకుంటున్న అగ్ని ప్రమాదాలు వెరసి ఉమ్మడి జిల్లాలో అడవులు క్షీణిస్తున్నాయి.
మూడు జిల్లాల్లో పోడు..!
ములుగు, మహబూబాబాద్, భూపాలపల్లి జిల్లాల్లో పోడు పెరుగుతోంది. ములుగు జిల్లాలోని గోవిందరావుపేట, తాడ్వాయి, ఏటూరునాగారం, వాజేడు మండలాల్లో కొత్తగా పోడు జరుగుతుండటం గమనార్హం. అలాగే భూపాలపల్లి జిల్లాలో భూపాలపల్లి, పలిమెల, మహాముత్తారం, మహదేవ్‌పూర్ మండలాల్లో పోడు పెరుగుతోంది. మహబూబాబాద్ జిల్లాలో కొత్తగూడ, గంగారం, గూడూరు, బయ్యారం మండలాల్లోని అటవీ ప్రాంతాల్లో అడవిని నరికేస్తూ పోడు చేస్తుండటం గమనార్హం. పాత పోడు భూములకు పట్టాలివ్వలేదనేది ప్రధానంగా కొంతమంది చెబుతూ సాగుకు యత్నిస్తున్నారు. అటవీ భూముల్లో పోడు జరుగుతున్న సమయంలో అడ్డుకునేందుకు వెళ్లిన అధికారులకు రాజకీయ నేతల నుంచి ఫోన్లు వెళ్తుండడంతో ఏం చేయలేకపోతున్నామనే వాదనను ఫారెస్ట్ అధికారుల నుంచి వినిపిస్తోంది. అడ్డుకోకుంటే ఆక్రమణలు.. అడ్డుకుంటే బెదిరింపులు అన్నచందంగా తమ పరిస్థితి తయారైందంటూ అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తుండటం గమనార్హం.
ఇదీ ఉమ్మడి జిల్లాలో పరిస్థితి..!
ఉమ్మడి వరంగల్ జిల్లాలో వరుసగా ములుగు, భూపాలపల్లి, మహబూబాబాద్, వరంగల్, జనగామ, హన్మకొండ జిల్లాలో అటవీ విస్తీర్ణాలు కలిగి ఉన్నాయి. అత్యధికంగా ములుగు జిల్లాలో 81శాతం భూభాగం అటవీ ప్రాంతంగా ఉండటం గమనార్హం. అడవుల జిల్లాగా పేరుగడిచింది. ఆ తర్వాత భూపాపల్లి, మహబూబాబాద్ జిల్లాల్లోనూ అభయారణ్యాలు ఉన్నాయి. ఫారెస్ట్ సర్వే రిపోర్టు 2021-23 ద్వారా తెలిసిపోతోంది. రాష్ట్ర వ్యాప్తంగా గణనీయంగా అటవీ విస్తీర్ణం తగ్గుతున్న జిల్లాల్లో ములుగు జిల్లా ఐదోస్థానంలో ఉండడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. 2021 నాటి గణాంకాలతో 2023 సర్వే రిపోర్టును పోల్చి చూపినప్పుడు ఉమ్మడి జిల్లాలో ఈ విధంగా పరిస్థితి ఉంది.
2023 రిపోర్టు ప్రకారం ములుగు జిల్లాలో 2699.39.చ.కి మీ. ఉండగా 2021లో రిపోర్టుతో 2673.48చ.కిమీ గా ఉంది. అంటే అప్పటికి ఇప్పటికి25.91చ.కిమీ అటవీ విస్తీర్ణం తగ్గింది. మిగతా జిల్లాలైన భూపాలపల్లిలో ప్రస్తుతం 1157.39చ.కిమీ. అటవీ విస్తీర్ణం ఉండగా 2021రిపోర్టులో కంటే 15.43చ.కిమీ. విస్తీర్ణం తగ్గింది. మహబూబాబాద్ జిల్లాలో 922.02విస్తీర్ణం ఉండగా 26.98చ.కిమీ.విస్తీర్ణం తగ్గింది. వరంగల్ జిల్లాలో 53.57చ.కిమీ.విస్తీర్ణం ఉండగా2.51చ.కిమీ విస్తీర్ణం తగ్గింది. జనగామ జిల్లాలో 65.32చ.కిమీ విస్తీర్ణం ఉండగా 2.13చ.కిమీ విస్తీర్ణం తగ్గింది. హన్మకొండ జిల్లాలో 48.42చ.కిమీ.విస్తీర్ణం ఉండగా, 0.19చ.కిమీ అటవీ విస్తీర్ణం పెరిగింది. అన్ని జిల్లాల్లో తగ్గుముఖం పట్టగా ఒక్క హన్మకొండ జిల్లాలోనే పెరుగుదల చోటు చేసుకోవడం గమనార్హం. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 75,064 ఎకరాలకు 29,260 పోడు పట్టాలు జారీచేయడం కూడా అటవీ విస్తీర్ణాల తగ్గుముఖానికి ప్రధాన కారణమైంది.