నర్సంపేటకి ఒక్కరూ కాదు ఇద్దరు ఎమ్మెల్యేలు.. షర్మిల షాకింగ్ కామెంట్స్

నర్సంపేట లో ఎమ్మెల్యే ఒక్కరూ కాదు ఇద్దరు అని వై.ఎస్.ఆర్ టీ.పీ పార్టీ అధ్యక్షురాలు షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. పాదయాత్రలో భాగంగా ఆదివారం ఆమె నర్సంపేట పట్టణంలో పర్యటించారు

Update: 2022-11-27 15:01 GMT

దిశ,నర్సంపేట టౌన్: నర్సంపేట లో ఎమ్మెల్యే ఒక్కరూ కాదు ఇద్దరు అని వై.ఎస్.ఆర్ టీ.పీ పార్టీ అధ్యక్షురాలు షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. పాదయాత్రలో భాగంగా ఆదివారం ఆమె నర్సంపేట పట్టణంలో పర్యటించారు. ఈ సందర్భంగా అధికార పార్టీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పై ఆమె తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఉద్యమ నాయకుడు కబ్జా కోర్ అయ్యాడని పెద్ది పై ఘాటు విమర్శ చేశారు. మీ ఎమ్మెల్యే పేరులోనే పెద్ది ఉంది. అతను ఎవరికి పెద్ద అంటూ ఎద్దేవా చేశారు. అంతటితో ఆగకుండా ఆయన సతీమణి జెడ్పీ ఫ్లోర్ లీడర్ పెద్ది స్వప్న పై సైతం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

నర్సంపేటలో ఒక ఎమ్మెల్యే కాదు ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారంటూ చేసిన వ్యాఖ్యలు స్థానికంగా చర్చనీయాంశం అయ్యాయి. ఇదిలా ఉండగా ఇప్పటి వరకు ఎలాంటి అవినీతి కోణం లేని పెద్దిని ఉద్దేశించి ట్రాక్టర్ డ్రైవర్ రూ. 1000 కోట్లు ఎలా సంపాదించాడు అని ఆరోపణ చేయడం కూడా జనాల్లో ఆసక్తిని కలిగించింది. నర్సంపేట నియోజకవర్గ పరిధిలో పెద్దికి అవినీతి పరంగా ఎంతో కొంత క్లీన్ ఇమేజ్ ఉంది. కాకపోతే షర్మిల తన పర్యటనలో పెద్ది ఒక్క చేతితో కాదు నాలుగు చేతులా సంపాదిస్తున్నాడని వ్యాఖ్యానించడంతో ప్రజల్లో కొంత కుతూహలం ఏర్పడింది. పెద్ది నిజంగానే అంత సంపాదించాడా..? లేక ఇది రాజకీయ విమర్శనా..? అనే చర్చ జనాల్లో మొదలైంది. షర్మిల ఎమ్మెల్యే పెద్దిని,అతనితో పాటు సతీమణి స్వప్నను టార్గెట్ చేస్తూ తన ప్రసంగం కొనసాగించిందనేది స్పష్టమైంది.

ఇక ఎమ్మెల్యే పెద్ది ఏ రకంగా స్పందిస్తాడు అనేది వేచి చూడాలి. ఇక షర్మిల మాత్రం తనను తాను పెద్దిని కార్నర్ చేయడం ద్వారా నర్సంపేట నియోజక వర్గంలో ఫోకస్ చేసుకుంది. ఇక గురిజాల గ్రామం,చంద్రయ్య పల్లి గ్రామం అలానే నర్సంపేటలో పలు గ్రామాల ప్రస్తావన తెచ్చింది. అకాల వర్షాలకు నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించింది. మిర్చి పరిశోధన కేంద్రం ఎక్కడ పెట్టావంటూ బాహాటంగానే పెద్దిని ఎద్దేవా చేసింది. ఇక పాకాల సరస్సు మరమ్మత్తుల విషయంలో కూడా ఆమె విరుచుకుపడింది. ఇకపోతే ఎప్పటి లాగానే షర్మిల తన నాన్న వై.ఎస్ చేసిన కార్యక్రమాల ప్రస్తావన చేస్తూ వై.ఎస్ రక్తం అన్న పేరుని జనాల్లోకి చూపించే ప్రయత్నం చేసింది. టి.ఆర్.ఎస్, బి.జె.పి పార్టీలపై విరుచుకుపడ్డ ఆమె తన పర్యటన ద్వారా తెలంగాణలో క్షేత్ర స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజల్లోని అసంతృప్తిని చూస్తున్నానని తెలిపింది.

టీఆర్ఎస్ ప్రభుత్వ పట్ల ఉద్యోగ,నిరుద్యోగులతో పాటు సామాన్య ప్రజల్లో కూడా నమ్మకం సన్నగిల్లిందన్నారు. నర్సంపేటలో తన 3500 కి.మి పాదయాత్ర పూర్తి చేసుకోవడం సంతోషంగాఉందన్నారు. ప్రజా అభీష్టం మేరకు వై.ఎస్ రాజశేఖర రెడ్డి ఆశయాలని కొనసాగిస్తున్నట్లు పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేసి తెలంగాణను దివాలా తీశారని,రాష్ట్రంలో అవినీతి తార స్థాయికి చేరిందని ఆరోపించింది. వై.ఎస్ పథకాల్ని అమలు చేస్తూ రాష్ట్రాన్ని సంక్షేమ దిశగా పరుగెత్తే విధంగా వైఎస్‌ఆర్‌టీపీ పని చేస్తుందని వై.ఎస్ అభిమానులు తనతో కలిసి రావాలని ఆమె పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో వై.ఎస్.ఆర్ టి.పి నియోజక వర్గ నాయకులు నాడెం శాంతి కుమార్ తో పాటు వందలాది సంఖ్యలో నాయకులు , కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags:    

Similar News