మానుకోటలో హై టెన్షన్.. 144 సెక్షన్ విధింపు...

మ‌హ‌బూబాబాద్ జిల్లాలో టెన్ష‌న్ వాతావ‌ర‌ణం నెల‌కొంది. జిల్లాలో శాంతిభ‌ద్ర‌త‌ల‌కు విఘాతం క‌లిగే అవ‌కాశం ఉంద‌ని పేర్కొంటూ పోలీస్ శాఖ 144 సెక్ష‌న్ అమ‌లు చేస్తోంది.

Update: 2024-11-21 05:24 GMT

దిశ‌, మ‌హ‌బూబాబాద్ టౌన్‌ : మ‌హ‌బూబాబాద్ జిల్లాలో టెన్ష‌న్ వాతావ‌ర‌ణం నెల‌కొంది. జిల్లాలో శాంతిభ‌ద్ర‌త‌ల‌కు విఘాతం క‌లిగే అవ‌కాశం ఉంద‌ని పేర్కొంటూ పోలీస్ శాఖ 144 సెక్ష‌న్ అమ‌లు చేస్తోంది. ల‌గ‌చ‌ర్ల‌లో రైతుల అరెస్టును నిర‌సిస్తూ గురువారం మ‌హ‌బూబాబాద్ జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ ఆధ్వ‌ర్యంలో త‌ల‌పెట్టిన మ‌హాధ‌ర్నాకు పోలీసులు అనుమ‌తిని నిరాక‌రించారు. ఈ ధ‌ర్నాకు బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజ‌ర‌వుతార‌ని ముందుగా ప్ర‌క‌టించారు. అయితే మ‌హాధ‌ర్నాకు పోలీసులు ప‌ర్మిష‌న్ ఇవ్వ‌క‌పోవ‌డంతో బుధ‌వారం రాత్రి బీఆర్ఎస్ జిల్లా అధ్య‌క్షురాలు, మాజీ ఎంపీ మాలోతు క‌విత‌, బీఆర్ఎస్ నాయ‌కుడు, రాజ్య‌స‌భ స‌భ్యుడు వ‌ద్దిరాజు ర‌విచంద్ర‌, ఎమ్మెల్సీ పోచంప‌ల్లి శ్రీనివాస‌రెడ్డి, ఎమ్మెల్సీ ర‌వీంద‌ర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు శంక‌ర్‌నాయ‌క్‌, రెడ్యానాయ‌క్ స‌హా జిల్లాకు చెందిన ముఖ్య నేత‌లు మ‌హ‌బూబాబాద్‌ ఎస్పీ కార్యాల‌యం ఎదుట బుధ‌వారం రాత్రి 11 గంట‌ల వ‌ర‌కు నిర‌స‌న వ్య‌క్తం చేశారు.


సంఘ‌ట‌న ఎక్క‌డ జ‌రిగిందో అక్క‌డే నిర‌స‌న వ్య‌క్తం చేసుకోవాల‌ని, ల‌గ‌చ‌ర్ల ఘ‌ట‌న‌తో సంబంధం లేద‌ని మానుకోట‌లో ధ‌ర్నాకు అనుమ‌తి ఇవ్వడం కుద‌ర‌ద‌ని ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేక‌న్ స్ప‌ష్టం చేశారు. దీంతో ధ‌ర్నాను వాయిదా వేసుకుంటున్న‌ట్లు మాజీ మంత్రి స‌త్య‌వ‌తిరాథోడ్ తెలిపారు. ఇదిలా ఉండ‌గా జిల్లాకు సంబంధంలేద‌ని ఘ‌ట‌న‌తో లింక్ పెడుతూ ధ‌ర్నా చేయ‌డం ఏంట‌ని కాంగ్రెస్ మ‌హ‌బూబాబాద్ ఎమ్మెల్యే ముర‌ళీనాయ‌క్‌, డోర్న‌క‌ల్ ఎమ్మెల్యే రాంచంద్రునాయ‌క్ పేర్కొన్నారు. అలాగే కాంగ్రెస్ నేత‌లు కూడా బీఆర్ఎస్ నేత‌ల తీరును త‌ప్పుబ‌డుతూ బుధ‌వారం ప్రెస్‌మీట్లు నిర్వ‌హించారు. విష‌యం అల్ల‌ర్ల‌కు దారితీసే అవ‌కాశం ఉంద‌నే నిఘా వ‌ర్గాల స‌మాచారంతో గురువారం జిల్లా వ్యాప్తంగా 144 సెక్ష‌న్‌ను అమ‌లు చేస్తున్నారు. అల్ల‌ర్ల‌కు య‌త్నించే వారిపై క‌ఠిన చ‌ర్య‌లు ఉంటాయ‌ని ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేక‌న్ ఇప్ప‌టికే హెచ్చ‌రించారు. గురువారం ఉద‌యం మానుకోట ప‌ట్ట‌ణంలోని ఎస్పీ కార్యాల‌యం నుంచి నెహ్రూ సెంట‌ర్ వ‌ర‌కు పోలీసులు క‌వాతు నిర్వ‌హించారు. న‌లుగురికి మించి ఎక్క‌డా గుమిగూడ‌వ‌ద్ద‌ని హెచ్చ‌రించారు. తాజా ప‌రిణామాల‌తో జిల్లా వ్యాప్తంగా హైటెన్ష‌న్ వాతావ‌ర‌ణం క‌నిపిస్తోంది.



 



Similar News