సోలార్‌.. బల్దియా బలాదూర్‌..!

ప్రజాధనం వృధా చేయడంలో వరంగల్‌ మహానగర పాలక

Update: 2024-09-29 14:06 GMT

దిశ,వరంగల్‌ టౌన్ : ప్రజాధనం వృధా చేయడంలో వరంగల్‌ మహానగర పాలక సంస్థ తీసికట్టు.అలాగే ఉద్యోగులను నియమించి, ఇంట్లో కూర్చోబెట్టి వేతనాలు చెల్లించడంలో గ్రేటర్‌ వరంగల్ కు సాటిలేదని తేల్చేసింది.మరోపక్క ప్రజల సొమ్మును గాలికొదిలేసి మహానగరాన్ని నయా ఓరుగల్లు తీర్చిదిద్దుతామని ప్రగల్భాలు పలుకుతున్నారు. నెత్తి మీద సూర్యశక్తిని పెట్టుకుని విద్యుచ్ఛక్తిని నెలనెలా వేలకు వేలు బిల్లులు చెల్లిస్తున్నారు. లక్షలు పోసి ఏర్పాటు చేసిన సోలార్‌ వ్యవస్థ నిర్వీర్యంగా మారినా నిశ్ఛేష్టులుగా ఏసీ గదుల్లో కాలం గడుపుతున్నారు.

పాత బిల్డింగ్‌పై పనికి రాకుండా...

వరంగల్‌ మహానగర పాలక సంస్థ ప్రధాన కార్యాలయం పాత బిల్డింగ్‌ ఎక్కి చూస్తే బల్దియా పటారం బట్టబయలు కాదు. పలు యంత్రాలు, వాహనాల కోసం కోట్లకు కోట్లు ముందస్తుగా రొక్కం చెల్లించి వాటి ఊసే మరిచిపోయిన గ్రేటర్‌ వరంగల్‌ కార్పొరేషన్‌లో లక్షలకు లక్షలు పోసి పాత బిల్దిండ్‌పై ఏర్పాటు చేసిన సోలార్‌ వ్యవస్థ పాలకులు, అధికారుల నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తుంది. ఒకటీ రెండు కాదు, 120 ప్యానెళ్ల నిర్వహణను బల్దియా పూర్తిగా గాలికొదిలేసింది. పగిలిన ప్యానెళ్లకు ఇక సూర్యుడే సాక్షిగా నిలుస్తున్నాడు.

వివరాలపై మెమ్మెపెప్పే..!

ఇక ఈ సోలార్‌ వ్యవస్థకు సంబంధించిన వివరాలు చెప్పడంలో అధికారులు మూగనోము ప్రదర్శిస్తున్నారు. సంబంధిత శాఖ అధికారులను అడిగినా... తమకేమీ తెలియదని చేతులు దులుపుకోవడం విస్మయం కలిగిస్తోంది. అసలు బల్దియా బిల్డింగ్‌పై సోలార్‌ సిస్టమ్‌ ఉన్నట్టు మేయర్‌ గుండు సుధారాణికి, కమిషనర్‌కైనా తెలుసా అనే అనుమానాలు కలుగుతున్నాయి.

ఇదొక్కటే కాదు..!

బల్దియాలో సోలార్‌ వ్యవస్థ ఒక్కటే కాదు, పలు వాహనాలు, శానిటేషన్‌ పరికరాలు నిరుపయోగంగా మారి జీడబ్ల్యూఎంసీ పాలనను వెక్కిరిస్తున్నాయి. మరమ్మతులకు పాలనాపరమైన అనుమతులు ఇవ్వడంలో అధికారుల నిర్లక్ష్యంతో హన్మకొండలోని రిపేర్ షెడ్డులో నెలల కొద్దీ మూల్గుతూ దర్శనమిస్తున్నాయి. దీంతో వరంగల్ మహా నగరం చెత్త గా మారుతోంది.

కమీషన్ల కోసం పాకులాట..!

బల్దియాలో పాత ఒక రోత గా మారింది.రిపేరుకు వచ్చిన వాటిని పట్టించుకోవడానికి అధికారులకు గానీ, పాలకులకు గానీ చేతులు రావడం లేదు. కమీషన్లకు కక్కుర్తిపడి కొత్తవాటిని కొనుగోలు చేసేందుకు కోట్లకు కోట్లు ఏజెన్సీలకు ముందస్తుగా కుమ్మరించి, ఆ తర్వాత వాటి ఊసే మరిచిపోతున్నారు. మూడేళ్ల కిందట శానిటేషన్‌ వాహనాలకు, పొగ యంత్రాలకు రూ.68లక్షలు చెల్లించిన బల్దియా... అవి ఎప్పుడొస్తాయో చెప్పే నాధుడే లేడు. వీటిపై మీడియాలో కథనాలు ప్రచురితమైన దున్నపోతు మీద వాన పడిన చందాన పాలకవర్గం, అధికారగణం తీరు ఆశ్చర్యానికి గురిచేస్తోంది. నవ్విపోదురుగాక నాకేటి... అన్నట్లుగా తాజాగా రెండు రోజుల క్రితం జరిగిన కౌన్సిల్‌ సమావేశంలో మరిన్ని వాహనాల కొనుగోలుకు తీర్మానం చేయడం గమనార్హం. ఇక.. ఈ సోలార్‌ వ్యవస్థ సైతం ప్రజాధనం వృధా ఖర్చులో జమ కావాల్సిందేనేమో! రాణి గారి పాలనలో పనికి రాని శక్తిగా నిర్వీర్య మై పోవాల్సిందేనేమో..!


Similar News