ధైర్యం ఇవ్వని ధరణి.. ఇక ప్రభుత్వ భూమి ప్రైవేట్ వశమేనా..?

Update: 2022-01-21 10:59 GMT

దిశ, నర్సంపేట: వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలో ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం రాజ్యమేలుతోంది. ఫలితంగా కోట్ల విలువైన ప్రభుత్వ భూములు ప్రైవేట్ వ్యక్తుల పరం అవుతున్నాయి. ప్రభుత్వ భూములు ధరణిలో నమోదై ఉన్నప్పటికీ ఆ భూమిని కాపాడుకునే ధైర్యం చేయలేని నిస్సహాయ స్థితిలో నర్సంపేట అధికార యంత్రాంగం ఉండటం పట్టణ వాసుల్ని ఆందోళనకు గురి చేస్తోంది.

అసలేం జరిగిందంటే..?

నర్సంపేట పట్టణం నుండి పాకాల వెళ్లే మార్గంలో నర్సంపేట పట్టణానికి చివర ఉన్న స్మశాన వాటిక పక్కన ప్రహారీ గోడకు ఆనుకొని సర్వే నెంబర్ 56 ఉంది. రెవెన్యూ శాఖ రికార్డ్స్ ప్రకారం ఇక్కడ మొత్తం 2 ఎకరాల 25 గుంటల ప్రభుత్వ భూమి ఉంది. ఇందులో స్మశాన వాటిక కింద 26 గుంటలు పోగా, మిగతా 1.39 గుంటల భూమి ఉండాలి. నర్సంపేట పట్టణం అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో అక్రమార్కుల కన్ను ఈ భూమిపై పడింది. తమ పలుకుబడి ఉపయోగించి సర్వే నెంబర్లు మార్చి ఈ భూమిని రిజిస్ట్రేషన్ చేయించి, ప్లాట్లుగా చేసి ప్రభుత్వ స్థలాన్నే అమ్మినట్లు నర్సంపేటలో తీవ్ర చర్చ జరుగుతోంది. ఇదిలా ఉండగా, సర్వే నెంబర్ 56 ధరణిలో నమోదు చేసినప్పటికీ ప్రభుత్వ భూమిగానే కనపడటం గమనార్హం.

ధరణిలో ఉన్నా ధైర్యం లేదు..?

నర్సంపేట పట్టణంలో ఒకప్పుడు దాదాపుగా 800 ఎకరాల ప్రభుత్వ భూమి ఉండేది. కాలువలు, నాళాలు.. పలు కారణాలతో ఇప్పటికే చాలా వరకు చూస్తుండగానే కనుమరుగయ్యాయి. సర్వే నెంబర్ 56లో ప్రభుత్వ భూమి 2.25 గుంటలు ఉంది. ధరణిలో అది నేటికీ కనపడుతోంది. ప్రభుత్వ భూములకు కంచెలు ఏర్పాట్లు చేయడంలో అధికార యంత్రాంగం పూర్తిగా విఫలం కావడంతో ఎక్కడ ప్రభుత్వ స్థలం కనపడితే చాలు ఎవరో ఒకరు కబ్జా చేస్తున్నారు. ఆధారాలున్నా, ప్రభుత్వ భూమి అని వెబ్ సైట్‌లో దర్శనం ఇస్తున్నా.. కనీసం ఆ భూమిని కాపాడే ధైర్యం ఏ అధికారీ చేయకపోవడం పట్టణ ప్రజల్ని విస్మయానికి గురి చేస్తోంది.

రియల్ మాఫియా పనేనా..!

నర్సంపేట పట్టణంలో గడచిన కొన్నేండ్లుగా రియల్ ఎస్టేట్ వ్యాపారం కొత్త పుంతలు తొక్కుతోంది. అడ్డూ అదుపు లేకుండా ప్రభుత్వ, ప్రైవేట్ భూములు అనే ఆలోచన కూడా లేకుండా కనపడ్డ స్థలాల్ని కబ్జా చేస్తున్నారు. పక్క సర్వే నంబర్లతో రిజిస్ట్రేషన్ చేయించడం, ఏదోలా ఇంటి నెంబర్స్ వచ్చేలా చేస్తామని కల్లబొల్లి మాటలు చెబుతూ జనాల్ని మభ్యపెడుతూ కోట్లు గడిస్తున్నారు. నర్సంపేటలో కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూమి అక్రమార్కుల పాలు అవుతున్నా ఏ ఒక్కరూ పట్టించుకున్న పాపాన పోలేదు. రియల్ మాఫియా అంతలా చక్రం తిప్పుతోందని పట్టణ ప్రజలు చర్చించుకుంటున్నారు.

నోరు మెదపని మున్సిపల్ అధికారులు..?

నర్సంపేట రెవెన్యూ శాఖ సర్వే నెంబర్ 56లో గల ఎకరం భూమిని పశుసంరక్షణ శాల ఏర్పాటు నిమిత్తం స్థానిక మున్సిపల్ కమిషనర్ విద్యాధర్ అభ్యర్ధన మేరకు కేటాయించారు. ఇది గడచి రెండు నెలలు దాటినా ఆ వైపుగా మున్సిపాలిటీ అధికారులు వెళ్లిన దాఖలాలు లేవు. ఎకరం స్థలం కేటాయింపు తర్వాత దాని ఏర్పాటు పనులకు టెండర్లు ఏర్పాటు చేస్తామని ప్రకటించినా నేటికీ టెండర్ జాడ లేదు. ఈలోగా పశు సంరక్షణకు కేటాయించిన భూమిని సైతం కాపాడుకునే ప్రయత్నం చేయలేదు. సర్వే నెంబర్ 56లో కనీసం ఇది ప్రభుత్వ భూమి అని తెలిసేలా ఎటువంటి బోర్డులు సైతం పెట్టకపోవడం మున్సిపాలిటీ అధికారుల పనితనానికి నిదర్శనం.

ఇకనైనా చర్యలు ఉంటాయా..?

పశు సంరక్షణశాలకు రెవెన్యూ అధికారులు కేటాయించి రెండు నెలలు దాటింది. నేటికీ ఈ భూమిలో పశుసంరక్షణశాల ఏర్పాటుకు సంబంధించి ఎలాంటి పనులు మొదలవ్వలేదు. కోట్ల విలువ గల భూమి ఆక్రమణకు గురైంది. ఈ విషయంలో మున్సిపాలిటీ అధికారులు తదుపరి చర్యలు ఎం తీసుకోనున్నారని 'దిశ' రిపోర్టర్ వివరణ కోరగా గత రెండు రోజులుగా మున్సిపల్ కమిషనర్ స్పందించడం లేదు.

Tags:    

Similar News