ఆకట్టుకుంటోన్న పాకాల అందాలు.. పర్యాటక శాఖ శీత కన్ను

పాకాలలో చిలుకమ్మగుట్ట , తూములు, కాలువలు, మత్తడి ప్రాంతం, అభయారణ్యం, బట్టర్ ఫ్లై పార్కు, ఔషధ పార్కు, ఉద్యానవనం, టవర్ వ్యూ పాయింట్ లాంటి ప్రదేశాలు ఆహ్లాదకరంగా ఉండి పర్యాటకులను ఆకట్టుకుంటాయి.

Update: 2024-10-18 02:39 GMT

దిశ, ఖానాపురం: కాకతీయ రాజు ప్రతాప రుద్రుడి మానస పుత్రికచ కాకతీయ గొలుసు కట్టు చెరువుల నిర్మాణాల్లో అగ్రగామి. ప్రపంచ మంచినీటి సరస్సుల్లో 7వ స్థానం. 8 శతాబ్దాల ఘన చరిత్ర. ఇదీ పాకాల సరస్సు గొప్ప చరిత్ర. ఇంతటి ఘనమైన, వారసత్వ సంపదకు ఉమ్మడి వరంగల్ నుంచే కాకుండా సుదూర ప్రాంతాల నుంచి పర్యాటకుల తాకిడి ఉంది. నేడు పట్టింపు లేక పూర్వ వైభవం కోల్పోయే స్థితిలో ఉంది. నర్సంపేట నియోజకవర్గానికే తలమానికంగా నిలిచిన పాకాల సరస్సు సుమారు 35 వేల ఎకరాల ఆయకట్టుకుపైగా సాగు నీటిని అందిస్తూ రైతన్నల పాలిట కల్పతరువులా ఉంది. ప్రతి ఏటా రెండు పంటలకు నీటిని అందిస్తూ ఈ ప్రాంతాన్ని ధాన్యాగారంగా మార్చింది. సాగు తాగు నీరును అందిస్తూ నియోజకవర్గానికి ఆత్మీయ అనుబంధమైంది. ఇంతటి ప్రాశస్తి ఉన్న సరస్సు నేడు పట్టింపు లేక దయనీయ స్థితిలో ఉంది.

నిర్లక్ష్యంలో పర్యాటక ప్రాంతం..

పాకాలలో చిలుకమ్మగుట్ట , తూములు, కాలువలు, మత్తడి ప్రాంతం, అభయారణ్యం, బట్టర్ ఫ్లై పార్కు, ఔషధ పార్కు, ఉద్యాన వనం, టవర్ వ్యూ పాయింట్ లాంటి ప్రదేశాలు ఆహ్లాదకరంగా ఉండి పర్యాటకులను ఆకట్టుకుంటాయి. వడిగా దూకే పాకాల మత్తడి కోసమే వేలాది మంది పర్యాటకులు నిత్యం వస్తుంటారు. శాఖల మధ్య సమన్వయ కొరవడి బోటింగ్ నిలిపివేయడంతో పర్యాటకులు తీవ్ర నిరాశలో ఉన్నారు. ఇక కాకతీయ రిసార్ట్స్ పేరుతో రెస్టారెంట్, అతిథి గృహాలు గొప్పగా నిర్మించారు. కరోనా కాలంలో మూతబడిన రెస్టారెంట్ నేటికీ తెరుచుకోలేదు. దీంతో పర్యాటకులు ఆకలి దప్పికలతో కడుపు మాడ్చుకుంటున్నారు. పార్కులో ఆట వస్తువులు పనికిరాకుండా ఉన్నాయి.

అటవీ శాఖ వసూళ్లు..

సరస్సు ప్రారంభంలోనే ప్రవేశ ద్వారాన్ని ఏర్పాటు చేసి కట్ట మీదకి వెళ్లే ప్రతీ పర్యాటకుడి నుంచి రూ.40 చొప్పున అటవీ శాఖ సిబ్బంది టికెట్ పేరుతో వసూలు చేస్తున్నారు. డబ్బులు వసూలు చేస్తున్నా అభివృద్ధి మాత్రం కంటికి కనిపించడం లేదు. కట్ట మీద ఉన్న రామక్క దేవతని దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటారు. ప్రవేశానికి డబ్బులు వసూలు చేయడంతో పర్యాటకులు అసహనంతో ఉన్నారు. కొంతకాలం క్రితం అటవీ సిబ్బంది సైతం స్థానికులతో గొడవకి దిగిన వివాదం పోలిస్ స్టేషన్ కి చేరింది. పర్యాటక, అటవీ శాఖల ఆధ్వర్యంలో నిర్వహించిన బోటింగ్ టికెట్ వసూళ్ల పంపకాల్లో బేధాభిప్రాయాలతోనే మూలకు పడిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

సౌకర్యాల లేమి..

పాకాలలో పర్యాటకులకు కనీస సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. వాటర్, ఆహార పదార్థాలు కూడా అందుబాటులో లేవు. కట్టపై రోడ్డు గుంతలు పడి అధ్వానంగా మారింది. కనీసం డస్ట్ బిన్ లు కూడా ఏర్పాటు చేయడంలో అటవీ శాఖ విఫలమైనట్లు పర్యాటకులు వాపోతున్నారు. పాకాల పరిసరాల్లో బహిరంగ మద్యపానం చేస్తున్నప్పటికీ చూసీచూడనట్లుగా వ్యవహారం ఉంది. ఇప్పటికైనా బోటింగ్ సౌకర్యం, రెస్టారెంట్ తిరిగి పునరుద్ధరిస్తే పర్యాటకులను ఆకర్షించవచ్చు. ఔషధ పార్కు వరకూ వెళ్లేందుకు మార్గం కూడా ఆధునీకరించాల్సిన అవసరం ఉంది. బట్టర్ ఫ్లై పార్కు పేరుకే తప్పితే సరైన రక్షణాత్మక చర్యలు కరువయ్యాయి.

అటవీ, పర్యాటక శాఖ ఫెయిల్యూర్..

విభిన్న జాతుల వృక్ష, జంతుజాలం ఉన్నప్పటికీ పాకాల అభయారణ్యం, పాకాల సరస్సును అద్భుతమైన పర్యాటక క్షేత్రంగా రూపొందించడానికి అధికారులు ప్రణాళికలు రూపొందించకుండా అలసత్వంగా ఉన్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అటవీ సంరక్షణ వారోత్సవాల సందర్భంలో నామ మాత్రంగా తప్పితే పాకాల జీవవైవిధ్యంపై ప్రచారం చేయడంలో అటవీ శాఖ విఫలమైంది. స్మగ్లర్లు, వేటగాళ్లను సైతం నిలువరించడంలో ప్రభుత్వ శాఖలు ప్రగతిని సాధించలేక పోతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం, అధికారులు ప్రత్యేక దృష్టిసారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.


Similar News