గవర్నమెంట్ గ్రీన్ సిగ్నల్.. త్వరలో నెరవేరనున్న ఆ జిల్లా వాసుల కల
వరంగల్ అభివృద్ధికి అడుగులు పడుతున్నాయి. ..
దిశ, వరంగల్ బ్యూరో: వరంగల్ అభివృద్ధికి అడుగులు పడుతున్నాయి. రాష్ట్ర రాజధానిగా వరంగల్‌ను తీర్చిదిద్దాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పలు పెండింగ్ ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్తోంది. అందులో భాగంగానే 41 కిలోమీటర్ల మేర వరంగల్ ఔటర్ రింగ్ రోడ్డు, 13 కిలోమీటర్ల ఇన్నర్ రింగ్ రోడ్డు, ఓరుగల్లువాసుల చిరకాల ఆకాంక్షగా మిగిలిపోతున్న మామునూరు ఎయిర్‌పోర్టు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా వ్యవహరిస్తోంది. ఈ మూడు ప్రధాన ప్రాజెక్టులకు సంబంధించి ఇప్పటికే మంత్రివర్గంలో జిల్లా మంత్రి సురేఖ, జిల్లా ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చర్చించగా సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. తదనుగుణంగానే వరంగల్ ఔటర్ రింగు రోడ్డు, ఇన్నర్ రింగు రోడ్డు, మామునూరులో ఎయిర్‌పోర్టుకు సంబంధించిన పనుల విషయంలో ముందడుగు పడుతోంది.
ఐఆర్ఆర్‌కు గ్రీన్‌సిగ్నల్ పడినట్లే..!
రెండు వందల అడుగుల వెడల్పుతో 13 కిలోమీటర్ల మేర వరంగల్‌లో ఐఆర్‌ఆర్‌ను నిర్మించడానికి గత ప్రభుత్వం యోచించింది. తొలి దశలో ఎనిమిది కిలోమీటర్లు.. రెండో దశలో ఐదు కిలోమీటర్లు నిర్మించాలని ప్రతిపాదించారు. అయితే అనుకున్నంత వేగంగా పనులు ముందుకు సాగలేదు. భూ సేకరణకు ప్రభుత్వం నిధులు విడుదల చేయలేదు. భూ సేకరణ పనులు జరగలేదు. తాజాగా ఐఆర్ఆర్ నిర్మాణానికి అంచనా వ్యయం రూ.570కోట్లు కాగా ఇందులో భూసేకరణ కోసం రూ.350కోట్లు, రోడ్లు, వంతెనలు తదతర వాటి కోసం రూ.220కోట్లు వెచ్చించాల్సి ఉంటుందని అంచనాలు రూపొందాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇన్నర్ రింగ్‌రోడ్డు నిర్మాణాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మాణాన్ని చేపట్టేందుకు చర్యలు తీసుకుంటోంది. వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిలోని ఆర్టీవో ఆఫీసు జంక్షన్ నుంచి నర్సంపేట రోడ్డులోని ఈఎస్‌ఐ హాస్పిటల్ (కట్టమల్లన్న టెంపుల్) మీదుగా ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ గేట్ వరకు నిర్మించేందుకు గతంలోనే అలైన్‌మెంట్ రూపొందించారు. 80శాతానికి పైగా భూసేకరణ కూడా పూర్తయింది. ఇన్నర్ రింగ్ రోడ్డు పనులకు గ్రీన్‌సిగ్నల్ లభించినట్లేనని చెప్పుకోవచ్చు. ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మాణం పూర్తయితే ఖమ్మం హైవే నుంచి నేరుగా ఆర్టీవో కార్యాలయం జంక్షన్ మీదుగా నర్సంపేట రోడ్డు, ఎనుమాములకు చేరుకునేందుకు మార్గం ఏర్పడనుంది. అక్కడి నుంచి వరంగల్-ములుగు 163 ఎన్‌హెచ్‌కూ చేరుకోవచ్చు. ఐఆర్‌ఆర్ నిర్మాణంతో వరంగల్‌లో ట్రాఫిక్ సమస్య దూరం కానుంది.
వరంగల్‌కు ఓఆర్ఆర్ అభివృద్ధి హారం...
మహా నగర ఔటర్ రింగ్‌రోడ్డును ఎన్‌హెచ్ 163లో 30 కిలోమీటర్లు, ఎన్‌హెచ్ 563లో 41 కిలోమీటర్ల నాలుగు లైన్ల రోడ్డును చేపట్టాల్సి ఉంది. ఈ మొత్తం రోడ్డు నిర్మాణానికి సుమారు 911ఎకరాల భూమి భూసేకరణ చేయాల్సి ఉంది. అంచనా వ్యయం సుమారు రూ.1,500కోట్లు. రాంపూర్, నష్కల్, ధర్మపురం, వెంకటాపూర్, ఐనవోలు, పున్నెలు, బొల్లికుంట, కాపులకానిపర్తి, వసంతాపూర్, ధర్మారం, బొడ్డు చింతలపల్లి, మొగిలిచర్ల, కొత్తపేట వరకు సిద్ధమై ఉన్న నిర్మాణానికి అనుసంధానం చేస్తూ పూర్తి చేయనున్నారు. మొదటి దశలో 20కిలోమీటర్లు, రెండో దశలో 11కిలోమీటర్లు, మూడో దశలో 10కిలోమీటర్లు నిర్మించే అవకాశం ఉంది. ఈ మేరకు అధికారులు ప్రణాళికలు రచించినట్టు తెలుస్తోంది. నగర శివారు ప్రాంతాల్లో రవాణా సౌకర్యాలు మెరుగుపడడమే కాకుండా భూముల ధరలు కూడా పెరిగి ఆ ప్రాంతాల్లో చెప్పుకొదగ్గ స్థాయిలో అభివృద్ధి జరుగుతుందన్న ఆశాభావం నగరవాసుల్లో వ్యక్తమవుతోంది.
మామునూరు ఎయిర్‌పోర్టు..!
వరంగల్ వాసుల విమానం కల నెరవేర్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. వరంగల్ జిల్లా ఖిలా వరంగల్ మండలంలో నిర్మించ తలపెట్టిన మామూనూరు విమానాశ్రయానికి భూసేకరణకు కసరత్తు కొలిక్కి వస్తోంది. తొలి దశలో 253 ఎకరాలు సేకరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ) అధికారులతో గడిచిన కొద్ది నెలలుగా సంప్రదింపులు చేస్తోంది. తాము సూచించిన అదనపు భూమి కేటాయిస్తే నిర్మాణ వ్యవహారాలు మొదలు పెడతామంటూ ఏయిర్ పోర్టు అథారిటీ అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. ప్రస్తుత 1.8 కిలోమీటర్ రన్‌వేని 3.9 కిలోమీటర్లకు విస్తరించడానికి వీలుగా భూ సేకరణ అవసరమని ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ) తన మార్గదర్శకాల్లో పేర్కొంది. ఆపై బోయింగ్ 747 వంటి పెద్ద విమానాలు కూడా మామునూరు ఎయిర్ పోర్ట్‌కు రావడానికి వెసులుబాటు దొరుకుతుందని స్పష్టం చేసింది.
దీంతో ఏఏఐ సూచనలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం భూముల సేకరణ పూర్తి చేసి ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకు అందించాలని నిర్ణయించింది. విమానాశ్రయ నిర్మాణానికి మొత్తం 950ఎకరాలు కావాలని ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ) పేర్కొంది. మామూనూరులో ఇప్పటికే ఎయిర్ పోర్ట్ స్థలం 693ఎకరాలుండగా, మరో 253ఎకరాలను గాడిపల్లి, గుంటూరుపల్లి గ్రామాల నుంచి 197ఎకరాలు, నక్కలపల్లి గ్రామం నుంచి 149.36ఎకరాలు, మామునూరు గ్రామం నుంచి 5ఎకరాలను సేకరించనున్నారు. మొత్తం 233మంది రైతుల నుంచి భూ సేకరణ చేపట్టనున్నారు. ప్రత్యామ్నాయంగా ఆ రైతులకు మామునూరు డెయిరీఫాం భూములు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నా, తమకు గుంటూరుపల్లి గ్రామంలో కావాలనే డిమాండ్‌ను రైతులు వినిపిస్తున్నారు.
ఇప్పటికే మూడు గ్రామాల్లో రైతులతో సభలు నిర్వహించిన అధికారులు.. వారిని ఒప్పించి భూమిని స్వాధీనం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. దీనిపై రైతుల్లో భిన్నాభిప్రాయాలున్నప్పటికీ ఎక్కువ మంది రైతులు సానుకూలతను వ్యక్తం చేస్తున్నట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఈనెలాఖరులోగా భూ సేకరణ ప్రక్రియలో దాదాపు స్పష్టత వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. మార్కెట్ రేటుకు అనుగుణంగానే రైతులు, నిరాశ్రాయులకు పరిహారం చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు సమాచారం. దీంతో ఎయిర్ పోర్టు పనులకు ఆటంకాలు తొలగిపోయినట్లుగా ఉన్నతాధికారులు పేర్కొంటుండడం గమనార్హం.