Medico Preethi Death: ప్రీతి అంత్యక్రియలకు ఏర్పాట్లు పూర్తి.. సంచలన వ్యాఖ్యలు చేసిన తండ్రి
ప్రీతిది ముమ్మాటికి హత్యనని మృతురాలి తండ్రి నరేందర్ సంచలన ఆరోపణలు చేశారు. నా కూతురు ఆత్మహత్య చేసుకునేంత బలహీనమైన మానసిక స్థితి కలిగి ఉండదని ఆయన తెలిపారు.
దిశ, వరంగల్ బ్యూరో: ప్రీతిది ముమ్మాటికి హత్యనని మృతురాలి తండ్రి నరేందర్ సంచలన ఆరోపణలు చేశారు. నా కూతురు ఆత్మహత్య చేసుకునేంత బలహీనమైన మానసిక స్థితి కలిగి ఉండదని ఆయన తెలిపారు. ఖచ్చితంగా సైకో సైఫ్‌తో పాటు మరికొంతమంది ప్రీతికి మత్తు ఇంజెక్షన్ ఇచ్చి ఉంటారని ఆరోపించారు. ఆమె అపస్మారక స్థితికి చేరుకున్నాకే తమకు సమాచారం అందించి ఆ తర్వాత ఆస్పత్రికి తరలించారన్నారు.
ఈ నెల 22న ఎంజీఎం వార్డులో మత్తు ఇంజెక్షన్ తీసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన అసస్తిషియా పీజీ మొదటి సంవత్సరం వైద్య విద్యార్థిని ప్రీతి ఐదురోజుల పాటు నిమ్స్‌లో చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి కన్నుమూసిన విషయం తెలిసిందే. సీనియర్ విద్యార్థి సైఫ్ వేధింపులతోనే ప్రీతి ఆత్మహత్యకు పాల్పడినట్లుగా పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైన విషయం తెలిసిందే.
ఆదివారం రాత్రి 9:10 నిముషాలకు మృతి చెందిన ప్రీతి మృతదేహానికి సోమవారం ఉదయం హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం ప్రీతి స్వగ్రామమైన జనగామ జిల్లా కొడకండ్ల మండలం గిర్నితండాకు తరలించారు. గిర్ని తండాలో ప్రీతి కుటుంబానికి ఇల్లు లేకపోవడంతో బంధువుల ఇంటికి వెళ్లారు. ప్రీతి కుటుంబానికి గిర్నితండాలో కొద్దిపాటి స్థలం ఉండటంతో డెడ్‌బాడీని అక్కడే ఉంచి అంత్యక్రియలు జరుపుతున్నారు.
ఈ సందర్భంగా విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు ప్రీతి తండ్రి నరేందర్ మాట్లాడుతూ ప్రీతిది ఆత్మహత్య కాదు.. హత్యేనంటూ సంచలన ఆరోపణలు చేశారు. సైఫ్‌తో పాటు మరికొంతమంది ఆమెను బలవంతంగా మత్తు ఇంజెక్షన్ ఇచ్చి హత్య చేసి ఉంటారని పేర్కొన్నారు. ప్రీతి ఆత్మహత్య సంఘటనతో పాటు కేఎంసీంలో జరుగుతున్న వేధింపులపైన రాష్ట్ర ప్రభుత్వం నిజనిర్ధారణ కమిటీని ఏర్పాటు చేసింది. ప్రీతిని వేధించిన వ్యక్తులపై కఠిన చర్యలతో పాటు ఫాస్ట్‌ట్రాక్ కోర్టులో కేసు విచారణ చేయనుంది.