రేపే కొమ్మాల శ్రీ లక్ష్మీనరసింహస్వామి జాతర
కోరిన కోర్కెలు తీర్చే కొంగుబంగారమైన కొమ్మాల శ్రీ లక్ష్మీనరసింహ స్వామి జాతర రేపటి నుండి ప్రారంభం కానుంది.

దిశ, గీసుగొండ : కోరిన కోర్కెలు తీర్చే కొంగుబంగారమైన కొమ్మాల శ్రీ లక్ష్మీనరసింహ స్వామి జాతర రేపటి నుండి ప్రారంభం కానుంది. 18వ తారీకు వరకు ఐదు రోజులు అంగరంగ వైభవంగా జరగనుంది. రేపు సాయంత్రం కొమ్మాల ప్రధాన ద్వారం నుండి ఎడ్లబండ్లు, ట్రాక్టర్లు, ప్రభ బండ్లు ప్రవేశించి గుట్ట చుట్టూ తిరుగుతాయి. ఐదవ రోజైన 18వ తారీకున రథోత్సవంతో స్వామిని ఊరేగించడంతో జాతర ముగియనుంది.
ఈ జాతరకు జిల్లా నలుమూలల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ మొక్కులు చెల్లించుకోనున్నారు. కాగా అధికారులు ఇప్పటికే జాతరలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పోలీసు శాఖ వారు సుమారు 500 మంది సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేసి జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా గస్తీకాయనున్నారు. ఈసారి ప్రభ బండ్లకు అవకాశం ఉండడంతో రాజకీయ పార్టీలు తమ ప్రభ బండ్లతో ప్రాబల్యాన్ని చాటుకోనుండగా అందరి దృష్టి కొమ్మాల జాతర పైనే కేంద్రీకృతమై ఉంది.