విద్యార్థులే ఈ ప్రపంచంలో నిజమైన హీరోలు: నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కైలాస్ సత్యార్థి
విద్యార్థులు చిన్నప్పటినుండే మానవ విలువలను పెంపొందించే దిశగా ఆలోచనలు చేయాలని నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కైలాస్ సత్యార్థి అన్నారు.
దిశ, కేయూ క్యాంపస్ హనుమకొండ: విద్యార్థులు చిన్నప్పటినుండే మానవ విలువలను పెంపొందించే దిశగా ఆలోచనలు చేయాలని నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కైలాస్ సత్యార్థి అన్నారు. హన్మకొండ జిల్లాలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా కైలాస్ సత్యార్థి పాల్గొని మాట్లాడారు. ఈ ప్రపంచంలో విద్యార్థులు, చిన్నారులే నిజమైన హీరోలు అని అన్నారు. ఈ సందర్భంగా ఆయన పాత జ్ఞాపకాలను తలుచుకున్నారు. బాలలు తమ హక్కులను కోల్పోకుండా చూడాలనే ఉద్దేశంతో నిరంతరం బాలల హక్కుల కోసం కృషి చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
ఇప్పటికైనా చిన్నారులు అందరూ ఆడ మగ, కులం మతం భేదం లేకుండా ఉండాలని అన్నారు. ఎవరి ఒంట్లో అయిన రక్తము ఎర్రగానే ఉంటుందని.. కులానికొక రంగు, మతాని కొక రంగు రక్తం ఉండదన్నారు. తాను జర్మనీలో ఒక నోబెల్ ప్రైజ్ విజేత స్ఫూర్తితో సామాజిక సమస్యలపై పోరాటం ప్రారంభించినట్లు తెలిపారు. కుల, మత, ప్రాంతాలకు అతీతంగా ప్రతీ ఒక్కరికి నిర్భంద విద్య ఉండాలని ఈ దిశగా ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సారించాలని, చర్యలు తీసుకోవాలని కోరారు. విద్యార్థులను తల్లి దండ్రులు, గురువులు ప్రోత్సాహించాలని అన్నారు. విద్యార్థులు సమాజం కోసం ఆలోచించాలన్నారు. దేశమంతా ఒక్కటే.. ప్రజలంతా ఒక్కటే అని అన్నారు. బాల కార్మిక వ్యవస్థను అందరం కలిసి నిర్మూలిద్దామని పిలుపునిచ్చారు.
రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు వినోద్ కుమార్ మాట్లాడుతూ.. భారతదేశంలో ఆర్టికల్ 21 ప్రకారంగా ప్రతి వ్యక్తి చదువుకునే హక్కు ఉందని.. దీనిని తెలంగాణ రాష్ట్రంలో తూచా తప్పకుండా అమలు చేస్తున్నామన్నారు. ఇప్పటి వరకు వరంగల్ జిల్లాకు ఇద్దరు నోబెల్ బహుమతి గ్రహీతలు మదర్ తెరిస్సా, కైలాస్ సత్యార్థి వచ్చారని.. వీరు ఈ గడ్డపై అడుగు పెట్టడం మన అందరికీ గర్వకారణం అని కొనియాడారు. చిన్నారుల హక్కుల కోసం పోరాడుతున్న వ్యక్తి కైలాష్ సత్యార్థి అని అన్నారు. తెలంగాణలో పిల్లలకు ఉజ్వల భవిష్యత్తు ఉందన్నారు. పిల్లల హక్కులను రక్షించేందుకు తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.
ఎమ్మెల్యే, చీఫ్ వినయ్ భాస్కర్ మాట్లాడుతూ.. చారిత్రాత్మకమైన వరంగల్ నగరానికి బాలల హక్కుల కోసం నిరంతరం పాటుపడి నోబెల్ శాంతి బహుమతి పొందిన కైలాస సత్యార్థి రావడం మన అదృష్టమని ఆయన అన్నారు. సత్యార్థి ఫౌండేషన్ 86 వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి, 80వేల మందికి విముక్తి కల్పించారని గుర్తు చేశారు. తెలంగాణ రాష్టంలో బాలల పరిరక్షణ జరుగుతుంది అని వివరించారు. ఈ కార్యక్రమంలో వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి, హనుమకొండ వరంగల్, జిల్లా కలెక్టర్లు రాజీవ్ గాంధీ హనుమంతు, డా. గోపి, సీపీ రంగనాథ్, మున్సిపల్ కమీషనర్ ప్రవీణ్య, అదనపు కలెక్టర్ సంధ్యా రాణి, డీఆర్ఒ వాసు చంద్ర, పిడిడి.ఆర్. డి.ఏ. శ్రీనివాస్ కుమార్, డీఈఓలు అహ్మద్ హై, వాసంతి, డా. సుధాకర్, ప్రొ. రవీందర్, డా.రాజేష్ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
READ MORE