ఆడబిడ్డల ఆరోగ్య సంరక్షణే…ప్రభుత్వ ప్రథమ లక్ష్యం : మంత్రి సీత‌క్క‌

డబిడ్డల ఆరోగ్య సంరక్షణే ప్రభుత్వ ప్రథమ లక్ష్యం మని, దేశ భవిష్యత్తు అంగన్వాడీ టీచర్లపైనే ఉందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క అన్నారు.

Update: 2024-11-24 13:52 GMT

దిశ‌,ఏటూరునాగారంః- ఆడబిడ్డల ఆరోగ్య సంరక్షణే ప్రభుత్వ ప్రథమ లక్ష్యం మని, దేశ భవిష్యత్తు అంగన్వాడీ టీచర్లపైనే ఉందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క అన్నారు. ఆదివారం రోజున‌ ఏటూరునాగారం లోని గిరిజన భవనంలో మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ, గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో అంగన్వాడీ టీచర్లు, ఆయాలకు ఉచిత క్యాన్సర్ నిర్ధారణ పరీక్ష శిబిరంను మంత్రి దనసరి అనసూయ సీతక్క, జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్., భద్రాచలం శాసన సభ్యులు తెల్లం వెంకట్రావు, గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ ప్రతినిధులతో కలిసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి సీత‌క్క మాట్లాడుతూ… క్షేత్రస్థాయిలో ఎన్నో కష్టనష్టాల కోర్చి గర్భిణీ స్త్రీలు, బాలింతలు, శిశువులకు నాణ్యమైన పౌష్టికాహారం అందిస్తూ వారి మెరుగైన జీవనానికి పాటుపడుతున్న అంగన్వాడీ టీచర్లు, ఆయాలకు సరైన గుర్తింపు ఇవ్వాలని, ఎన్నో ఏండ్ల నాటి నుండి పనిచేస్తున్న వారికి ప్రభుత్వం తరపున సరైన గౌరవం ఇవ్వాలనే ఉద్దేశంతో వారికి రిటైర్మెంట్, ఇతర ప్రయోజనాలు అందించే ఉద్దేశ్యంతో కొన్ని ముఖ్యమైన నిర్ణయాలను తీసుకోవడం జరిగిందని, మీ సమస్యలను కూడా మా మేనిఫెస్టో లో పెట్టడం జరిగిందని, ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చి తీరుతుందని అన్నారు.

నిరంతరం ఏదో ఒక పనిలో తలమునకలవుతూ క్షేత్రస్థాయిలో ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా పనిచేస్తున్న అంగన్వాడీ టీచర్లు, ఆయాల ఆరోగ్య సంరక్షణే ముఖ్య ఉద్దేశం తో మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ, గ్రేస్‌ క్యాన్సర్ ఫౌండేషన్ ద్వారా ఈ ముందస్తు క్యాన్సర్ నిర్ధారణ పరీక్షల శిబిరాన్ని రాష్ట్రంలో ముందుగా మన జిల్లాలోనే ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. క్యాన్సర్ ఏ రూపంలో వస్తుందో మనకు తెలియదని, దాన్ని ముందస్తు పరీక్షలు చేసుకొని ప్రాథమిక దశలోనే గుర్తించడం ద్వారా ప్రాణాపాయ పరిస్థితుల నుండి బయటపడవచ్చని అన్నారు.

అనంతరం భద్రాచలం శాసన సభ్యులు తెల్లం వెంకట్రావు మాట్లాడుతూ... మంత్రి సీతక్క రాష్ట్రంలోనే మొదటిసారిగా ములుగు జిల్లాలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా సంతోషకరం అని అన్నారు. ఒక డాక్టర్ గా ఈ సమస్యలపై సంపూర్ణ అవగాహన ఉందని, మహిళలు కుటుంబ బాధ్యతలు, ఇతర పనుల్లో హడావిడిగా ఉంటూ ఆరోగ్యాన్ని పట్టించుకోకుండా ఉండటం వల్ల సాధారణ ఇన్ఫెక్షన్లు కాస్త నిర్లక్ష్యం చేయడం వల్ల ప్రమాదకరమైన క్యాన్సర్లుగా మారే ప్రమాదం ఉందని అన్నారు. అలాంటి సందర్భంలో గర్భసంచి తొలగించాల్సి వస్తుందని, రొమ్ములో కణుతులు, ఇతర ఏమైనా ఇబ్బందులుంటే వాటిని కూడా నిర్లక్ష్యం చేస్తే అవి రొమ్ము క్యాన్సర్ గా మారే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ప్రతీ మహిళ తప్పకుండా ఇలాంటి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ప్రభుత్వానికి క్షేత్రస్థాయిలో ఎన్నో రకాలుగా చేదోడు వాదోడుగా ఉంటున్న అంగన్వాడీ టీచర్లు, ఆయాలను ప్రత్యేకంగా గుర్తించి వారి ఆరోగ్యం పైన ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్న మంత్రి సీత‌క్క కు ధన్యవాదాలు తెలిపారు.

అనంత‌రం జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. మాట్లాడుతూ జిల్లాలోని ప్రతీ అంగన్వాడీ టీచర్, ఆయాలకు ఈ పరీక్షలు ఉచితంగా అందించాలని ఇంత గొప్ప కార్యక్రమానికి మంత్రి సీత‌క్క శ్రీ‌కారం చుట్టార‌న్నారు. వాస్తవానికి జిల్లా కేంద్రం లో నిర్వహించాల్సిన ఈ కార్యక్రమాన్ని రెండు రోజుల కార్యక్రమం గా పొడిగిస్తూ 2వ రోజు ఏటూరునాగారం, మంగపేట, కన్నాయిగూడెం, వెంకటాపురం, వాజేడు మండలాలకు చెందిన అంగన్వాడీ టీచర్లు, ఆయాలు దూర భారంగా భావించి ఇబ్బంది పడవద్దనే సదుద్దేశంతో మంత్రి సూచన మేరకు 2వరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏటూరునాగారం లో ఐటీడీఏ గిరిజన భవన్ లో ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. పరీక్షలు చేయించుకోవడానికి ఎలాంటి సందేహాలు వద్దని, సమస్యను ముందుగానే గుర్తిస్తే మంచి చికిత్సలు తీసుకొని ప్రాణాపాయ స్థితి నుండి బయటపడవచ్చని సూచించారు.

అనంత‌రం గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ సభ్యులు మాట్లాడుతూ… సమాజంలో నేడు క్యాన్సర్ మహమ్మారి చాపకింద నీరులా ప్రాకుతున్న ఈ రోజుల్లో పేదరికంలో ఉన్న చాలామంది మహిళలు సరైన ముందస్తు పరీక్షలు లేని కారణంగా మృత్యువాత పడే ప్రమాదం ఉన్నదని గమనించడం జరిగింది. ఈ సందర్భంగా ఈ సమాజంలో మా వంతు బాధ్యతగా ఈ ప్రమాదం నుంచి మహిళలను కాపాడాలనే దృఢ సంకల్పంతో ఈ ఫౌండేషన్ కార్యకలాపాలను నిర్వహిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమం లో జ‌డ్పీ కోఆప్షన్ మెంబర్ వలియా భీ, వెంకటాపురం మార్కెట్ కమిటీ చైర్మన్, ఏటూరునాగారం సీడీపీవో, ఈపీ. ప్రేమలత, తాడ్వాయి సీడీపీఓ జి. మల్లీశ్వరి, గ్రేస్‌ సంస్థ ప్రతినిధులు, డాక్టర్లు, మెడికల్ టెక్నీషియన్లు, అన్ని సెక్టార్ల సూపర్వైజర్లు, డీసీపీయూ, సీహేచ్ఎల్,సఖి, డీహెచ్‌డ‌బ్ల్యూ సిబ్బంది, అంగన్వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు.


Similar News