అక్రమ లేఅవుట్లు.. అక్రమార్కుల దందాలు..!
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఓ నాన్ లే అవుట్ వెంచర్‌తో నిర్వాహాకులు బురిడి కొట్టిస్తున్నారు.
దిశ, వరంగల్ బ్యూరో: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఓ నాన్ లే అవుట్ వెంచర్‌తో నిర్వాహాకులు బురిడి కొట్టిస్తున్నారు. జిల్లా కేంద్రానికి అత్యంత చేరువలో ఉండటాన్ని ఆసరాగా చేసుకుని కొనుగోలుదారులకు ఎలాంటి అనుమతుల్లేని వెంచర్ ప్లాట్లను అంటగట్టేస్తున్నారు. భూపాలపల్లి మండలం కొమ్మాల గ్రామ పరిధిలోని సర్వే నెంబర్ 146/4లో ఓ సుమారు మూడెకరాల విస్తీర్ణంలో ఓ నాన్ లే అవుట్‌ను ఏర్పాటు చేశారు. మొత్తం భూపాలపల్లి-పరకాల ప్రధాన రహదారిపై ఆనుకుని ఉన్న ఈ వెంచర్‌కు ఎలాంటి అనుమతుల్లేకపోవడం గమనార్హం. ఈ వెంచర్‌లో స్వయంగా ఓ కౌన్సిలర్ భాగస్వామిగా ఉన్నట్లుగా తెలుస్తుండటం గమనార్హం. పట్టణ నడిబొడ్డున ఉన్న ఈ వెంచర్‌కు అనుమతుల్లేవని తెలిసినా.. మునిసిపల్ అధికారులు కొరడా ఝులిపించకుండా ఉదాసీనతగా వ్యవహరిస్తుండటం గమనార్హం.
42 ప్లాట్లలో సగం అమ్మకం..!
సుమారు మూడున్నర ఎకరాల్లో ఏర్పాటు చేసిన వెంచర్‌లో 30 ఫీట్ల రోడ్డుతో 42 ప్లాట్లు చేశారు. గజం భూమిని రూ.14 వేల నుంచి 16 వేల మధ్య విక్రయిస్తున్నారు. ఇప్పటికే సగం వరకు ప్లాట్లను విక్రయించినట్లుగా తెలుస్తోంది. వెంచర్ నిర్వాహాకులు కనీసం నాలా కన్వర్షన్ కూడా చేయకపోవడం గమనార్హం. రోడ్లేస్తాం.. విద్యుత్ సౌకర్యం కల్పిస్తాం.. డ్రెయినేజీ మాత్రం మీరే నిర్మించుకోవాలంటూ నమ్మబలుకుతున్నారు. నాలా కన్వర్షన్ చేసుకుంటే ఇంటి నిర్మాణానికి పర్మిషన్లు ఈజీగానే వస్తాయని చెబుతుండటం విశేషం. గత కొద్దిరోజులుగా నిర్వాహాకులు యథేచ్ఛగా ఈ దందా సాగిస్తున్నా మునిసిపల్ అధికారులు మాత్రం అడ్డుకునే ప్రయత్నం చేయకపోవడం గమనార్హం.
మునిసిపల్ ఆదాయానికి గండి..!
జిల్లా కేంద్రంలో జరుగుతున్న అభివృద్ధి పనులు, సింగరేణి, కేటీపీఎస్ వంటి ప్రముఖ సంస్థల మూలంగా భూపాలపల్లిలో భూములకు డిమాండ్ ఏర్పడింది. జిల్లా కేంద్రంలోనే స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటున్న వారి సంఖ్య గత మూడు నాలుగు సంవత్సరాలుగా గణనీయంగా పెరిగింది. ఈ భూమిని క్యాష్ చేసుకునేందుకు రియల్టర్లు మోసాలకు తెగబడుతున్నారు. అక్రమలే అవుట్లను అడ్డుకోగలిగితే పర్మిషన్ల పొందే రూపంలో మునిసిపాలిటీకి ఆదాయం గణనీయంగా సమకూరే అవకాశం ఉన్న అధికారులు మాత్రం మిన్నకుంటున్నారు. అధికార పార్టీ ఒత్తిళ్లు, కొంతమంది రియల్టర్లు ఇవ్వజూపుతున్న అమ్యామ్యాలకు ఆశపడి నిబంధనలకు పూర్తిగా నీళ్లొదిలేశారన్న విమర్శలు మునిసిపాలిటీ అధికారులపై వినిపిస్తున్నాయి.
యజమానుల అడ్రస్ దొరకడం లేదు.. (భూపాలపల్లి మునిసిపాలిటీ, టీపీబీవో, అవినాష్)
మునిసిపాలిటీ పరిధిలో చాలా నాన్ లే అవుట్లను గుర్తించాం. కానీ, క్షేత్రస్థాయిలో భూ యజమాని ఒకరు, రియల్ వ్యాపారులు వేరేలా ఉంటున్నారు. దీంతో ఎవరిపై చర్యలు తీసుకోవాలో అర్థం కావడం లేదు. ఇప్పటి వరకు మునిసిపాలిటీ పరిధిలో 10 వెంచర్లను గుర్తించాం. కానీ, చర్యల్లేమీ తీసుకోలేదు. ఇదిలా ఉండగా అక్రమమేనని తెలిశాక కూడా ఏవో సాకులు చూపుతూ వెంచర్లను ధ్వంసం చేయకుండా అధికారులు మీనమేషాలు లెక్కించడం, ఉదాసీనత వైఖరిని ప్రదర్శించడం వారి పనితీరును తేటతెల్లం చేస్తోంది.