అభివృద్ధిలో తగ్గేదేలే..
ఆర్థిక అవస్థలున్నా సంక్షేమ, అభివృద్ధి పథకాలను అమలు చేయడంలో ఎలాంటి వెనకడుగు వేయబోదని అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు.
దిశ, లింగాలఘణపురం/ స్టేషన్‌ఘన్‌పూర్ : ఆర్థిక అవస్థలున్నా సంక్షేమ, అభివృద్ధి పథకాలను అమలు చేయడంలో ఎలాంటి వెనకడుగు వేయబోదని అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. జనగామ జిల్లాలోని స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గంలోని శివునిపల్లి వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి సురేఖ మాట్లాడారు. ప్రతి క్షణం తెలంగాణ ప్రజలు, వరంగల్ బిడ్డల కోసం కష్టపడుతున్న సీఎం రేవంతన్నకు తాము అంతా అండగా ఉంటామన్నారు. గత ప్రభుత్వంలో స్టేషన్ ఘన్‌పూర్, వరంగల్ జిల్లాలోని ఇతర నియోజకవర్గాలను పూర్తిగా నిర్లక్ష్యం చేశారని, రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక వరంగల్ ను తన సొంత ప్రాంతంలా అభివృద్ధి చేస్తున్నారని అన్నారు. వరంగల్ రెండో రాజధానిలాగా అభివృద్ధి చేయడం సంతోషమన్నారు. తమ ప్రాంతానికి పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. వరంగల్ ఒక మంచి టూరిజం స్పాట్ లాగా అభివృద్ధి చేయాలని సీఎంను కోరారు. రాణి రుద్రయాదేవి, సమ్మక్క-సారక్క లాంటి గొప్పగొప్ప మహిళా మణులు ఏలిన గడ్డ ఈ వరంగల్ అన్నారు.
సీఎం మాట ఇస్తే తప్పరని, పాత వరంగల్ ను కొత్తగా సరికొత్తగా చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఎయిర్ పోర్టు, టెక్స్టైల్ పార్కు కూడా త్వరలో రాబోతున్నాయని, వీటి కోసం సీఎం ఎంతగానో కృషి చేశారన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో సీఎం వెంట తాము అందరం ఉంటామని చెప్పారు. అనంతరం పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క మాట్లాడుతూ ప్రభుత్వం అంటేనే అభివృద్ధి, సంక్షేమం, సామాజిక న్యాయమని పేర్కొన్నారు. మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించే దిశగా ముందుకు వెళ్తున్నామని తెలిపారు. మహిళలను కోటీశ్వరులను చేసే లక్ష్యంగా ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తోందని, స్వయం సహాయక సంఘాలకు అన్ని బాధ్యతలను అప్పగించారని, ఇప్పటి వరకు 21 వేల కోట్ల వడ్డీ లేని రుణాలను అందించామని, మహిళలు అన్ని రంగాల్లో ఉన్నతంగా రాణించాలన్నదే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ఆ దిశగా ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తోందని తెలిపారు.
అనంతరం రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ చరిత్రలోనే అత్యంత ఎక్కువ నిధులు తీసుకొచ్చిన ఘనత కడియం శ్రీహరిదని అన్నారు. ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే చెప్పిన అంశాలనే కాదు సంక్షేమం కోసం చెప్పని అంశాలను కూడా అమలు చేస్తున్నామన్నారు. ఇచ్చిన మాట తప్పకుండా అన్ని హామీలను అమలు చేస్తున్నామన్నారు. రాబోయేది కూడా ఈ ప్రభుత్వమే అని తెలిపారు. అనంతరం వరంగల్ ఎంపీ కడియం కావ్య మాట్లాడుతూ రాష్ట్రంలో బీసీ కులగణనతో చరిత్రను ప్రభుత్వం సృష్టించిందని, 30 ఏళ్ల నుంచి కానటువంటి ఎస్సీల వర్గీకరణలో ఒక విప్లవాత్మక మార్పు తేవడం జరిగిందని, రాష్ట్రంలో అమలు చేసే అభివృద్ధి సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు.
విద్య, వైద్యం, వ్యవసాయం, పారిశ్రామిక రంగాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని, మహిళా స్వాలంబన దిశగా అన్ని రంగాల్లో మహిళలు రాణించాలని కోరారు. అనంతరం స్టేషన్ ఘనపూర్ శాసనసభ్యులు కడియం శ్రీహరి మాట్లాడుతూ గత పాలనలో ఘన్‌పూర్ (స్టేషన్) నియోజకవర్గం అభివృద్ధికి నోచుకోలేదని, కానీ ఈ ప్రభుత్వం ఎస్డీఎఫ్ నిధులు కేటాయించి నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక కృషి చేయాలన్నారు. ఈ నియోజకవర్గంలో ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటుతో ప్రజలకు మెరుగైన సేవలు అందుతాయని ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్, పాలకుర్తి శాసనసభ్యులు మామిడాల యశస్వినీ రెడ్డి, వరంగల్ సీపీ సన్ ప్రీత్ సింగ్, జనగామ జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, అదనపు కలెక్టర్లు (స్థానిక సంస్థలు) పింకేష్ కుమార్, (రెవెన్యూ) రోహిత్ సింగ్, వివిధ కార్పొరేషన్ ల చైర్మన్ లు, ప్రజాప్రతినిధులు, జిల్లా, పోలీసు అధికారులు, అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.