అన్నదాత కడుపు "మంట".. నడిరోడ్డుపై వరి ధాన్యాన్ని తగలబెట్టి నిరసన
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలోని అబ్బాయి పాలెం గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రం పట్ల రైతులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
దిశ, మరిపెడ : మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలోని అబ్బాయి పాలెం గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రం పట్ల రైతులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. పూర్తిస్థాయిలో ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదని తాలు, తరుగు పేరుతో ఒక బస్తాకు నాలుగు నుంచి ఐదు కేజీల కోత పెడుతున్నారని ఎక్కడి ధాన్యం నిలువలు అక్కడే ఉన్నాయంటూ.. గత 20 రోజుల నుంచి పూర్తిస్థాయిలో వడ్ల కాంటాలు ఎగుమతులు జరగడం లేదంటూ.. రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
దీంతో ఆగ్రహించిన రైతన్నలు మహబూబాబాద్ -సూర్యపేట జాతీయ రహదారి పైన వరి ధాన్యాన్ని కుప్పగా పోసి నిప్పు పెట్టి నిరసన వ్యక్తం చేస్తూ రైతులకు న్యాయం చేయాలి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ట్రాఫిక్ సమస్య తలెత్తడంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులతో రైతులకు వాగ్వాదం ఏర్పడింది. మీ సమస్యను స్థానిక తహశీల్దార్ దృష్టికి తీసుకువెళ్తామని చెప్పడంతో చేసేదేమీ లేక రైతులు అక్కడి నుంచి వెనుదిరిగి వెళ్లారు.