పాకాలలో రెచ్చిపోతున్న వేటగాళ్ళు..
వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలం పాకాల అభయారణ్యంలో వేటగాళ్లు రెచ్చిపోతున్నారు.
దిశ, ఖానాపురం : వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలం పాకాల అభయారణ్యంలో వేటగాళ్లు రెచ్చిపోతున్నారు. ఈ అభయారణ్యం అడ్డాగా మూగ జీవాల వేట యదేచ్చగా కొనసాగుతుంది. కాగా ఆదివారం పాకాల చెక్పోస్ట్ సమీపంలో నర్సంపేట నుండి కొత్తగూడ వెళ్తున్న ఆర్టీసీ బస్సును చిలుకమ్మ నగర్ వైపు నుండి నర్సంపేటకు వస్తున్న ఆటో ఢీకొనడంతో వేట వ్యవహారం బట్టబయలైంది.
ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి కాలుకు గాయాలయ్యాయి. కాగా ప్రమాదం జరిగిన వెంటనే బస్సు డ్రైవర్ కండక్టర్ కిందికి దిగి చూడగా ఆటోలో అడవి పంది మాంసం, చనిపోయిన కొండ గొర్రెను గుర్తించారు. దీనితో భయపడిన ఆటోలోని నలుగురు వ్యక్తులు కొండగొర్రెను అక్కడే పడవేసి ఆటో తో సహా పరారయ్యారు. ఇదిలా ఉండగా ఈ సంఘటన పై అటవీ అధికారులు విచారణ జరుపుతున్నట్లు ఎఫ్ఆర్ఓ తెలిపారు. పారిపోయిన వేటగాళ్లు ఏకాంబరం ఖానాపురం మండలం అశోకనగర్ వాస్తవ్యుడుగా గుర్తించారు. లవకుమార్ మొండ్రాయి గూడెం, సుమన్ , చింటూ, సుధీర్ అనే ముగ్గురిని చిలకమ్మ నగర వాస్తవ్యులుగా గుర్తించినట్లు ఎఫ్ఆర్ఓ తెలిపారు. అటవీ అధికారుల విచారణలో పూర్తి వివరాలు తెలుస్తాయి.