Collector : రేపు ప్రతి మండలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించాలి
జిల్లాలోని ప్రతి మండలం పరిధిలో ఒక ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం ప్రారంభించాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య అన్నారు.
దిశ, హనుమకొండ: జిల్లాలోని ప్రతి మండలం పరిధిలో ఒక ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం ప్రారంభించాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య అన్నారు. గురువారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాలులో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల కమిటీ సభ్యులు, ఏపీఎం లు, సీసీలు, వీవోఏలకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, నిర్వహణకు సంబంధించిన వివరాలను ధాన్యం కొనుగోలు కేంద్రాల కమిటీ సభ్యులు, ఏపీఎంలు, వీవోఏలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ.. డేటా ఎంట్రీ పక్కాగా చేయాలన్నారు. ప్రతి రోజు ఆన్లైన్ లో తప్పనిసరిగా నమోదు చేయాలన్నారు.
ప్రతి రైతుకు వ్యవసాయ అధికారులు అవగాహన కల్పించాలన్నారు. సన్న, దొడ్డు రకాల ధాన్యం వివరాలను కరెక్ట్ గా నమోదు చేయాలన్నారు. ఒకవేళ ఒకదానికి బదులుగా మరొకటి నమోదు చేస్తే బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాఫీగా సాగేటట్టు చూసుకోవాలన్నారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియకు సంబంధించిన ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, ఏపీఎంలు పాటించాల్సిన విధి విధానాలను వివరించారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీవో నాగ పద్మజ, జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి ఉమారాణి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి రవీందర్ సింగ్, పౌరసరఫరాల మేనేజర్ మహేందర్, జిల్లా మార్కెటింగ్ అధికారి అనురాధ, ఇతర అధికారులు పాల్గొన్నారు.