ప్రభుత్వ పాఠశాలలో వసతుల కల్పనకు చర్యలు చేపట్టాలి : హనుమకొండ కలెక్టర్

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా

Update: 2024-10-15 13:36 GMT

దిశ,హన్మకొండ : ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తాగునీటి సౌకర్యం కల్పించడం తో పాటు టాయిలెట్ల మరమ్మత్తు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య అన్నారు. మంగళవారం హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండల కేంద్రంలోని విద్యా వనరుల కేంద్రం తో పాటు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను కలెక్టర్ పరిశీలించారు. విద్యా వనరుల కేంద్రంలో ప్రభుత్వ పాఠశాలలకు పంపిణీ చేయాల్సిన పాఠ్యపుస్తకాల గురించి కలెక్టర్ ఎంఈఓ విజయ్ కుమార్ ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం జడ్పీ ఉన్నత పాఠశాలలో తాగునీరు, టాయిలెట్స్, మధ్యాహ్న భోజనాన్ని కలెక్టర్ పరిశీలించారు.

వాటి గురించిన వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. పాఠశాలకు సంబంధించిన పలు రికార్డులను కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ఆధ్వర్యంలో తాగునీరు, టాయిలెట్స్ మరమ్మత్తు పనులను త్వరగా పూర్తి చేయాలని ఎంఈఓ, ప్రధానోపాధ్యాయులకు సూచించారు. వాటి పనులను మొదలుపెట్టి త్వరగా పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాలన్నారు. పాఠశాల విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనం నాణ్యత తో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. మెనూ ప్రకారం విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించాలన్నారు. ఈ సందర్భంగా తహసీల్దార్ జగన్మోహన్ రెడ్డి, ఎంపీడీవో శ్రీనివాస్ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.


Similar News