నష్కల్-హసన్‌పర్తి రైల్వే ట్రాక్ ఏర్పాటులో కీలక ముందడుగు
జనగామ జిల్లా నష్కల్ నుంచి హన్మకొండ జిల్లా హసన్‌పర్తి మండల
దిశ, వరంగల్ బ్యూరో : జనగామ జిల్లా నష్కల్ నుంచి హన్మకొండ జిల్లా హసన్‌పర్తి మండల కేంద్రంలోని రైల్వే స్టేషన్ల మధ్య బైపాస్ రైల్వే ట్రాక్ నిర్మాణం విషయంలో ముందడుగు పడింది. జనగామ జిల్లా చిల్పూర్ మండలం నష్కల్ రైల్వే స్టేషన్ నుంచి కరుణాపురం, పెద్దపెండ్యల, ఎల్కూర్తి, ధర్మసాగర్, ఉనికిచర్ల, దేవన్నపేట, మడిపల్లి, జయగిరి గ్రామాల మీదుగా హసన్ పర్తి రైల్వే స్టేషన్ వరకు బైపాస్ లైన్‌ను నిర్మించేందుకు దక్షిణ మధ్య రైల్వే నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించి గత కొన్నాళ్లుగా ప్రతిపాదనలు జరుపుతూ క్షేత్రస్థాయిలో అధికారులు పరిశీలనలు కూడా జరిపారు.
గూడ్స్ రైళ్లను ఈ ట్రాక్ నుంచి నడిపిస్తూ.. ప్యాసింజర్, ఎక్స్‌ప్రెస్, సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇబ్బంది కలగకుండా చూసే లక్ష్యంతో 24.5.5 కి.మీ. మేర ఈ ట్రాక్ నిర్మాణం చేపట్టేందుకు యత్నాలు చేస్తోంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో దక్షిణ మధ్య రైల్వే వేగంగా చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగానే ఈనెల 16న ఈ ట్రాక్ నిర్మాణానికి క్షేత్రస్థాయిలో పరిశీలనలు, భూ సేకరణకు సంబంధించి అంచనాలు రూపొందించేందుకు వీలుగా రెవెన్యూ అధికారులకు బాధ్యతలు అప్పగిస్తూ నోటిఫికేషన్ జారీ చేయడం గమనార్హం. హన్మకొండ ఆర్డీవో, స్టేషన్‌ఘన్‌పూర్ ఆర్డీవోలకు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.