Mohan Bhagwat : ఇది సనాతన దేశం.. దేశంలో స్వార్థం ఎక్కువైపోయింది : ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్
ఋషుల ఆలోచనలో ఇది సనాతన దేశమని ఆర్ఎస్ఎస్ మోహన్ భగవత్ (RSS Chief Mohan Bhagwat) అన్నారు
దిశ, డైనమిక్ బ్యూరో: ఋషుల ఆలోచనలో ఇది సనాతన దేశమని ఆర్ఎస్ఎస్ మోహన్ భగవత్ (RSS Chief Mohan Bhagwat) అన్నారు. మన పూర్వీకుల దగ్గర సంస్కారం ఉండేదని, కాబట్టి వ్యవహారం ఉండేదన్నారు. హైదరాబాద్‌లోని హైటెక్ సిటి శిల్పకళా వేదికలో ఆదివారం (Lok Manthan 2024) లోక్‌మంథన్-2024 కార్యక్రమం ముగింపు వేడుకలు నిర్వహించారు. నాలుగు రోజుల పాటు జరిగిన లోక్ మంథన్‌లో వివిధ దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోహన్ భగవత్ మాట్లాడుతూ.. నేడు సంతోషం బయట వెతుక్కుంటూ ఉన్నారని, కానీ మన పూర్వీకులు సంతోషం మనలో ఉందని వందల ఏళ్ల క్రితం చెప్పారని వెల్లడించారు. మన దేశంలో విదేశీయులు ఆక్రమణకి వచ్చి.. మన సంస్కృతిని చిన్నాభిన్నం చేశారని, అయిన కూడా దేశం నిలబడిందన్నారు.
భౌతిక జీవనం ఎలా సాగించాలో, మన పూర్వీకులు ఎప్పుడో చెప్పారని అన్నారు. సృష్టి నియమానుసారంగా మన పూర్వీకులు నడిచేవారని చెప్పారు. ఆధ్యాత్మిక బాటలో ఉంటే ధర్మం నిలబడుతుందని అన్నారు. ఇప్పుడు అది లేదని, ధర్మం కంటే అధర్మం ఎక్కువ చేస్తున్నామని అన్నారు. దేశంలో స్వార్థం ఎక్కువపోయిందని, ఇక ధర్మం ఎక్కడ ఉంటుంది ఆయన ప్రశ్నించారు. విజ్ఞానం ముందు ధర్మం ఉండదా? విజ్ఞానం ఉపయోగించేవాడి తీరు బట్టి ధర్మం నిలుస్తుందని అభిప్రాయపడ్డారు. ధర్మం గురించి మనం అందరం ఆలోచించాలని, దాని కోసం మన విజ్ఞాన గ్రంథాలను అధ్యయనం చేయాలని పిలుపునిచ్చారు.
అభివృద్ధిని చూసి కొన్ని శక్తులు సహించడం లేవు: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
కేంద్రమంత్రి, బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్‌రెడ్డి (Kishan Reddy) మాట్లాడుతూ.. దేశంలో ఆధ్యాత్మికత పెరుగుతుండడం, అభివృద్ధి జరుగుతుండడంతో కొన్ని శక్తులు సహించలేక పోతున్నాయని అన్నారు. అరాచకాన్ని సృష్టించే ప్రయత్నం చేస్తున్నాయని వెల్లడించారు. దేశాల మధ్య యుద్ధాలు జరుగుతున్న సమయంలో అంతర్జాతీయ వేదికలపై విశ్వశాంతి కోసం మోడీ ప్రయత్నిస్తున్నారని తెలిపారు. దేశాన్ని విశ్వగురువుగా చేయడం కోసం అందరం కలిసి ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman), గజేంద్ర సింగ్ షేకావత్ (Gajendra Singh Shekhawat) తదితరులు హాజరయ్యారు.