GI Tag: తెలంగాణకు కొత్తగా 6 జీఐ ఉత్పత్తులు.. ఉత్పత్తిదారులకు దక్కనున్న గౌరవం
తెలంగాణ నుంచి మరో 6 ఉత్పత్తులకు జీఐ ట్యాగ్ కోసం దరఖాస్తు చేశామని, గతంలో 17 ఉత్పత్తులకు జియో ట్యాగింగ్ ఇదివరకే ఉందని పరిశ్రమలు, వాణిజ్య శాఖ, జీఐ డైరెక్టర్, మందాడి శ్రీహరెడ్డి తెలిపారు.
దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ నుంచి మరో 6 ఉత్పత్తులకు జీఐ ట్యాగ్ కోసం దరఖాస్తు చేశామని, గతంలో 17 ఉత్పత్తులకు జియో ట్యాగింగ్ ఇదివరకే ఉందని పరిశ్రమలు, వాణిజ్య శాఖ, జీఐ డైరెక్టర్, మందాడి శ్రీహరెడ్డి తెలిపారు. జియో ట్యాగింగ్ తో ఉత్పత్తి దారుల రూపు రేఖలు మారనున్నాయి. జియో ట్యాంగింగ్ తో తెలంగాణ సాంస్కృతిక, వారసత్వ చరిత్రకు మరోసారి ప్రపంచ వ్యాప్తంగా గుర్తిపు లభించనున్నట్టు వెల్లడించారు. అసలు జియో ట్యాగింగ్ అంటే ఏంటో ఒక్కసారి చూద్దాం. (జీఐ) భౌగోళిక సూచిక (జీఐ) ట్యాగ్ అనేది ప్రత్యేకంగా ఒక నిర్దిష్ట ప్రాంతానికి చెందిన ఉత్పత్తికి ఇవ్వబడిన సూచిక. నిర్దిష్ట ఉత్పత్తి, నాణ్యత, కీర్తి, ఏదైనా ఇతర లక్షణాలతో కూడాన ఉత్పత్తులు సాధారణంగా ఆ ఉత్పత్తి భౌగోళిక మూలాలకు మాత్రమే స్వంతం అవుతాయి.
ఇప్పటికే ఉన్న 17 జీఐ ఉత్పత్తులు
1) పోచంపల్లి - ఇకత్
2) కరీంనగర్ - సిల్వర్ ఫిలిగ్రీ
3) నిర్మల్ – టాయ్స్ అండ్ క్రాఫ్ట్
4) నిర్మల్ - ఫర్నిచర్
5) నిర్మల్ - పెయింటింగ్స్
6) గద్వాల్ - చీరలు
7) హైదరాబాద్ - హలీమ్
8) చెరియాల్ - పెయింటింగ్స్
9) సిద్దిపేట - గొల్లభామ
10) నారాయణ పేట చేనేత చీరలు
11) పోచంపల్లి - ఇకత్ (లోగో)
12) ఆదిలాబాద్ - డోక్రా
13) వరంగల్ - దుర్రీస్
14) తెలియా - రుమల్
15) బంగినపల్లి మామిడి
16) తాండూరు కందులు
17) లక్క గాజులు - హైదరాబాద్
జీఐ గుర్తింపు కోసం దరఖాస్తు చేసిన ఉత్పత్తులు
1. హైదరాబాద్ - ముత్యాలు
2. మెదక్ - బాటిక్ పెయింటింగ్
3. నారాయణపేట - ఆభరణాల తయారీ
4. నల్గొండ- బంజారా నీడిల్ క్రాఫ్ట్
5. ఆర్మూర్ - పసుపు
6. నల్గొండ - బంజారా గిరిజన ఆభరణాలు
తెలంగాణ వ్యాప్తంగా ఎన్నో ఉత్పత్తులు ఉన్నప్పటికి ఈ ఆరు ఉత్పత్తులకే జీఐ ట్యాగ్ కోసం దరఖాస్తు చేయడానికి గల కారణాలను జీఐ డైరెక్టర్ మందాడి శ్రీహరెడ్డి వివరించారు.
హైదరాబాద్.. ముత్యాలు
హైదరాబాద్ సున్నితమైన ముత్యాలకు ప్రసిద్ధి చెందిందని మాములుగానే మన హైదరాబాద్ ను పెరల్ సీటీగా ఎప్పటి నుంచో పిలుస్తారన్నారు. ఎన్నో ఏళ్లుగా ముత్యాల వ్యాపారం చేసే సాంప్రదాయాన్ని హైదరాబాద్ కలిగి ఉందని తెలిపారు. మెరుపు, స్వచ్ఛత, అధిక నాణ్యత కలిగిన ముత్యాలను హైదరాబాద్ ఎప్పటి నుంచో ఉత్పత్తి చేస్తుందన్నారు. అంతే కాకుండా ముత్యాల పరిశ్రమ స్థానికంగా, అంతర్జాతీయంగా విలువైన ఆభరణాలు రూపొందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ సరైన గుర్తింపు దక్కలేదన్నారు.
మెదక్ .. బాటిక్ పెయింటింగ్
బాటిక్ పెయింటింగ్ అనేది మెదక్ నుండి వచ్చిన ఒక సాంప్రదాయక కళారూపమని, ఇది క్లిష్టమైన మైనపు నిరోధక అద్దకానికి, సాంకేతికతకు ఎంతో ప్రసిద్ధి చెందిందన్నారు. హస్తకళాకారులు ఫ్యాబ్రిక్, నమునాలు, డిజైన్లపై మైనపు పూత ద్వారా వస్త్రాలకు రంగుల ద్వారా దీనిని సృష్టించారు. ఇది ప్రత్యేకమైన, శక్తివంతమైన కళాఖండాల రూప కల్పనకు దోహదపడుతుందన్నారు. మెదక్ బాటిక్ పెయింటింగ్ లు సాంస్కృతిక ప్రాముఖ్యతకు నిదర్శనంగా నిలిచాయన్నారు.
నారాయణపేట.. ఆభరణాల తయారీ
సుసంపన్నమైన వారసత్వం కలిగిన నారాయణపేట పట్టణం, సాంప్రదాయ ఆభరణాల తయారీకి ఎంతో ప్రసిద్ధి చెందింది. ఈ ప్రాంతంలో కళాకారులు తరతరాలుగా వస్తున్న సాంప్రదాయ పద్ధతులను ఉపయోగించి క్లిష్టమైన ఆభరణాలను సులభంగా రూపొందిచడంలోఇక్కడి కళాకారులు సిద్దహస్తులు. నారాయణపేట నగలు, అందమైన డిజైన్లు, సాంస్కృతిక వారసత్వానికి ప్రసిద్ధి గాంచాయి.
నల్గొండ.. బంజారా నీడిల్ క్రాఫ్ట్
నల్గొండలోని బంజారా నీడిల్ క్రాఫ్ట్ అనేది బంజారా గిరిజన సంఘం ఆచరించే సాంప్రదాయ ఎంబ్రాయిడరీ కళ. ఈ క్రాఫ్ట్ వస్త్రాలపై క్లిష్టమైన రంగురంగుల ఎంబ్రాయిడరీ పనిని కలిగి ఉండటంతో పాటు వారి సంస్కృతిని ప్రతిబింబిస్తుంది. ఈ సూదిని తరచుగా దుస్తులు, ఉపకరణాలు, గృహోపకరణాలను అలంకరించడానికి ఎక్కువగా ఉపయోగిస్తారు. ఎలాంటి వస్తువునైనా దీంతో కళాత్మకంగా తీర్చిదిద్దే అవకాశం ఉంటుంది.
ఆర్మూర్.. పసుపు
ఆర్మూర్ అధిక-నాణ్యత పసుపును ఉత్పత్తి చేయడంలో ప్రసిద్ధి చెందింది. ఇక్కడ పండించే పసుపురంగు, వాసన, ఔషధ గుణాలకు పెట్టింది పేరు. దేశంలో నే అత్యుత్తమ నాణ్యత కలిగిన పసుపు గా ఇది నిలిచింది. సాంప్రదాయక వ్యవసాయ ఉత్పత్తుల్లో ఇక్కడి పసుపు పంటను ఎంతో విలువైనదిగా భావిస్తారు. ఆర్మూర్ పసుపును ముఖ్యంగా సౌందర్య, ఔషధ రంగాల్లో ఎక్కువగా వాడుతారు.
నల్గొండ.. బంజారా గిరిజన ఆభరణాలు
నల్గొండలోని బంజారా ఆభరణాలకు ఎంతో ప్రసిద్ది చెందింది. బోల్డ్ డిజైన్ లు, ప్రకాశవంతమైన రంగులతో చూపరులను ఎంతగానో ఆకర్షిస్తాయి. బంజారాల గొప్పసాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబించే క్లిష్టమైన పూసలు, లోహ ఆభరణాలు, సాంప్రదాయ మాలలతో భిన్నంగా ఉంటాయి. ఇది వారి హస్తకళా, బంజారా శైలిని ప్రతిబించడం చేత ఎంతో విలువైనవిగా భావిస్తారు.
జియోగ్రాఫికల్ ఇండికేషన్ (జీఐ) ట్యాగ్ తో ఉపయోగాలు
ఒక్కసారి ఒక్క ఉత్పత్తి పై జియోగ్రాఫికల్ ఇండికేషన్ (జీఐ) ట్యాగ్ వస్తే ఎన్నో ఉపయోగాలుంటాయి. వస్తువులు, పదార్థాలు, పంటలు, ఇతర ఉత్పత్తులు ఏవైనా వాటికి ఒక ప్రత్యేకమైన విలువ ఉంటుంది. ముఖ్యంగా కళాకారులకు, ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు లభిస్తుంది. జీఐ ట్యాగ్ పొందడం అనేది రైతులు, చేతివృత్తి కళాకారులు, ఇతర ఉత్పత్తి దారుల ఆర్థిక అవకాశాలను మెరుగుపరిచేందుకు, వారి సంప్రదాయ పరిజ్ఞానాన్ని రక్షించడానికి, సాంస్కృతిక వారసత్వాన్ని ప్రోత్సహించేందుకు విశేషంగా కృషి చేస్తుంది.
ఆర్థిక ప్రయోజనాలు: జీఐ ట్యాగ్ ఉన్న ఉత్పత్తులు వాటి గుర్తించబడిన నాణ్యత, ప్రామాణికత ఆధారంగా ఎప్పటికప్పుడు అధిక ధరలను పొందుతాయి. అంతే కాకుండా ఉత్పత్తి కీర్తిని పెంచడంతో పాటు కొత్త మార్కెట్ లకు యాక్సెస్ లభిస్తుంది. ఉత్పత్తులను ప్రీమియం మార్కెట్ ఎగుమతి అవకాశాల దృష్టిని ఆకర్షిస్తాయి. దీని ద్వారా తయారీ దారులు, ప్రభుత్వాలు లాభాన్ని పొందే అవకాశం ఉంటుంది.
మేధో సంపత్తి రక్షణ: జీఐ ట్యాగ్ లు కలిగిన ఉత్పత్తులకు చట్టపరమైన రక్షణ లభించడంతో పాటు ఉత్పత్తి పేరు, అనుకరణ, నకీలీ వి తయారు చేయకుండా, రక్షణ పొందుతాయి. కేవలం ఆ జియో ట్యాగింగ్ పొందిన ప్రాంతం నుంచి మాత్రమే నిజమైన ఉత్పత్తులను విక్రయించుకోవడానికి అనుమతి ఉంటుంది. సాంప్రదాయ విజ్ఞాన పరిరక్షణలో భాగంగా ఉత్పత్తులను తయారు చేసే సాంప్రదాయ పద్ధతులు, సాంకేతికత, వాటి వారసత్వం, హస్తకళను పరిరక్షించేందుకు దోహదం చేస్తుంది.
స్థిరత్వం, సాధికారత: రైతులు, చేతి వృత్తుల వారి జీవనోపాధికి మద్దతును అందించడం, స్థానిక కమ్యూనిటీలకు మద్దతు ద్వారా ఆర్థిక వ్యవస్థలను నిలబెట్టేందుకు జీఐ ట్యాగ్ సహాయపడుతుంది. ఒక ప్రాంతం ప్రత్యేక నైపుణ్యాలు, ఉత్పత్తులను గుర్తించడం ద్వారా జీఐ ట్యాగ్ ఉత్పత్తిదారుల సాంస్కృతిక వారసత్వం, యాజమాన్య హక్కులపై వారికి హక్కులుంటాయి.
నాణ్యత హామీ: జీఐ ట్యాగ్ కలిగిన ఉత్పత్తులు వినియోగదారుడికి నాణ్యత, ప్రామాణికత విషయాల్లో ప్రత్యేక హామీని ఇస్తుంది. కొనుగోలు దారుల్లో విశ్వాసాన్ని పెంచుతుంది.మిగిలిన ఉత్పత్తులతో పోలిస్తే నిర్ధిష్ట ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా చేస్తూ ఈ ఉత్పత్తులు స్థిరత్వంతో కూడి ఉంటాయి.
సాంస్కృతిక గుర్తింపు: జీఐ గుర్తింపు కలిగిన ఉత్పత్తులు ప్రత్యేక సాంస్కృతిక, చారిత్రక ప్రాముఖ్యతను ప్రోత్సహిస్తూ పర్యాటక రంగాన్ని విశేషంగా ఆకర్షిస్తుంది. అంతేకాకుండా, అంతర్జాతీయ స్థాయి గుర్తింపుతో ఈ ప్రాంతాన్ని గ్లోబల్ మ్యాప్ లో ఉంచుతారు.
ఉత్పత్తులకు మార్కెటింగ్ అవకాశాలు పెరుగుతాయి.. శ్రీహ రెడ్డి, జీఐ డైరెక్టర్, పరిశ్రమల శాఖ, తెలంగాణ ప్రభుత్వం
జీఐ గుర్తింపు వచ్చిన ఉత్పత్తులను సమాజంలో, ప్రభుత్వ పరంగా మంచి గుర్తింపు ఉంటుంది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 17 రకాల ఉత్పత్తులకు జీఐ ట్యాగ్ లభించింది. తాజాగా మరో ఆరింటికి దరకాస్తు చేస్తున్నాం. గుర్తింపు వచ్చిన వాటిని తయారు చేసిన వారికి, ఆ ఉత్పత్తులను విక్రయించే వారికి ప్రభుత్వ ప్రోత్సహకం అందిస్తాం. రాష్ట్ర, జాతీయ స్థాయిలో జరిగే ఎగ్జిబిషన్లలో ప్రదర్శనలకు ఎలాంటి డబ్బులు లేకుండా వారికి స్టాల్స్‌ను కల్పిస్తాం. రవాణా ఖర్చులను భర్తిస్తుంది ప్రభుత్వం. హైదరాబాద్ లాడ్ బజార్ బ్యాంగిల్స్‌కు జీఐ గుర్తింపు లభించింది. వీటి ద్వారా నాలుగు వేల మంది ఉపాధి అవకాశాలు లభించాయి. జీఐ ఉన్న వాటిని కొనుగోలు చేయడానికి ఎక్కువ మంది ప్రాధాన్యత ఇస్తారు. వాటికి ప్రపంచ వ్యాప్తంగా అంతటి గుర్తింపు ఉంటుంది. తెలంగాణ నుంచి ఎక్కువ ఉత్పత్తులకు జీఐ రావాలని ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది.