రాజకీయ ప్రభల కోలాహలం
వరంగల్ జిల్లాలోని నర్సంపేట డివిజన్ దుగ్గొండి మండలంలోని వివిధ గ్రామాల నుండి కొమ్మాలకు బయలుదేరిన ప్రభలు శనివారం పార్టీల జెండాలు, కార్యకర్తల నృత్యాలు, బోనాలు, డీజే సౌండ్ల మోతలతో ఆకట్టుకున్నాయి.
దిశ, దుగ్గొండి : వరంగల్ జిల్లాలోని నర్సంపేట డివిజన్ దుగ్గొండి మండలంలోని వివిధ గ్రామాల నుండి కొమ్మాలకు బయలుదేరిన ప్రభలు శనివారం పార్టీల జెండాలు, కార్యకర్తల నృత్యాలు, బోనాలు, డీజే సౌండ్ల మోతలతో ఆకట్టుకున్నాయి. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ ఎస్, వామపక్షాల పార్టీల ప్రభలు ఆకర్షణగా నిలిచాయి. ఉదయం నాలుగు గంటల నుండి సాయంత్రం వరకు గిర్నిబావి సెంటర్ జనాలతో కిక్కిరిసిపోయింది. రాజకీయ ప్రభలతో పాటు పలువురు మొక్కుబడిగా ఒంటె, ఏనుగు, గుర్రం బొమ్మలతో తీసుకొచ్చిన ప్రభలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
ఉద్రిక్తల మధ్య ప్రభలు.. స్వల్ప లాఠీ చార్జ్
మండలంలోని వివిధ గ్రామాల నుండి బయలుదేరిన రాజకీయ ప్రభలు శనివారం ఉదయం గిర్నిబావి సెంటర్ కు చేరుకున్నాయి. గిర్నిబావి సెంటర్ వద్ద ప్రభల శోభాయాత్రలో కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల ప్రభలు ముందు వెళ్లడానికి తోపులాట చోటు చేసుకోవడంతో ఇరు పార్టీల వారు నినాదాలు చేయడంతో పోలీసులు కలుగజేసుకొని సద్దిచెప్పే ప్రయత్నం చేశారు.
దాంతో ఇరు వర్గాల కార్యకర్తలు ఒకరిపై ఒకరు పోలీసులు అమర్చిన బారీ కేడ్లను విసిరేసుకునే ప్రయత్నం చేయడంతో రంగంలోకి దిగిన పోలీసులు ఇరు వర్గాల కార్యకర్తలపై లాఠీచార్జ్ చేసి చదరగొట్టారు. పోలీసులు లాఠీ చార్జ్ చేయడంతో కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తలకు గాయాలయ్యాయి. బీఆర్ఎస్ కార్యకర్తలపై లాఠీఛార్జ్ కు నిరసనగా మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, నాయకులు, కార్యకర్తలతో కలిసి రహదారిపై బైఠాయించి నిరసన తెలుపుతూ పోలీసుల తీరు పట్ల అసహనం వ్యక్తం చేశారు.
ప్రభల తాకిడితో ట్రాఫిక్ కు అంతరాయం
శనివారం రాజకీయ ప్రభల శోభాయాత్ర సందర్భంగా గిర్ని బావి వద్ద కొంతమేర ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. ఉదయం నుండి రోడ్డుపైకి వచ్చిన రాజకీయ ప్రభలను పోలీసులు బారీకేడ్ల సహాయంతో నియంత్రించారు. మధ్యాహ్న సమయంలో గిర్ని బావి సెంటర్ వద్ద కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రభలు ఒక్కసారిగా వెళ్లడానికి ప్రయత్నించడంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. పోలీసులు పార్టీ కార్యకర్తలపైకి లాఠీచార్జ్ చేసిన సందర్భంలోనూ గంటల తరబడి రోడ్డుపై వాహనాలు నిలిచిపోయాయి.
ఉద్రిక్తల మధ్య ప్రభలు
కాంగ్రెస్, బీఆర్ఎస్, సీపీఎం, సీపీఐ, బీజేపీ ప్రభలు, జెండాలు, కార్యకర్తల నృత్యాలు, బోనాలు, డీజే సౌండ్ల మోతలతో నృత్యం చేస్తూ జాతర సంబరాలు చేసుకున్నారు. గిర్నిబావి సెంటర్ వద్ద ప్రభల శోభాయాత్రలో కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల ప్రభలు ముందు వెళ్లడానికి తోపులాట చోటు చేసుకోవటంతో ఇరు పార్టీల వారు నినాదాలు చేశారు. దాంతో పోలీసులు కలుగజేసుకొని సద్దిచెప్పడం తో గొడవ సద్దుమణిగింది. ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ కుమార్ ప్రత్యేక చొరవ తీసుకొని ఆందోళన కారులను శాంతింపజేశారు. నర్సంపేట సబ్ డివిజన్ నుండి 200 మందికి పైగా పోలీసులు దుగ్గొండి సీఐ సాయిరమణ ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు.
ప్రభలను ప్రారంభించిన ఎమ్మెల్యే దొంతి, మాజీ ఎమ్మెల్యే పెద్ది
కాంగ్రెస్ పార్టీ ప్రభలను స్థానిక ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి టెంకాయ కొట్టి ప్రారంభించారు. అలాగే బీఆర్ఎస్ ప్రభలను మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి, నన్నపనేని నరేందర్ లు ప్రభ బండ్ల ట్రాక్టర్ ల వద్ద టెంకాయ కొట్టి వాహనాన్ని నడిపి ప్రారంభించారు. కార్యక్రమంలో నర్సంపేట మార్కెట్ కమిటీ ఛైర్మన్ పాలాయి శ్రీనివాస్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తోకల శ్రీనివాస్ రెడ్డి, మండలాధ్యక్షుడు ఎర్రల్ల బాబు, వర్కింగ్ ప్రెసిడెంట్లు ఒలిగే నర్సింగరావు, చెన్నూరి కిరణ్ రెడ్డి, యూత్ అధ్యక్షుడు రవివర్మ, నాయకులు డ్యాగం శివాజీ, బొమ్మినేని భరత్ రెడ్డి, బండారి ప్రకాష్, సుకినే నాగరాజు, బీఆర్ఎస్ నుండి మాజీ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ఆకుల శ్రీనివాస్, ఎంపీపీ కాట్ల కోమల భద్రయ్య, మండలాధ్యక్షుడు రాజేశ్వర్ రావు, నియోజకవర్గ యూత్ కన్వీనర్ శానబోయిన రాజ్ కుమార్, నాగిశెట్టి ప్రసాద్, కంచరకుంట్ల శ్రీనివాస్ రెడ్డి, శెంకేశి కమలాకర్, బీజేపీ జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి గోగుల రాణా ప్రతాప్ రెడ్డి, మండలాధ్యక్షుడు నేదురు రాజేందర్, ఏరుకొండ కర్ణాకర్, ముప్పురపు జగదీశ్వర్, అచ్చ దయాకర్, సీపీఎం నుండి బోళ్ల సాంబయ్య, వీరా రెడ్డి, పుచ్చకాయల కృష్ణారెడ్డి పాల్గొన్నారు.