పెద్దరామంచర్లలో ఆదిమానవుల వలస గుర్తులు

జనగామ మండల పరిధిలోని పెద్దరామంచర్ల గ్రామంలో కల్లాల బండపై ఆదిమానవుల వలసకు సంబంధించిన చారిత్రక ఆధారాలు వెలుగులోకి వచ్చాయి.

Update: 2024-10-13 11:05 GMT

దిశ, జనగామ : జనగామ మండల పరిధిలోని పెద్దరామంచర్ల గ్రామంలో కల్లాల బండపై ఆదిమానవుల వలసకు సంబంధించిన చారిత్రక ఆధారాలు వెలుగులోకి వచ్చాయి. చరిత్ర పరిశోధకులు రెడ్డి రత్నాకర్ రెడ్డి పెద్దరామంచర్ల గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెద్దరామంచర్ల గ్రామం నుండి పోచన్నపేట గ్రామానికి వెళ్లే బాటలో కల్లాల బండపై 50కి పైగా ప్రాథమిక స్థాయిలో ఉన్న గ్రూవ్స్ (పొడవైన బద్దులు)ఉన్నాయని, ఇవన్నీ బీసీఏ 2000 నుండి 4000 మధ్య కాలంలో కొత్త రాతియుగం నాటి ఆదిమానవులకు చెందినవిగా తెలిపారు. వేట, పశుపోషణ కోసం ఆదిమానవులు నూతన ఆవాసాలను గుర్తించే క్రమంలో ఈ ఊరి మీదుగా సాగిపోయి ఉంటారని అన్నారు.

    కొంతకాలం ఇక్కడే జీవించినప్పటికీ నీటి ప్రవాహం ,ఆహారానికి కావాల్సిన జంతువుల కొరత ఉండటం లేదా ప్రమాదకర జంతువుల నుండి రక్షించుకోవడానికి ఎత్తైన గుట్ట లేకపోవడం వంటి కారణాలతో ఇక్కడి నుంచి మరో ప్రాంతానికి తరలి వెళ్లి ఉంటారని భావిస్తున్నారు. కల్లాల బండపై రాతి పనిముట్లను తయారు చేసుకున్న చోట గ్రూవ్స్ ( బద్దులు)లోతు తక్కువగా ఒక గీత మాదిరిగా ఉన్నాయని, లోతు ఎక్కువగా లేకపోవడంతో వీటిని గుర్తించడం కూడా కష్టంగా ఉందని, వాతావరణం, వర్షపు నీటి తాకిడి, ప్రవాహాల వల్ల రాతి ఉపరితలం అరిగి పోయి గ్రూవ్స్ కనుమరుగయ్యాయని చెప్పారు. కేవలం 10 లోపు గ్రూవ్స్ మాత్రమే కొంత లోతుగా గుర్తించడానికి వీలుగా ఉన్నాయని, ఇలాంటి గ్రూప్స్ అరుదుగా కనిపిస్తాయని పేర్కొన్నారు. కాగా సమీపంలో రామాలయం వెనుక స్థూపాకార మట్టి గడ్డపై బరువైన రాయి ఉంది. ఇది చూడటానికి పుట్టగొడుగులాగా ఉంది. భౌగోళిక మార్పుల వల్ల ఇలాంటి నిర్మాణాలు ఏర్పడతాయని రత్నాకర్ రెడ్డి తెలిపారు.   

Tags:    

Similar News