సీనియర్ జర్నలిస్టు సుభాష్ ఆకస్మిక మృతి
ఆంధ్రజ్యోతి దినపత్రికలో రెండు దశాబ్దాలుగా పనిచేస్తున్న సీనియర్
దిశ, వరంగల్ బ్యూరో : ఆంధ్రజ్యోతి దినపత్రికలో రెండు దశాబ్దాలుగా పనిచేస్తున్న సీనియర్ జర్నలిస్ట్, నాయకపు సుభాష్ అకాల మరణం చెందారు. సోమవారం ఉదయం గుండెపోటుతో హన్మకొండలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. సుభాష్ మరణంతో వరంగల్ జర్నలిస్టులు తీవ్ర దిగ్బ్రాంతికి లోనయ్యారు. తెలంగాణ ఉద్యమంలోనూ క్రియాశీలక పాత్ర పోషించారని పలువురు మేధావులు, విద్యావేత్తలు, ఉద్యమకారులు గుర్తు చేసుకున్నారు.
ప్రముఖుల నివాళి..!
సుభాష్ ఆకస్మిక మరణం జర్నలిస్ట్ సమాజానికి తీరని లోటని స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. సుభాష్ మరణం తీవ్ర దిగ్బ్రాంతికి గురి చేసిందని అన్నారు. హన్మకొండ భీమారంలోని సుభాష్ గృహానికి వెళ్లి భౌతికకాయానికి శ్రీహరి నివాళులర్పించారు. నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి, వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్‌తో పాటు పలువురు రాజకీయ, వ్యాపార, పాత్రికేయ రంగ ప్రముఖులు సుభాష్ కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. జర్నలిస్ట్ గా ప్రజా సమస్యలపై అంకిత భావంతో పని చేసే వారని, అలాంటి వ్యక్తి నేడు అకాల మరణం చెంది మన మధ్య లేడు అనే నిజాన్ని నమ్మలేకపోతున్నట్లు తెలిపారు. వృత్తి పరంగానే కాకుండా వ్యక్తిగతంగా కూడా ఎంతో సన్నిహితంగా ఉండే వ్యక్తిని కోల్పోవడం చాలా బాధాకరమని తెలిపారు. సుభాష్ ఆకస్మిక మరణం జర్నలిస్ట్ సమాజానికి తీరని లోటని గుర్తు చేసుకున్నారు.