Model vegetable market : మార్కెట్​లో బినామీలకు చెక్​..

వరంగల్‌ లక్ష్మీపురంలోని మోడల్‌ కూరగాయల మార్కెట్‌ అసలు లక్ష్యం నెరవేరే దిశగా అడుగులు పడుతున్నాయి.

Update: 2024-11-14 02:43 GMT

దిశ, వరంగల్‌ టౌన్ : వరంగల్‌ లక్ష్మీపురంలోని మోడల్‌ కూరగాయల మార్కెట్‌ అసలు లక్ష్యం నెరవేరే దిశగా అడుగులు పడుతున్నాయి. మంగళవారం మంత్రి కొండా సురేఖ మార్కెట్‌ను సందర్శించి, పలు ఆదేశాలివ్వడం మార్కెట్‌కు మంచిరోజులు రానున్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి. మార్కెట్‌లో పర్యటించిన మంత్రి వ్యాపారులతో మాట్లాడారు. ప్లాట్లలో విక్రయిస్తున్న వారి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలో ఓ వ్యాపారి తాను కూలీనంటూ చెప్పడంతో మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. కమీషన్‌ షాపుల తరపున కూరగాయలు అమ్ముతున్నట్లు పేర్కొనడంతో మంత్రి అసహనం వ్యక్తం చేశారు. ప్లాట్లు ఎవరికి కేటాయించారో వారే వ్యాపారం చేయాలి కదా అంటూ మార్కెట్‌ అధికారులను ప్రశ్నించారు. ఇకమీదట ఎవరి ప్లాట్లలో వారే అమ్మకాలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. లైసెన్సుల ఆధారంగానే వ్యాపారులు నడుచుకోవాలని సూచించారు. కమిషన్‌ ఏజెంట్లు రిటేల్‌ అమ్మకాలు చేయడం సరికాదని తెలిపారు.

మంత్రి దృష్టికి పలు సమస్యలు !

కాగా, కొందరు వ్యాపారులు మంత్రి దృష్టికి పలు సమస్యలు తీసుకెళ్లారు. కమీషన్ వ్యాపారులకు ఓపెన్‌ ప్లాట్లు ఐదారుకు మించి ఉన్నాయని మంత్రికి తెలిపారు. ఈ విషయంలో కూడా మంత్రి సీరియస్‌ అయ్యారు. అలాంటి వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

ప్రత్యేక కమిటీతో...

గతంలో తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మోడల్‌ మార్కెట్‌కు శంకుస్థాపన చేసినట్లు మంత్రి సురేఖ గుర్తు చేశారు. అయితే, అప్పటి రాజకీయ నాయకుల ప్రాబల్యంతో అనర్హులు బినామీ పేర్ల మీద దుకాణాలు కేటాయించుకొని విక్రయదారుల నుంచి డబ్బులు వసూలు చేసుకుంటూ దందా నిర్వహిస్తున్నారని మండిపడ్డారు. దుకాణాల కేటాయింపులో అవకతవకలు జరిగాయని, అర్హులకు అన్యాయం జరిగిందని పేర్కొన్నారు. అలాంటి వారిని ఏరివేసేందుకు ప్రత్యేకంగా ఒక కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. పారదర్శకంగా దుకాణాలు కేటాయించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను ఆదేశించారు. మార్కెట్‌ను మోడల్‌గా తీర్చిదిద్దుటకు గాను ప్రత్యేక కన్సల్టెన్సీ ద్వారా డీటెయిల్‌ ప్రాజెక్ట్‌ రిపోర్ట్‌ రూపొందించాలని, అందులో పార్కింగ్‌, వర్మీ కంపోస్ట్‌, సోలార్‌ ఎనర్జీ, అంతర్గత రహదారులు, డ్రైనేజ్‌ వ్యవస్థ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. వర్షాకాలంలో కొనుగోలుదారులు, విక్రేతలు తడవకుండా షెడ్డు ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. దుకాణాల అద్దెల తగ్గించాలనే వ్యాపారుల డిమాండ్‌ను పరిశీలిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.

పండ్లు, పూల కోసమే..

పక్కనే నిర్మాణంలో ఉన్న పండ్ల మార్కెట్‌ స్థలాన్ని కూడా మంత్రి పరిశీలించారు. వెజ్‌, నాన్‌వెజ్‌ విక్రయాలు లక్ష్యం నిర్మిస్తున్న ఈ మార్కెట్‌ను కేవలం పండ్లు, పూల విక్రయాలకే కేటాయించాలని అధికారులకు సూచించారు. నాన్‌వెజ్‌ విక్రయాలకు సమీపంలోని మరో స్థలంలో నిర్మాణాలకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. పురాతన కట్టడాలను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరి పై ఉందని, మార్కెట్లో ఉన్న క్లాక్‌ టవర్‌, కార్యాలయ భవనాన్ని తొలగించడం జరగదని అన్నారు. మార్కెట్లో నిర్మిస్తున్న కొత్త భవనాన్ని ఫంక్షన్‌ హాల్‌ గా వినియోగించు కోవాలన్నారు. మర్రిచెట్టు వద్ద ఉన్న స్థలంలో కమ్యూనిటీ హాల్‌ ఏర్పాటు చేస్తామని, విఘ్నేశ్వరుడి, మైసమ్మ తల్లి దేవాలయాలు ఏర్పాటుకు స్థలాన్ని గుర్తించి ప్రతిపాదనలు సమర్పించాలని అధికారులను ఆదేశించారు.

మార్కెట్లో ప్లాస్టిక్‌ వినియోగాన్ని తగ్గించాలని, ప్లాస్టిక్‌ వెండింగ్‌ మిషన్‌ ని ఏర్పాటు చేయాలని మంత్రి సూచించారు. జీడబ్ల్యూఎంసీ ద్వారా రూ.30 లక్షల వ్యయంతో ప్లాట్ల ఏరియాలో షెడ్డు నిర్మాణం చేపడతామని మేయర్‌ గుండు సుధారాణి ప్రకటించారు. మార్కెట్‌ పర్యటనలో మంత్రి వెంట మేయర్‌ గుండు సుధారాణి, కలెక్టర్‌ డాక్టర్‌ సత్యశారద దేవి, జీడబ్ల్యూఎంసీ కమిషనర్‌ అశ్విని తానాజీ వాకడే, ఏనుమాముల మార్కెట్‌ ఉన్నతశ్రేణి కార్యదర్శి పోలెపాక నిర్మల, ఇన్​చార్జ్‌ అదనపు కలెక్టర్‌ విజయలక్ష్మి, బల్దియా ఎస్‌ఈ ప్రవీణ్‌ చంద్ర, సీఎంహెచ్‌ఓ డాక్టర్‌ రాజిరెడ్డి, ఛాంబర్‌ ఆర్‌ కామర్స్‌ అధ్యక్షులు రవీందర్‌ రెడ్డి, స్థానిక కార్పొరేటర్‌ ఉన్నారు.

బినామీల పై ‘దిశ’ పోరాటం..

లక్ష్మీపురం మార్కెట్‌లో బినామీలు ఉన్నారంటూ దిశ దినపత్రిక అక్షర పోరాటం చేసింది. ఆధారాలతో సహా కథనాలను వెలుగులోకి తీసుకొచ్చింది. గత ప్రభుత్వ హయాంలో అప్పటి మార్కెట్‌ కార్యదర్శి రాహుల్‌, నియోజకవర్గ ప్రజాప్రతినిధి అండదండలతో బినామీలకు వంతపాడుతున్నారని తేల్చిచెప్పింది. మోడల్‌ మార్కెట్‌ అసలు లక్ష్యం నీరుగారిపోతోందని కథనాలు ప్రచురించింది. డ్రైనేజీ వ్యవస్థ లేకుండానే మార్కెట్‌ను నిర్మించారని కళ్లకు గట్టింది. మహిళ వినియోగదారులకు సౌలభ్యం కోసం నిర్మించిన గద్దెల ప్రాంగణం నిర్వీర్యంగా మారిందని ఎలుగెత్తి చాటింది. పార్కింగ్‌ వ్యవస్థ లేదని చెప్పింది. సరైన రహదారులు లేవని చాటింది. కోట్లాది రూపాయల ప్రజాధనం లూటీ అయిందని కథనాలు వెలుగులోకి తెచ్చింది. దిశ దినపత్రిక అక్షర పోరాటం ఇంతకాలానికి నెరవేరబోతోంది. బినామీల గుట్టురట్టు కాబోతోంది.

Tags:    

Similar News