ఏఎమ్మార్ మైనింగ్ ప్రాజెక్టు పై గ్రామస్తుల ఆగ్రహం..
బీటీ రోడ్ ధ్వంసం చేసి మట్టిరోడ్డు వేశారు. ప్రజల ప్రయాణం ప్రాణ సంకటంగా మారింది.
దిశ, మల్హర్ : బీటీ రోడ్ ధ్వంసం చేసి మట్టిరోడ్డు వేశారు. ప్రజల ప్రయాణం ప్రాణ సంకటంగా మారింది. భూపాలపల్లి జయశంకర్ జిల్లా మల్హర్ మండల కేంద్రంలోని తాడిచెర్ల ఓసీపీ బ్లాక్-1 కోల్ మైనింగ్ ప్రాజెక్ట్ ఏఎమ్మార్ ప్రైవేట్ సంస్థ ప్రతినిధులపై గ్రామస్తులు ఒక్కసారిగా ఆగ్రహానికి గురయ్యారు. స్థానిక ఎంపీటీసీ రావుల కల్పనా మొగిలి, సింగిల్ విండో చైర్మన్ మల్క సూర్య ప్రకాష్ రావు, మంథని మార్కెట్ కమిటీ డైరెక్టర్ దేవర్నేని నాగేశ్వరరావు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కోటి రవి గౌడ్, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు బూడిద సదానందం ఆధ్వర్యంలో బుధవారం తాడిచెర్లలో ఏఎమ్మార్ ప్రైవేట్ సంస్థ పీఆర్ఓ మల్లేష్ కు వినతిపత్రం ద్వారా వారు మండిపడ్డారు.
రోడ్డును త్వరగా పూర్తిచేసి రెండు జిల్లాల ప్రజలకు రవాణాసౌకర్యం కల్పించాలని వారు కోరారు. ధ్వంసం చేసిన బీటీ రోడ్డు నిర్మాణంలో నిర్లక్ష్యం వ్యవహరిస్తే బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహిస్తామని వారు హెచ్చరించారు. పెద్దపల్లి, జయశంకర్ జిల్లాల ప్రజల రవాణా సౌకర్యం కోసం రూ. 50 కోట్లతో బ్రిడ్జి నిర్మించిన మానేరు నది నుండి తాడిచర్ల వరకు బీటీ రోడ్డు సౌకర్యం లేక ప్రజలు నానాఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. మానేరు నది నుండి తాడిచర్ల వరకు గతంలో ఉన్న ఆర్ అండ్ బీ రోడ్డును ఏఎమ్మార్ ప్రైవేట్ సంస్థ తమ పరిధిలో ఉందని ధ్వంసం చేసి మట్టి రోడ్డు ఏర్పాటు చేయడంతో వాహనదారులు దుమ్ముదూలి, వర్షాకాలంలో బురద రోడ్డు ప్రయాణంతో ఇబ్బందులు పడుతున్నామని వెంటనే రోడ్డుపనులు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు.
రోడ్డు నిర్మాణంలో జిల్లా కలెక్టర్ భవిష్ మిశ్రా ఇచ్చిన ఆదేశాలను తుంగలో తొక్కడం మీ ఆంతర్యం ఏంటని వారు ప్రశ్నించారు. రానున్న వర్షాకాలం రోడ్డుప్రయాణం ప్రజలకు ఇబ్బంది కలగకుండా బీటి రోడ్డు సౌకర్యం కల్పించాలని. లేనిపక్షంలో ఏఎమ్మార్ కోల్ మైనింగ్ సైట్ కార్యాలయాన్ని గ్రామస్తుల ఆధ్వర్యంలో ముట్టడిస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాళేశ్వరం దేవస్థానం డైరెక్టర్ బండి రాజయ్యతో పాటు భూడిద మల్లేష్, మధు సూదన్ రావు, గుమ్మడి రవి, మేడగాని సాంబయ్య, రామిడి గట్టయ్య, సిద్దుల ఓదెలు, కామ శంకర్లు ఉన్నారు.