వామ్మో ఏంటీ ధరలు.. మేడారంలో ఒక్క బీర్ ధరెంతో తెలుసా?

Update: 2022-02-05 14:52 GMT

దిశ ప్రతినిధి, వ‌రంగ‌ల్: మేడారం జాతరలో ధరల మోత మోగుతుంది. ప్రతీ వస్తువు 100 శాతం అధిక ధరలకు విక్రయించడంతో సామాన్యుల జేబులు ఖాళీ అవుతున్నాయి. మద్యం, మాంసంతో పాటు నిత్యావసర వస్తువులతో పాటు ఆట వస్తువులన్నీ అధిక ధరలకే విక్రయిస్తున్నారు. నిన్నా మొన్నటిదాకా కొన్ని నిత్యావసర వస్తువులను వ్యాపారులు మూడింతల ధరలకు విక్రయిస్తుండడంతో పట్టపగలే చుక్కలు కనబడుతున్నాయని సందర్శకులు చెబుతున్నారు. జాతరకు ఇంటి నుంచి అన్ని వస్తువులు తెచ్చుకోలేక దాదాపు ఇక్కడే కొనుగోలు చేసేందుకు భక్తులు మొగ్గుచూపుతుంటారు. అయితే కొబ్బరికాయలు, బెల్లం, మద్యం కోసం లక్షలు వెచ్చించి టెండర్లు దక్కించుకున్న వ్యాపారులంతా రెండుమూడింతలు ధరలు పెంచి వాటిని విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. లక్ష రూపాయల పెట్టుబడితో రెండు నుంచి రూ.3 లక్షలు సంపాదించడం జాతరలో వ్యాపారులకు పరిపాటిగా మారిపోయింది. ప్రస్తుతం మాంసం, మద్యం ధరల్ని విపరీతంగా పెంచేశారు. కిలో మేక మాంసం వెయ్యి రూపాయలకు విక్రయిస్తున్నారు. కేజీ నాటు కోడిని 500 రూపాయలకు అమ్ముతున్నారు. బాయిల‌ర్ కోళ్ల ధ‌ర‌ల‌ను అమాంతం పెంచేశారు. కిలో రూ.180 వ‌ర‌కు విక్రయిస్తున్నారు. సాధార‌ణంగా రూ.110ల‌కు కూడా మించ‌వు. ఇక రూ.15-20లు ఉండే కొబ్బరికాయ జాత‌ర‌లో ఏకంగా రూ. 40 వ‌ర‌కు విక్రయిస్తున్నారు. బంతిపూల దండ రూ.100, తాగునీటి వాట‌ర్ క్యాను ఏకంగా రూ.70 నుంచి రూ.80 వ‌ర‌కు విక్రయిస్తున్నారు. మేకను కోసేందుకు వెయ్యి, నాటు కోడిని కోసి శుద్ధి చేసినందుకు రూ.60లు తీసుకుంటున్నారు. ఇలా ప్రతీ వ‌స్తువుపై అద‌న‌పు ధ‌ర‌ల‌తో భ‌క్తుల‌ను వ్యాపారులు బాదేస్తున్నారు.

మ‌ద్యం మ‌రీ పిరం..

మేడారంలో అనుమ‌తి ఉన్న మ‌ద్యం షాపు నిర్వాహకుల‌తో ఒప్పందం కుదుర్చుకున్న కొంత‌మంది ప్రతీ ఏరియాకు ప‌దుల సంఖ్యలో బెల్ట్‌షాపుల‌ను ఏర్పాటు చేసుకున్నారు. మొత్తం జాత‌ర‌లో దాదాపు 100కు చేరువ‌లో మద్యం షాపులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ షాపుల్లో వివిధ బ్రాండ్ల బీరు బాటిళ్ల వాస్తవ ధ‌ర రూ.140 నుంచి రూ.190 మ‌ధ్య ఉంటుంది. కానీ, జాత‌ర‌లో మాత్రం వీటి ధ‌ర ఏకంగా రూ.200 నుంచి రూ.270 వ‌ర‌కు విక్రయిస్తుండ‌టం గ‌మ‌నార్హం. లిక్కర్ ధ‌ర కూడా దాదాపు ఇదే విధంగా ఉంది. వాస్త‌వానికి జాత‌ర ప్రాంగ‌ణంలో త‌నిఖీలు చేప‌ట్టి విక్రయాల‌పై దృష్టి పెట్టాల్సిన అధికారులు ఏమాత్రం ప‌ట్టించుకోక‌పోవ‌డం గ‌మ‌నార్హం.

Tags:    

Similar News