మావోయిస్టుల కదలికలపై నిఘా పెంచాలి..: ఎస్పీ శబరీష్
వార్షిక తనిఖీలలో భాగంగా శుక్రవారం రోజున ములుగు జిల్లా ఎస్పీ
దిశ,ఏటూరునాగారం : వార్షిక తనిఖీలలో భాగంగా శుక్రవారం రోజున ములుగు జిల్లా ఏస్పీ శబరీష్ నూగూరు వెంకటాపురం పోలిస్ స్టేషన్ తనిఖీ చేసారు. ముందుగా స్టేషన్ రిసెప్షన్‌లో గల రికార్డ్స్‌ను పరిశీలించి కేసుల నమోదు స్థితి గతులను తెలుసుకుని పెండింగ్ కేసులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. పోలిస్ స్టేషన్ సిబ్బంది కిట్ ఆర్టికల్స్, ఆయుధ సామాగ్రిని సిబ్బంది నైపుణ్యాన్ని తనిఖీ చేసారు. ఈ సందర్బంగా జిల్లా ఎస్పీ సిబ్బందితో మాట్లడుతూ.. వెంకటాపురం పోలీస్ స్టేషన్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు ఛత్తీస్ ఘడ్ తో అంతర్రాష్ట్ర సరిహద్దును కలిగి ఉన్నందున గంజాయి రవాణా పై ఎక్కువగా దృష్టి సారించాలని, ముఖ్యంగా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నందున ప్రజల భద్రత పై చర్యలు తీసుకోవాలని తెలియజేశారు. ఇసుక లారీలు రోడ్ల పై నిలిపితే కేసులు నమోదు చేయాలన్నారు.
అలాగే బాధిత వ్యక్తుల నుంచి ఫిర్యాదును స్వీకరించిన అనంతరం వారికి వెంటనే రసీదు అందించాలని ఎఫ్ఐఆర్ నమోదు, కేసుల దర్యాప్తు నిష్పక్షపాతంగా నిర్వహించాలని ఎస్పీ తెలియజేశారు. అనంతరం పోలీస్ స్టేషన్ ఆవరణలో నమోదు కాబడిన, వదిలివేయబడిన వాహనాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. పోలీస్ ఉద్యోగం అనేది భాద్యతతో కూడుకున్నదని క్రమశిక్షణతో ఉద్యోగం చేయాలని, విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే శాఖ పరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం పోలీస్ స్టేషన్ సిబ్బంది సమస్యలను అడిగి తెలుసుకుని వాటి పరిష్కార దిశగా ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో వెంకటాపురం సీఐ కుమార్, వెంకటాపురం ఎస్సై తిరుపతి రావు, శిక్షణ (ప్రొబీషనరీ) ఎస్ఐ ఆంజనేయులు, పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.