మండ‌లంలో కోట్ల రూపాయాల గోల్‌మాల్‌.. క‌లెక్టర్ మేడం.. ఈ అక్రమాలు చూడండి..!

ములుగు జిల్లా మంగ‌పేట మండ‌లంలోని ప‌లు పంచాయ‌తీల్లో కార్యద‌ర్శులు అక్రమాల పాల్పడ్డట్లుగా సాక్ష్యాల‌తో స‌హా దిశ వ‌రుస‌గా క‌థ‌నాలు ప్రచురిస్తూ వ‌స్తోంది.

Update: 2023-08-10 16:19 GMT

దిశ, ములుగు ప్రతినిధి: ములుగు జిల్లా మంగ‌పేట మండ‌లంలోని ప‌లు పంచాయ‌తీల్లో కార్యద‌ర్శులు అక్రమాల పాల్పడ్డట్లుగా సాక్ష్యాల‌తో స‌హా దిశ వ‌రుస‌గా క‌థ‌నాలు ప్రచురిస్తూ వ‌స్తోంది. బాధ్యతాయుతంగా అక్రమాల‌ను వెలికి తీసి అక్రమార్కుల‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఉన్నతాధికారులు కార్యద‌ర్శుల‌ను కాపాడే ప్రయ‌త్నం చేస్తున్నట్లుగా స్పష్టమ‌వుతోంది. విచార‌ణ జ‌రుపుతున్నామంటూ చెబుతున్నా.. వాస్తవంలో మాత్రం రికార్డుల‌ను తారుమారు చేసే అక్రమాల ప్రక్రియ కొన‌సాగుతున్నట్లుగా దిశ‌కు విశ్వస‌నీయంగా తెలిసింది. మంగ‌పేట మండ‌లంలోని రాజుపేట, బ్రాహ్మణపల్లి, మల్లూరు, కొత్తూరు మోట్లగూడెం, నర్సాయిగూడెం, వాగొడ్డుగూడెంలలో పంచాయతీ సొమ్మును పక్కదారి పట్టించినట్టుగా దిశ‌కు ల‌భించిన ఆధారాల ద్వారా స్పష్టమ‌వుతోంది. ఈ విష‌యాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి వివ‌ర‌ణ‌ల‌తో స‌హా దిశ క‌థ‌నాలు ప్రచురించింది.


అయితే ఉన్నతాధికారులు మాత్రం కమలాపురం కార్యద‌ర్శి మురళి, రాజుపేట కార్యద‌ర్శి ఉపేంద్ర, బ్రాహ్మణపల్లి కార్యద‌ర్శి రాజేందర్, మల్లూరు కార్యద‌ర్శి ఎల్ల స్వామి, కొత్తూరు మోట్లగూడెం కార్యద‌ర్శి సునీత, నర్సాయిగూడెం కార్యద‌ర్శి శ్రావణ్, వాగొడ్డుగూడెం కార్యద‌ర్శి కృష్ణ, చెరుపల్లి కార్యద‌ర్శి స్వప్నల‌కు కొమ్ము కాస్తూ కాపాడే ప్రయ‌త్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. రికార్డుల ప‌రిశీల‌న పేరిట ఓ వైపు జాప్యం చేస్తూనే.. మ‌రోవైపు అక్రమాల‌కు పాల్పడినట్లు ఆరోప‌ణలు ఎదుర్కొంటున్న కార్యద‌ర్శుల‌ను రెగ్యులరైజ్ చేసే ప్రక్రియ కొన‌సాగిస్తుండ‌టం ఉన్నతాధికారుల అస‌లు వైఖ‌రిని స్పష్టం చేస్తోంది. డీఆర్‌డీవో నాగ‌ప‌ద్మజ, డీపీవో వెంక‌య్యలు డీఎల్‌పీవో స్వరూప ఆధ్వర్యంలో రికార్డుల త‌నిఖీ, విచార‌ణ కొన‌సాగుతోంద‌ని చెప్పుకుంటు వ‌స్తున్నారు.

డీపీవో, ఎంపీవో ఎస్కేప్‌..!

మండలంలోని రెండు, మూడు మినహా అన్ని గ్రామపంచాయతీలలో పంచాయితీ నిధులను దారి మళ్లిన‌ట్లుగా ఆయా గ్రామాల ప్రజ‌లు ఆరోపిస్తున్నారు. వాస్తవానికి కార్యద‌ర్శుల అక్రమాల్లో మండ‌ల‌, జిల్లా స్థాయి అధికారుల పాత్ర కూడా ఉంద‌న్న విమ‌ర్శలు వినిపిస్తున్నాయి. మండ‌లంలోని అన్ని గ్రామ పంచాయ‌తీల్లో విస్తృతంగా త‌నిఖీలు చేసి అక్రమాల నిగ్గు తేల్చాల్సిన అధికారులు ఆచితూచిగా వ్యవ‌హ‌రిస్తూ, అస‌లు విష‌యాన్ని మ‌రుగున ప‌డేసేందుకు కాల‌యామ‌న చేస్తుండ‌టం అనుమానాల‌కు తావిస్తోంది. ఒక‌టి కాదు రెండు కాదు. ఇప్పటి వ‌ర‌కు ఏడు గ్రామ పంచాయ‌తీల్లో ఒక్కో గ్రామ పంచాయ‌తీ ప‌రిధిలోనే గ‌డిచిన రెండేళ్లలో రూ. ల‌క్షల్లో అక్రమాలు జ‌రిగిన‌, కార్యద‌ర్శులు, ఉన్నతాధికారుల జేబుల్లోకి చేరిన‌ట్లుగా తెలుస్తోంది. ఇందుకు వారు స‌మ‌ర్పించిన రికార్డులే సాక్ష్యాధారంగా నిలుస్తున్నాయి. ఫేక్‌, బినామీ పేర్ల మీద, చేయ‌ని ప‌నుల‌కు బిల్లులు సృష్టించి నిధుల‌ను మింగేశారు. ఏడు గ్రామ పంచాయ‌తీల్లో జ‌రిగిన అక్రమాల విలువ కోట్లల్లో ఉంటుంద‌ని తెలుస్తుండ‌గా ఎంపీవో, డీపీవో, డీఆర్‌డీవోల తీరు అనుమానాల‌కు తావిస్తోంది.

ఇష్టారాజ్యంగా రికార్డుల్లో రాత‌లు.. మ‌చ్చుకు కొన్ని నిద‌ర్శనాలు..

కొత్తూరు మోట్లగూడెం కార్యదర్శి డి. వినోద్ కుమార్ ఖాతాలోకి నిధులు మళ్లించిన వైనం బయట పెట్టిన దిశ దినపత్రిక కొత్తూరు మోట్లగూడెం గ్రామపంచాయతీలో జరిగిన మరో అంశాన్ని ప్రజల మధ్యకి తీసుకొచ్చింది. అలాగు శ్రీ జానకిరామ ఇంజనీరింగ్ అండ్ ఎలక్ట్రికల్స్ పేరు మీద వాటర్ వర్క్స్ పేరుతో, శానిటేషన్ మెటీరియల్స్ పేరుతో, మోటార్ కి సంబంధించిన మెటీరియల్స్ పేరుతో పెద్ద ఎత్తున నిధులు కొల్లగొట్టారు. అంతేకాకుండా ట్రాక్టర్ డీజిల్ ఖర్చు పేరుతో వివిధ రకాల ఖాతాలపై నిధులు దోచేశార‌ని ఆరోప‌ణ‌లున్నాయి. చెరుపల్లి గ్రామపంచాయతీలో జెండా వందనానికి కర్రల కొనుగోలు ఇతర సామగ్రి పేరుతో రూ.10350, క్రిమిటోరియంకి విద్యుత్ ఖర్చులకు రూ.2,13,707లు, ఫాగింగ్ మిషన్ రిపేర్ పేరుతో రూ.55,000లు ఖ‌ర్చు చేయ‌డం విశేషం.

కమలాపురం మేజర్ గ్రామపంచాయతీకి ప్రతి నెల రూ.లక్షల్లో రూపాయలలో గ్రామ అభివృద్ధికి నిధులు జమ చేస్తారు. సర్పంచులు లేని కారణంగా ఈ గ్రామ పంచాయతీకి కార్యదర్శి సాదు మురళి, ప్రత్యేక అధికారిగా ఉన్న ఎంపిఓ పొదిల్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీకి సంబంధించిన అన్ని ఆర్థిక లావాదేలు వీరిద్దరి సంతకాలతోనే సాగుతున్నాయి. గ్రామ పంచాయతీకి సంబంధించిన నిధుల దుర్వినియోగంలో ఇద్దరి పాత్ర ఉన్నట్టు ఆరోప‌ణ‌లున్నాయి. వాస్త‌విక ఖ‌ర్చుల‌కు రికార్డుల్లో న‌మోదు చేసిన లెక్క‌ల‌కు ఏమాత్రం పొంత‌న లేకుండా ఉండ‌టం విశేషం. జిల్లా ఆడిటింగ్ అధికారులు ఈ విష‌యాల‌ను గ‌మ‌నించ‌లేదా..? కార్య‌ద‌ర్శులు వారిని కూడా మేనేజ్ చేసేశారా? అన్న అనుమానాలు క‌ల‌గ‌క మాన‌డం లేదు.

క‌లెక్టర్ మేడం.. ఈ అక్రమాలు చూడండి..!

మంగ‌పేట మండ‌లంలోని వివిధ పంచాయ‌తీల్లో జ‌రిగిన అక్రమాల‌ను వెలుగులోకి తీసుకువ‌చ్చేందుకు క‌లెక్టర్ ఇలా త్రిపాఠి మేడం దృష్టిసారించాల‌ని ఆయా గ్రామాల ప్రజ‌లు డిమాండ్ చేస్తున్నారు. రూ.కోట్లలో జ‌రిగిన అవ‌క‌త‌వ‌క‌ల‌పై ఎంపీవో, డీపీవో, డీఆర్‌డీవోలు వ్యవ‌హ‌రిస్తున్న తీరుపై అనుమానాలు క‌లిగించేలా ఉన్నాయ‌ని మండిప‌డుతున్నారు. క‌లెక్టర్ స్పందించ‌కుంటే త్వర‌లోనే గ్రామ పంచాయ‌తీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి ద‌యాక‌ర్‌రావును క‌ల‌వ‌డంతో పాటు ఆయా గ్రామ పంచాయ‌తీల ఎదుట ధ‌ర్నాల‌కు దిగుతామ‌ని ప్రజ‌లు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి అక్రమాల నిగ్గు తేల్చి.. కార్యద‌ర్శుల దోపిడీని అధికారికంగా బ‌య‌ట పెడుతారో లేదో వేచి చూడాలి.


Similar News