అకాల వర్షాలతో రైతుల ఆందోళన.. మండలంలో పూర్తయిన పంట నష్టం సర్వే
అకాల వర్షాలకు రైతన్నలు పూర్తిగా నష్టపోయారు. మండల వ్యాప్తంగా అకాల వర్షాలతో వందల ఎకరాల్లో మామిడి, వరి పంట నేలకొరకడమే కాకుండా కల్లాలపై రైతులు ఆరబెట్టిన ధాన్యం తడిసి ముద్దయింది.
దిశ, భీమదేవరపల్లి: అకాల వర్షాలకు రైతన్నలు పూర్తిగా నష్టపోయారు. మండల వ్యాప్తంగా అకాల వర్షాలతో వందల ఎకరాల్లో మామిడి, వరి పంట నేలకొరకడమే కాకుండా కల్లాలపై రైతులు ఆరబెట్టిన ధాన్యం తడిసి ముద్దయింది. దీంతో మండల వ్యాప్తంగా 320 ఎకరాల్లో మామిడి పంట,120 ఎకరాల్లో వరి పంట నష్టం జరిగినట్లు వ్యవసాయ అధికారులు నివేదికలు తయారు చేసి ప్రభుత్వానికి పంపించారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటంతా వర్షార్పణమౌతోంది. మండల వ్యాప్తంగా కోతలు పూర్తయి కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చిన ధాన్యం.. కొనుగోలు రూపొందుకోకపోవడంతో మాయదారి వానకు ఎక్కడికక్కడే తడిసి ముద్దవుతుంది.
తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్నిచోట్ల ధాన్యం వరదకు కొట్టుకుపోగా ఒడిసి పట్టిన ధాన్యానికి ఇప్పుడు మొలకలు వస్తున్నాయి. దీంతో తాము నిండా మునిగిపోయామంటూ రైతన్నలు ఆందోళన చెందుతున్నారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనేదెప్పుడు, తమ కష్టాలు తీరేది ఎప్పుడు అంటూ ఎదురుచూస్తున్నారు. తడిసిన ధాన్యాన్ని ఆరబెట్టేందుకు రైతులు రోడ్లు, ఖాళీ స్థలాలు వెతుకుతున్నారు.
2 కేంద్రాలే...!, మొదలైన ధాన్యం కొనుగోలు
మండలంలో కొత్తకొండ, వంగర గ్రామాల్లో రెండు ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ రెండు కేంద్రాల్లో కొనుగోలు ప్రారంభమయ్యాయి. కొత్తకొండ కేంద్రంలో ఇప్పటివరకు 2000 క్వింటాళ్ల ధాన్యాన్ని,వంగర కేంద్రంలో 1200 క్వింటాళ్ల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. ఈ లెక్కన మండల వ్యాప్తంగా 3200 క్వింటాళ్ల వరి ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేశారు. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ ప్రకటించిన క్షేత్రస్థాయిలో పరిస్థితి మందకోడిగానే సాగుతోంది.
ఇప్పటివరకు కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయకపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. తడిసిన ధాన్యాన్ని రోడ్లపై ఖాళీ స్థలాల్లో ఆరబెడుతూ ధాన్యాన్ని కాపాడుకునేందుకు అన్నదాతలు రేయింబవళ్లు వర్షాలతోనే తంటాలు పడుతున్నారు. మండలంలో ఎక్కడ చూసినా తడిసిన ధాన్యం కుప్పలు కనిపిస్తున్నాయి. తడిసిన, మొలకెత్తిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తరలించిన అనుమతులు లేక కొనుగోలు చేయడం లేదు.
పూర్తయిన పంట నష్టం సర్వే
అకాల వర్షాలతో మండలంలో దెబ్బతిన్న పంటలను పరిశీలించడం జరిగింది. మండలంలో జరిగిన పంట నష్టం సర్వే పూర్తి చేశాము. మండలంలో 440 ఎకరాల్లో పంట నష్టం జరిగింది. దానికి సంబంధించిన నివేదికలు ప్రభుత్వానికి అందజేశాము.మరో ఐదు రోజులు వర్షాలు ఉన్న కారణంగా రెండవ దఫా పంట నష్టం సర్వే ఉండే అవకాశాలు ఉన్నాయి.
అఫ్జల్ పాషా మండల వ్యవసాయ అధికారి
తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదు
మండలంలో రెండు సెంటర్లు ప్రారంభించి ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నాము.కానీ తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదు. తడిసిన ధాన్యం కొనుగోలు గూర్చి ప్రభుత్వం నుండి మాకు ఎలాంటి అనుమతులు రాలేదు. ఇప్పటివరకు 320 క్వింటాళ్ల ధాన్యాన్ని కొనుగోలు చేశాము.
దేవానంద్ ఏపీఎం