దేశభక్తి ముసుగులో ప్రజలపై పన్నుల భారం..పీడీఎస్యూ
జార్జిరెడ్డిని భౌతికంగా నిర్మూలించిన శక్తులే వ్యతిరేకంగా కేంద్రంలో రాజ్యమేలుతున్నాయి.
దిశ, కొత్తగూడ : జార్జిరెడ్డిని భౌతికంగా నిర్మూలించిన శక్తులే వ్యతిరేకంగా కేంద్రంలో రాజ్యమేలుతున్నాయి. వారికి వ్యతిరేకంగా మాట్లాడిన ప్రగతిశీల శక్తుల పై నల్లచట్టాలను మోపి ఏళ్ల తరబడి నిర్బంధిస్తున్నారని పీడీఎస్యూ రాష్ట్ర సహాయ కార్యదర్శి శ్రీశైలం అన్నారు. శుక్రవారం కొత్తగూడ మండల కేంద్రంలో పీడీఎస్యూ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 132వ జయంతి, ఉస్మానియా పీడీఎస్‌యూ దివంగత కామ్రేడ్ జార్జి రెడ్డి 51వ వర్ధంతి సందర్భంగా మండల కేంద్రంలో విద్యార్థులతో భారీ ప్రదర్శన చేపట్టారు.
నినాదాలతో ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి కామ్రేడ్ జార్జిరెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి సభను నిర్వహించారు. ఈ సందర్బంగా శ్రీశైలం మాట్లాడుతూ సామాజిక వివక్షత నిర్మూలనకై, మతోన్మాద శక్తుల నియంత్రణ కై అంబేద్కర్, జార్జిరెడ్డిలు సాగించిన క్రియాశీలక ఉద్యమాలు స్ఫూర్తి దాయకమన్నారు. విద్యారంగంలో కాషాయీకరణ విధానాలు తీసుకొచ్చి ప్రశ్నించే తత్వాన్ని లేకుండా చేయడానికి వన్ నేషన్ - వన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ తీసుకోచ్చి విద్యార్థుల మెదళ్ళ పై దాడులు చేస్తుంది. విశ్వవిద్యాలయాలను మతోన్మాద శక్తులకు నిలయాలుగా మారుస్తున్నారన్నారు.
దేశభక్తి ముసుగులో ప్రజలపై పన్నుల భారం...
కేంద్రంలోని పాలకులు అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగ వ్యవస్థలను నిర్వీర్యం చేస్తూ, దేశభక్తి ముసుగులో ప్రజలపై పన్నుల భారాన్ని మోపి కార్పొరేట్ శక్తులకు, బహుళజాతి సంస్థలకు, అదాని, అంబానీలకు దేశ సంపదను కట్టబెడుతున్నారన్నారు. అడవుల నుండి మైదానం వరకు అన్ని ప్రభుత్వ రంగాలను మూకుమ్మడిగా అమ్మి వేస్తున్నారని, ప్రశ్నించే వ్యక్తులపై, సంస్థలపై తీవ్రంగా నిర్బంధం ప్రయోగించి జైళ్లలో పెడుతున్నారని, భారత రాజ్యాంగాన్ని ఖూనీ చేస్తూ మనుస్మృతిని తీసుకొస్తున్నారని.
దీనికి వ్యతిరేకంగా బలమైన ప్రగతిశీల ఉద్యమాలను నిర్మాణం చేయాలని, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, కామ్రేడ్ జార్జిరెడ్డిలు అందించిన స్ఫూర్తితో ప్రజా ఉద్యమాలకు మొదలు పెట్టాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యూ, ప్రగతిశీల యువజన సంఘం పివైఎల్, ఏఐకేఎంఎస్, ఇఫ్ట్ నాయకులు ప్రమోదు, జీవన్, రవి, నితిన్, వెంకటేష్, సుభాష్, రాకేష్, సురేష్, రాజు, గట్టి సురేందర్, సిద్ధబోయిన జీవన్, యాదగిరి యుగంధర్, పసునూరి రాజమల్లు, ఐలబోయిన నరేష్, పోతుగంటి వెంకన్న, జామ్లా, లచ్చిరాం, తదితరులు పాల్గొన్నారు.